హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జూన్ 2 నుంచి 21 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. గత దశాబ్దంలో సాధించిన ప్రగతి, తెలంగాణ అస్తిత్వానికి అద్దం పట్టే అధికారిక లోగోను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సోమవారం సచివాలయంలో ఆవిష్కరించారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో రాష్ట్ర సాధన నుంచి నేటిదాకా పదేండ్లకు చేరుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగా ప్రభుత్వం రూపొందించిన లోగోను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సెక్రటేరియట్ లోని తన ఛాంబర్ లో సోమవారం ఆవిష్కరించారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన అధికారిక లోగోలో అంబేద్కర్ సచివాలయం, 125 అడుగుల డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం, కాళేశ్వరం వంటి నీటిపారుదల ప్రాజెక్టులు, నిరంతర విద్యుత్ సరఫరా, వ్యవసాయం, మిషన్ భగీరథ, యాదాద్రి వంటి సాంస్కృతిక ఆధ్యాత్మిక క్షేత్రాలు, హైదరాబాద్ మెట్రో రైలు, టి-హబ్ లు అన్నీ పొందుపరిచారు.
ఇది కాకుండా, తెలంగాణ తల్లి, బతుకమ్మ, బోనాలు, పాలపిట్ట (రాష్ట్ర పక్షి), కొత్తగా నిర్మించిన అమరవీరుల స్మారక నిర్మాణాలతో రాష్ట్ర ఖ్యాతిని ప్రతిబింబించేలా లోగోను రూపొందించారు. 21 రోజుల పాటు జరిగే వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. గ్రామస్థాయి నుంచి ప్రజల చురుకైన భాగస్వామ్యంతో ప్రతి రంగంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలను చాటిచెప్పేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
జూన్ 2న కొత్త సచివాలయంలో ప్రారంభోత్సవం నిర్వహించనున్నట్లు కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం తొలి దశాబ్దం రాష్ట్ర చరిత్రలో ఒక గొప్ప సందర్భం. ఒకప్పుడు అవమానాలకు, అపోహలకు, అవహేళనలకు గురైన తెలంగాణ ఇప్పుడు అభివృద్ది, చైతన్యంతో చూసేవారి కళ్లు కుట్టేలా రాష్ట్ర పగతి ఉందని.. రాష్ట్ర సాధించిన అభివృద్ధితో తెలంగాణ దేశానికే రోల్‌మోడల్‌గా అవతరించిందన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్ రెడ్డి, బాల్క సుమన్, సీఎం ప్రధాన సలహాదారు సోమేశ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ శాంతి కుమారి, ఆర్ధికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.