IMD Rain Alert : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం... ఈ ప్రాంతాల్లో ఇక అల్లకల్లోలమే

Published : Oct 09, 2025, 01:23 PM IST

IMD Rain Alert : బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.. ఇదికాస్త అల్పపీడనంగా బలపడుతోందని వాతావరణ శాఖ అంచనావేస్తోంది. దీంతో మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు మొదలవుతాయని హెచ్చరిస్తోంది.  

PREV
16
మరికొన్నిరోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

IMD Rain Alert : ఈ వర్షాకాలం ఆరంభంలో వానలకోసం ఎదురుచూసిన తెలుగు ప్రజలే ఇప్పుడు ఇవేం వానల్రా నాయనా వదలట్లేదు అనుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ జూన్, జులైలో పెద్దగా వర్షాలు లేవు... కానీ ఆగస్ట్, సెప్టెంబర్ లో వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. కుండపోత వర్షాలతో నదులు, వాగులువంకల ఉద్ధృతంగా ప్రవహించి, జలాశయాలు, చెరువులు, కుంటలు ఉప్పొంగి వరదలు సంభవించాయి. వర్షాకాలం ముగింపుకు చేరుకున్న ఈ అక్టోబర్ లో కూడా వర్షాలు వదిలిపెట్టడంలేదు... ఇప్పటికే ఈ నెలలో భారీ వర్షాలు కురవగా మరికొన్నిరోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

26
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు

ప్రస్తుతం చత్తీస్ గడ్ నుండి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ మీదుగా ద్రోణి కొనసాగుతోందని... దీనికి ఉపరితల ఆవర్తనం తోడవుతోందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక ఉత్తర బంగాళాఖాతంలో ఇప్పటికే వాతావరణ పరిస్థితులు మారిపోయి ఉపరితల ఆవర్తనం ఏర్పడిందట... దీంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది. ఈ ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో నేడు(గురువారం) కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు మొదలవుతాయని ప్రకటించింది.

36
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇలా అక్టోబర్ 11 నాటికి అల్పపీడనం ఏర్పడుతుందని.. ఆ తర్వాత భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అంటే వచ్చేవారం మళ్ళీ కుండపోత వర్షాలు తప్పవన్నమాట. అల్పపీడనం బలపడి వాయుగుండం మారితే వర్షతీవ్రత మరింత పెరిగి వరద పరిస్థితులు ఏర్పడవచ్చు... కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.

46
అక్టోబర్ 9, 10 తేదీల్లో వర్షాలే వర్షాలు

ఇదిలావుంటే తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండనున్నాయో ఇండియన్ మెటలర్జికల్ డిపార్ట్మెంట్ (IMD) వెల్లడించింది. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో అక్టోబర్ 9,10 తేదీల్లో కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అలాగే తెలంగాణలో రాబోయే నాలుగురోజులు పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండి ప్రకటించింది.

56
తెలుగు రాజధానుల్లో అత్యధిక వర్షపాతం

బుధవారం నుండి గురువారం ఉదయం (అక్టోబర్ 8-9) వరకు దేశవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఇలా కర్ణాటక చిత్రదుర్గ్ లో 8 సెంటి మీటర్ల వర్షపాతం నమోదయ్యింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో 3సెం.మీ, ఏపీ రాజధాని అమరావతిలో 2 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు ఐఎండి ప్రకటించింది.

66
దేశవ్యాప్తంగా రాబోయే రెండుమూడు రోజులు వర్షాలే

తమిళనాడు, కేరళ & మాహే లో అక్టోబర్ 9-12 వరకు, కర్ణాటకలో అక్టోబర్ 9,10 తేదీల్లో పిడుగులతోకూడిన మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరించింది. రాబోయే రెండ్రోజులు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్ అస్సాం, మేఘాలయా, నాగాలాంండ్, మణిపూర్, మిజోరా రాష్ట్రాల్లో కూడా అక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

Read more Photos on
click me!

Recommended Stories