బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో శని, ఆదివారాల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. అలాగే ఏలూరు, కృష్ణా, చిత్తూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
వర్షాలు కురిసే సమయంలో ఉరుములు, మెరుపులు సంభవించే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని APSDMA ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు. కాబట్టి రైతులు, వ్యవసాయ కూలీలు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ఉండాలని సూచించారు... వర్షం కురిసే సమయంలో చెట్లకింద ఉండరాదని సూచించారు.
అల్పపీడనం తుపానుగా బలపడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందంటోంది APSDMA సోమవారం కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉండగా, మంగళ, బుధవారాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.