Hyderabad: హైదరాబాద్ నగరం శర వేగంగా విస్తరిస్తోంది. అందుకు అనుగుణంగానే జనాభా భారీగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో మౌలిక సదుపాయాల కల్పన కూడా జరుగుతోంది. అయితే తాజాగా నగరంలో మరో అద్భుత ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారు.
హైదరాబాద్‌లో ఏళ్లుగా కొనసాగుతున్న ఎత్తైన విద్యుత్ తీగల సమస్యకు ప్రభుత్వం పెద్ద ప‍్రాజెక్ట్‌తో పుల్‌స్టాప్ పెట్టేందుకు సిద్ధమైంది. పెరిగిన జనాభా, పెరిగిన నిర్మాణాల కారణంగా నగరంలో ఓవర్‌హెడ్ కేబుళ్లు ప్రధాన ఆటంకంగా మారాయి. ఈ పరిస్థితిని మార్చడానికి భూగర్భ విద్యుత్ వ్యవస్థను తీసుకురావాలనే నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా రూ. 4,051 కోట్లు ఖర్చు చేయనున్నారు.
25
నాలుగు మెట్రో జోన్‌లలో విస్తృత భూగర్భ విద్యుత్ పనులు
సదరన్‌డిస్కమ్ పరిధిలో 3,899 కిలోమీటర్ల ఓవర్‌హెడ్ లైన్లు కొత్త భూగర్భ కేబుల్స్‌గా మారుతాయి. ఇందులో 33 కేవీ, 11 కేవీ, లో-వోల్టేజ్ లైన్లు ఉన్నాయి. ఇందుకోసం ప్రస్తుతం బంజారాహిల్స్, సికింద్రాబాద్, హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్ వంటి నాలుగు మెట్రో జోన్‌లను ఎంపిక చేశారు. ఈ ప్రాంతాల్లో భారీ జనాభాతో పాటు, ఎత్తైన కేబుళ్లు రోడ్ల పనులకు అడ్డంకిగా మారడంతో తొలి దశలో వీటిని ఎంపిక చేశారు.
35
నిధులు డిస్కమ్ బాధ్యత
ప్రాజెక్ట్ కోసం అవసరమైన రూ. 4,051 కోట్లు సదరన్‌డిస్కమ్ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అంతర్గత నిధులు లేక రుణాల ద్వారా ఈ మొత్తం సేకరించనుంది. తద్వారా ప్రభుత్వ ఖజానాపై తక్షణ భారం పడదు. భవిష్యత్తులో టారిఫ్ మార్పులు, అదనపు ఆదాయ వనరుల ద్వారా ఖర్చులు తిరిగి రాబట్టుకునే అవకాశం ఉంది.
అండర్‌గ్రౌండ్ కేబులింగ్ ప‍్రాజెక్ట్‌లో టెలికాం సంస్థలు, ఇంటర్నెట్ సేవలు, టీ-ఫైబర్ భాగస్వాములు అవుతాయి. ఖర్చులో కొంత భాగం వారు భరిస్తారు. దీంతో సదరన్‌డిస్కమ్‌పై పడే మొత్తం వ్యయం తగ్గుతుంది. భవిష్యత్తులో రోడ్ల తవ్వకాలు తగ్గటం, ఒకే నెట్‌వర్క్‌లో విద్యుత్, టెలికాం వ్యవస్థలు చేరటం వంటి లాభాలు ఉంటాయి.
55
సౌందర్యంతో పాటు భద్రత
అండర్‌గ్రౌండ్ కేబులింగ్ పూర్తికాగానే నగర దృశ్యం పూర్తిగా మారనుంది. ఇకపై గాలిలో కనిపించే గజిబిజి దృశ్యాలు కనిపించవు. దీనివల్ల వర్షాకాలంలో విద్యుత్ అంతరాయాలు, ప్రమాదాలు తగ్గుతాయి. ఎలాంటి అంతరాయం లేకుండా రోడ్డు పనులు సాగుతాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే హైదరాబాద్ మౌలిక సదుపాయాల్లో ఒక పెద్ద మార్పు కానుంది.