
ఈ రోజుల్లో ఒక్క రూపాయికి కనీసం చాక్లెట్ కూడా దొరకని పరిస్థితి. కానీ, హైదరాబాద్ నడిబొడ్డున కేవలం ఒక్క రూపాయికే కడుపు నిండా రుచికరమైన భోజనం లభిస్తోంది అంటే మీరు నమ్ముతారా? అవును, ఇది నిజం. ఆకలితో అలమటించే పేదవారి కోసం 'కరుణ కిచెన్' ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టింది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్డులోని పాత మనోహర్ టాకీస్ గల్లీలో అడుగుపెడితే చాలు, ఒక పొడవైన క్యూ కనిపిస్తుంది. ఒడిశా, బీహార్, పశ్చిమ బెంగాల్, తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి వచ్చిన వలస కూలీలు, పేదలు ఎంతో ఓపికగా అక్కడ నిలబడి ఉంటారు. వీరందరూ 'కరుణ కిచెన్' అనే పోస్టర్ ఉన్న ఒక చిన్న దుకాణం ముందు భోజనం కోసం వేచి చూస్తుంటారు.
హైదరాబాదీ వంటకాలలో ఎంతో గుర్తింపు పొందిన, ఎంతో రుచికరమైన ఖట్టీ కిచడీని ఇక్కడ కేవలం ఒక్క రూపాయికే అందిస్తున్నారు. ఈ కిచెన్ వెనుక ఉన్నది జార్జ్ రాకేష్ బాబు అనే సామాజిక కార్యకర్త. అనేక మంది ఆకలి తీరుస్తున్న ఆపద్బాంధవుడు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని మనోహర్ టాకీస్ గల్లీ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. అయితే, గత ఒక నెల రోజులుగా అక్కడ కనిపిస్తున్న దృశ్యం బాటసారులను ఆకర్షిస్తోంది. మధ్యాహ్నం అయిందంటే చాలు, ఆకలిగొన్న వందలాది మంది ప్రజలు కరుణ కిచెన్ ముందు బారులు తీరుతున్నారు.
వీరిలో అత్యధికులు దినసరి కూలీలు, నిరాశ్రయులు, ఇతర రాష్ట్రాల నుండి బతుకు తెరువు కోసం నగరానికి వచ్చిన వలస జీవులు. రోజూ మధ్యాహ్నం అక్కడ ఇటువంటి దృశ్యమే కనిపిస్తుంది. బయట జనం ఆత్రుతగా భోజనం కోసం ఎదురుచూస్తుండగా, లోపల జార్జ్ రాకేష్ బాబు చకచకా ప్లేట్లను సిద్ధం చేయడంలో నిమగ్నమై కనిపిస్తుంటారు. తర్వాత వారికి భోజనం అందిస్తారు.
కరుణ కిచెన్‌లో వడ్డించే ఆహారం నాణ్యతలో ఏమాత్రం రాజీపడటం లేదు. వేడి వేడి ఖట్టీ కిచడీతో పాటు, నంచుకోవడానికి దోసకాయ ముక్కను కూడా వడ్డిస్తారు. ఇది హైదరాబాదీలకు ఎంతో ఇష్టమైన కంఫర్ట్ ఫుడ్. ఒక్క రూపాయి చెల్లించి ఒక ప్లేట్ భోజనం తీసుకోవచ్చు.
ఒకవేళ ఇంకా ఆకలిగా అనిపిస్తే, మరొక రూపాయి టోకెన్ తీసుకుని, మరో ప్లేట్ రైస్ కూడా తీసుకునే వెసులుబాటు ఇక్కడ ఉంది. ఈ సమయంలో చాలా మంది ఇక్కడికి ఆకలితో వస్తారు. పేదరికం, ఆకలి అనేవి మనిషికి సంబంధించిన రెండు ప్రాథమిక అవసరాలని, వాటిని మొదటగా పరిష్కరించాలని ఆయన బలంగా నమ్ముతారు. అందుకే "ప్రజలు ఆకలితో ఉన్నారు, ఇప్పుడు లంచ్ టైమ్ కాబట్టి మేము వెంటనే సర్వీస్ ప్రారంభించాలి" అని ఆ సమయంలో జార్జ్ రాకేష్ బాబును పలకరిస్తే చెబుతుంటారు.
కరుణ కిచెన్ ప్రారంభించి దాదాపు నెల రోజులు అవుతోంది. అయితే దీని వెనుక ఒక బలమైన స్ఫూర్తి ఉంది. భారత క్రికెట్ కోచ్ గౌతమ్ గంభీర్ న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన 'జన్ రసోయ్' (Jan Rasoi) కాన్సెప్ట్ గురించి తెలుసుకున్న తర్వాత జార్జ్ రాకేష్ బాబుకు ఈ ఆలోచన వచ్చింది.
గత మూడు, నాలుగేళ్లుగా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోని అభాగ్యులకు జార్జ్ వివిధ మార్గాల్లో సేవ చేస్తున్నారు. "ఇటీవల నేను జన్ రసోయ్ గురించి విన్నాను. ఆకలిని తీర్చడమే నేను చేయగలిగే అత్యంత ప్రాథమిక సహాయం అని నాకు అనిపించింది," అని గుడ్ సమారిటన్స్ ఇండియా (Good Samaritans India) అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్న జార్జ్ రాకేష్ బాబు పేర్కొన్నారు.
ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు ఈ అన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది. ప్రారంభించిన తక్కువ సమయంలోనే ఈ పథకం సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం ప్రతిరోజూ దాదాపు 300 మంది పేదలు ఇక్కడ కడుపు నిండా భోజనం చేస్తున్నారు. వీరందరూ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నవారే కావడం గమనార్హం.
కేవలం ఒక్క రూపాయికే ఖట్టాతో కూడిన రైస్ ఐటమ్ లభించడం వారికి ఒక వరం లాంటిది. ఈ చొరవ వల్ల ఎంతో మంది పేదలు తమ ఆకలిని తక్కువ ఖర్చుతో తీర్చుకోగలుగుతున్నారు.
వలస కూలీలకు వరం
కరుణ కిచెన్‌లో భోజనం చేస్తున్న వారిలో ఎక్కువ మంది జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న వారే. వారిలో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. కరుణ కిచెన్‌కు రెగ్యులర్‌గా వస్తుంటారు.
అక్కడకు భోజనం కోసం వచ్చిన ఒక వ్యక్తి మాట్లాడుతూ.. ఈ సదుపాయం నాకు దేవుడు ఇచ్చిన వరం లాంటిది. ఎందుకంటే, నేను కేవలం రూ. 1 లేదా రూ. 2 ఖర్చు చేసి నాకు కావలసినంత తినగలుగుతున్నానని సంతోషం వ్యక్తం చేశారు.
ఇలాంటి ఎంతో మందికి కరుణ కిచెన్ అండగా నిలుస్తోంది. జార్జ్ రాకేష్ బాబు చేస్తున్న ఈ సేవా కార్యక్రమం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకునే వారు లేదా సహాయం చేయాలనుకునే వారు www.goodsamaritansindia.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.