Hyderabad Water Crisis: ముంచుకొస్తున్న నీటి ముప్పు.. ప్రజలకు ముందస్తు హెచ్చరికలు.. ఎందుకీ పరిస్థితి?

Published : Oct 25, 2026, 10:15 AM IST

Hyderabad Water Crisis: వర్షపాతం లోటు, ఎల్ నినో ఎఫెక్ట్ వల్ల హైదరాబాద్‌లో భూగర్భ జలాలు అడుగంటి తీవ్ర నీటి కొరత పరిస్థితులు ముంచుకొస్తున్నాయని ప్రభుత్వం ప్రజలను అలర్ట్ చేస్తోంది. అప్రమత్తమైన ప్రభుత్వం నీటి పొదుపుపై ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.

PREV
15
భాగ్యనగరంలో నీటి గండం.. ప్రభుత్వం ముందస్తు అలర్ట్

శరవేగంగా విస్తరిస్తున్న తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో రాబోయే రోజుల్లో తాగునీటి కష్టాలు తప్పవనే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, ఐటీ కారిడార్లతో నిండిన భాగ్యనగరంలో డిసెంబర్ నాటికి నీటి కష్టాలు మొదలవుతాయనీ, పొదుపుగా నీటిని వినియోగించాలని హైదరాబాద్ జలమండలి ప్రజలను అప్రమత్తం చేస్తోంది.

అక్టోబర్ నెల నాటికే పలు నివాస ప్రాంతాల్లో బోర్‌వెల్లు ఇంకిపోవడంతో పాటు భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి. ఈ క్రమంలో ముంచుకొస్తున్న తాగునీటి ముప్పుపై తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ జలమండలి (HMWSSB) పౌరులను ముందస్తుగా హెచ్చరిస్తూ అప్రమత్తం చేస్తున్నాయి.

25
ఎల్ నినో ఎఫెక్ట్.. పడిపోయిన వర్షపాతం

హైదరాబాద్ పరిధిలో ప్రధానంగా వర్షపాతం లోటు వల్ల ఈ పరిస్థితి దాపురించింది. పసిఫిక్ మహాసముద్రంలో తీవ్రమైన ఎల్ నినో ప్రభావం చూపడంతో వాతావరణంలో అనేక మార్పులు వచ్చి, ఊహించిన స్థాయిలో రాష్ట్రంలో వర్షాలు కురవలేదు. నగర పర్యవేక్షణ పరిధిలోని మొత్తం 46 మండలాలకు గాను ఏకంగా 45 మండలాల్లో లోటు వర్షపాతం నమోదవ్వడం విశేషం. సాధారణ వర్షపాతం కంటే దాదాపు 20% నుండి 31% వరకు తీవ్ర కొరత ఏర్పడటంతో నగరానికి నీరందించే ప్రధాన జలాశయాల్లోకి ఆశించిన స్థాయిలో నీటి ప్రవాహం రాకుండా పోయింది.

35
బోర్లు ఎండిపోతున్నాయి.. భూగర్భ జలాలు తగ్గుతున్నాయి

వర్షాలు తగ్గడానికి తోడు, రోజువారీ అవసరాల కోసం అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ సముదాయాల్లో పరిమితి లేకుండా బోర్లు వేయడం తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టింది. గతేడాది గణాంకాలతో పోలిస్తే నగర సగటు భూగర్భ జలమట్టం ఏకంగా 5 మీటర్ల మేర దిగువకు పడిపోయింది. ముఖ్యంగా కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, తిరుమలగిరి, మారేడ్‌పల్లి వంటి ఏరియాల్లో నీటిమట్టం 30 నుండి 40 మీటర్ల లోతుకు పడిపోవడం గమనార్హం. నగరానికి సంబంధించిన వార్షిక భూగర్భ జల నిల్వల్లో దాదాపు 70 శాతం నీరు ఎండాకాలం ప్రారంభానికి ముందే ఖాళీ కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

45
కాంక్రీట్ జంగిల్‌గా నగరం.. ప్రాజెక్టులపై పెరుగుతున్న ఒత్తిడి

నగరం వేగంగా అభివృద్ది చెందుతున్న క్రమంలో సహజ నీటి నిల్వ ప్రాంతాలైన చెరువులు, కుంటలు మాయమై కాంక్రీట్ మయమయ్యాయి. దీనివల్ల పడిన వర్షపు నీరు భూమిలోకి ఇంకే అవకాశం లేక డ్రైనేజీల పాలవుతోంది. మరోవైపు నగరానికి దాహార్తి తీర్చే సింగూరు, మంజీరా, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల్లో నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. జలమండలి అధికారులు కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల ద్వారా సరఫరాను పెంచేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్ - సప్లై వ్యత్యాసాన్ని భర్తీ చేయడం పెద్ద సవాలుగా మారింది. ఇలా అన్ని అంశాలు హైదరాబాద్ లో నీటి లభ్యత పై ప్రభావం చూపిస్తున్నాయి.

55
నివారణ చర్యల్లో తెలంగాణ ప్రభుత్వం.. జలమండలి ప్లాన్

పరిస్థితి మరింత దిగజారకుండా నిరోధించడానికి తెలంగాణ ప్రభుత్వం, జలమండలి రంగంలోకి దిగాయి..

• ఇంకుడు గుంతలు తప్పనిసరి: కాలనీలు, ప్రతి అపార్ట్‌మెంట్‌లో ఇంకుడు గుంతల ఏర్పాటును ప్రభుత్వం తప్పనిసరి చేస్తోంది.

• ట్యాంకర్ల సరఫరా స్పందన: రాబోయే పరిస్థితులను పరిగణలోకి తీసుకుని బోర్లు ఎండిపోయిన ప్రాంతాలకు తాగునీటి ట్యాంకర్ సరఫరాను వేగవంతం చేసేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను సిద్ధం చేస్తున్నారు.

• నీటి పొదుపు నిబంధనలు: వాహనాలు కడగడం, గార్డెనింగ్ వంటి పనులకు మంచినీటిని వృథా చేయకుండా ఆంక్షలు విధించడమే కాకుండా, పౌరులు స్వీయ నియంత్రణ పాటించాలని కోరుతున్నాయి.

• ప్రజలందరూ నీటిని పొదుపుగా వాడుకోవాలనీ, రాబోయే కష్టకాలానికి సిద్ధంగా ఉండాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగరవాసులను, తెలంగాణ రైతాంగాన్ని అప్రమత్తం చేసిన సంగతి తెలిసిందే.

Read more Photos on
click me!

Recommended Stories