Published : Dec 08, 2025, 07:43 AM ISTUpdated : Dec 08, 2025, 07:49 AM IST
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు పడిపోయి చలిగాలులు వీస్తున్నాయి. రాబోయే వారంరోజులు తెలంగాణలో పరిస్థితి ఎలా ఉండనుందంటే…
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి... కొన్నిచోట్ల ఏకంగా సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. రాత్రుళ్లు, తెల్లవారుజామున విపరీతమైన పొగమంచు కురుస్తోంది... దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలా ఇన్నిరోజులు వర్షాలు... ఇప్పుడు చలిగాలులు తెలుగు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరికొన్నిరోజులు వాతావరణ పరిస్థితులు ఇలాగే ఉంటాయని... ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశాలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు.
25
ఈ మూడ్రోజులు జాగ్రత్త...
డిసెంబర్ 7 (ఆదివారం) నుండి 16 వరకు తెలంగాణలో ఎముకలు కొరికే చలి ఉంటుందని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు. ఈ ఏడురోజుల్లో ఓ నాల్రోజులు (డిసెంబర్ 10 నుండి 13 వరకు) మాత్రం చలి తారాస్థాయికి చేరుతుందని... ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతాయని హెచ్చరించారు. మొత్తంగా ఈ వారమంతా తెలంగాణ గజగజ వణకడం ఖాయమని వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు.
35
ఈ తెలంగాణ జిల్లాల్లోనే చలి పీక్స్
ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. ఆదిలాబాద్, కొమ్రంభీ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 6-9 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయట. ఇక హైదరాబాద్ తో పాటు మిగతా జిల్లాల్లో కూడా 9 నుండి 12 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్చ్ నమోదవుతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటించారు.
ప్రస్తుతం సాయంత్రం అయ్యిందంటే చాలు చలి మొదలవుతోంది... అర్థరాత్రి నుండి తెల్లవారుజాము వరకు పీక్స్ లో ఉంటోంది. ఇక డే టైమ్ లో మాత్రం సాధారణ వాతావరణం ఉంటోంది.
హైదరాబాద్ లో ఇవాళ (సోమవారం) తెల్లవారుజామున సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శేరిలింగంపల్లిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) పరిసరాల్లో 9 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వెదర్ మ్యాన్ వెల్లడించారు. ఇక పటాన్ చెరు బిహెచ్ఈఎల్ లో 10.6, రాజేంద్రనగర్ లో 10.7, గచ్చిబౌలిలో 11, శివరాంపల్లిలో 12.4, మచ్చ బొల్లారంలో 13.1, ఆల్వాల్ లో 13.2, జీడిమెట్లలో 13.3, కుత్బుల్లాపూర్ లో 13.4, కూకట్ పల్లిలో 13.5, బేగంపేటలో 13.6, మాదాపూర్ లో 14.5 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు.
55
ఏపీని వణికిస్తున్న చలి
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా చలిగాలుల తీవ్రత పెరిగింది... ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలితీవ్రత ఎక్కువగా ఉంటోంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కిలగాడ ఏజెన్సీ ప్రాంతంలో అత్యల్పంగా 7.7 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. డుబ్రిగూడలో 8.2 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇలాగే చలితీవ్రత ఎక్కువగా ఉంటుంది... కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.