Kavitha: కేసీఆర్ కూతురు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీకి పూర్తిగా దూరమైన విషయం తెలిసిందే. సొంత తండ్రి, అన్నపైనే పోరుకు దిగిన కవిత ఇక ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు.
భారత రాష్ట్ర సమితితో తెగదెంపులు చేసుకున్న మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, స్థానిక సంస్థల ఎన్నికల వైపు అడుగులు వేస్తున్నారు. పార్టీ నుంచి సస్పెన్షన్ అనంతరం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన ఆమె, ప్రస్తుతం రాజకీయంగా కొత్త దారిని ఎంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
25
జాగృతి పార్టీ రిజిస్ట్రేషన్ ఆలస్యం
కవిత స్థాపించిన తెలంగాణ జాగృతి పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. అధికారికంగా పార్టీ గుర్తు రావడానికి కనీసం నాలుగు నుంచి ఐదు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోపు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 27న విడుదల కానుండటంతో సమయం తక్కువగా మారింది. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గంపై కవిత దృష్టి పెట్టారు.
35
ఫార్వర్డ్ బ్లాక్‌తో ఒప్పందం.. సింహం గుర్తు ఖరారు
ఎన్నికల బరిలో దిగేందుకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో అవగాహనకు వచ్చినట్టు సమాచారం. ఈ పార్టీకి చెందిన సింహం గుర్తుతో జాగృతి అభ్యర్థులు పోటీ చేసేలా ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సింహం గుర్తు గతంలో పలువురు ఇండిపెండెంట్లు, తిరుగుబాటు అభ్యర్థులకు లాభం చేకూర్చిన చరిత్ర ఉంది. గుర్తు సులభంగా గుర్తుపడేలా ఉండటం, రెబల్ ఇమేజ్ ఇవ్వడం దీనికి ప్రధాన బలం.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని చోట్లా జాగృతి అభ్యర్థులను బరిలో దించాలనే ఆలోచనలో కవిత ఉన్నారు. ఈ ఎన్నికల వరకూ ఫార్వర్డ్ బ్లాక్ బీ ఫారమ్‌లపై పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మున్సిపాలిటీలతో పాటు భవిష్యత్తులో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకూ ఇదే గుర్తుతో వెళ్లాలనే ఆలోచనపై జాగృతి నేతలు చర్చలు జరుపుతున్నారు.
55
ఓటు బ్యాంకుపై ప్రభావం ఎవరిది?
కవిత ఎన్నికల బరిలో దిగడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. సింహం గుర్తుతో పోటీ చేసే అభ్యర్థులు ఎవరి ఓట్లను ప్రభావితం చేస్తారనే అంశంపై చర్చ జరుగుతోంది. ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలుస్తుందా, లేక అధికార పార్టీ ఓట్లకు గండి పడుతుందా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా గులాబీ పార్టీలో ఈ పరిణామం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఓటర్లు కవితకు ఎంత మేర మద్ధతు ఇస్తారన్నది ఈ ఎన్నికల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది.