
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఊహించని రేంజ్‌లో ప్లాన్ చేసిన సరికొత్త ‘టీజీ20’ లీగ్ మొదటి సీజన్ ముగిసింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన గ్రాండ్ ఫైనల్ పోరు నెక్ట్స్ లెవెల్‌లో సాగింది. టైటిల్ కోసం జరిగిన ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో అన్విత ఖమ్మం ఏసెస్ జట్టుపై హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ అదిరిపోయే విక్టరీ కొట్టింది. మెగా ట్రోఫీతో పాటు ఏకంగా రూ. 1 కోటి ప్రైజ్ మనీని హైదరాబాద్ టీమ్ తన అకౌంట్‌లో వేసుకుంది.
రన్నరప్ ఖమ్మం టీమ్‌కు రూ. 50 లక్షలు దక్కగా, 3వ, 4వ స్థానాల్లో నిలిచిన కరీంనగర్, రంగారెడ్డి జట్లకు చెరో రూ. 25 లక్షల ప్రైజ్ మనీ లభించింది. ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఈవెంట్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, హెచ్సీఏ సెక్రటరి జీవన్ రెడ్డి పాల్గొని ప్లేయర్లను అభినందించారు.
టాస్ గెలిచిన హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ కెప్టెన్ ఏమాత్రం ఆలోచించకుండా మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన ఖమ్మం ఏసెస్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ఖమ్మం టీమ్‌లో స్టార్ బ్యాటర్ మికిల్ జైస్వాల్ మరోసారి సింహంలా సింగిల్‌గా పోరాడాడు. కేవలం 39 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో విరుచుకుపడి 65 పరుగులు చేశాడు. కొడిమల హిమతేజ (31 పరుగులు) తో కలిసి మికిల్ జైస్వాల్ నాలుగో వికెట్‌కు 94 పరుగుల సూపర్ పార్ట్‌నర్‌షిప్‌ను బిల్డ్ చేశాడు.
ఒక దశలో ఖమ్మం 180 ప్లస్ స్కోరు చేసేలా కనిపించినా.. హైదరాబాద్ బౌలర్ యశ్వీర్ గౌడ్ (3/17) తన మైండ్ బ్లోయింగ్ బౌలింగ్‌తో బ్రేకులు వేశాడు. అతనికి తోడుగా దేవ్ మెహతా (2/25), అజయ్ దేవ్ గౌడ్ (2/36) కూడా క్రూషియల్ వికెట్లు తీసి ఖమ్మంను 157 పరుగులకే లాక్ చేసేశారు.
158 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ టీమ్ ఎక్కడా టెన్షన్ పడకుండా, చాలా కూల్‌గా గేమ్ ప్లాన్ అమలు చేసింది. ఓపెనర్ అభిరథ్ రెడ్డి 48 పరుగులతో టీమ్‌కు అదిరిపోయే స్టార్ట్ ఇచ్చాడు. ఈ టోర్నీలో అభిరథ్ రెడ్డి పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. ఒక దశలో క్రికెట్‌లో ఛాన్స్‌లు రాక అమెరికా వెళ్లి సెటిల్ అవ్వాలి అనుకున్న అభిరథ్, ఈ లీగ్‌లో కెప్టెన్‌గా మారి టీమ్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టాడు. రంజీ ఎక్స్‌పీరియన్స్‌తో బౌలర్లను వాడుకున్న తీరు అద్భుతం. ఈ టోర్నీలో మొత్తం 4 హాఫ్ సెంచరీలు, ఒక అన్‌బీటెన్ సెంచరీ (101 నాటౌట్) తో 549 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ లీగ్‌లోనే హయ్యెస్ట్ ఫోర్లు (58), సిక్సర్లు (33) కొట్టిన రికార్డ్ కూడా అతనిదే.
ఖమ్మం బౌలర్లు మ్యాచ్‌ను ఎలాగైనా తమ వైపు తిప్పుకోవాలని తెగ ట్రై చేశారు. వేదరెడ్డి తన నాలుగు ఓవర్లలో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసి కట్టడి చేశాడు. కానీ, మ్యాచ్ స్టార్టింగ్‌లోనే ఖమ్మం ఫీల్డర్లు చేసిన మూడు క్యాచ్ డ్రాప్స్ ఆ జట్టు విజయావకాశాలను పూర్తిగా దెబ్బతీశాయి. లక్ కూడా తోడవడంతో హైదరాబాద్ బ్యాటర్లు షణ్ముఖ అశ్విన్ (36 పరుగులు), వైష్ణవ రెడ్డి (41 పరుగులు) పట్టుదలగా ఆడి టీమ్‌ను విక్టరీ లైన్ దాటించారు. హైదరాబాద్ టీమ్ కేవలం 17.3 ఓవర్లలోనే 158 పరుగుల టార్గెట్‌ను ఈజీగా ఛేజ్ చేసి కప్పును ముద్దాడింది.
హైదరాబాద్ టీమ్ విక్టరీ వెనుక చాలా మంది అన్‌సంగ్ హీరోలు ఉన్నారు. బౌలింగ్‌లో అజయ్‌దేవ్ గౌడ్ ఏకంగా 21 వికెట్లు తీసి 'పర్పుల్ క్యాప్' విన్నర్‌గా నిలిచాడు. ఖమ్మం బౌలర్ వేద్ రెడ్డి (15 వికెట్లు) కంటే చాలా ఎక్కువ వికెట్లతో అజయ్ టాప్‌లో నిలిచాడు. అజయ్‌కు వాళ్ల నాన్నే కోచ్ కావడం విశేషం.
ఇక స్పిన్ ట్విన్స్ ప్రణవ్ వర్మ (12 వికెట్లు), షణ్ముఖ అశ్విన్ (10 వికెట్లు) పవర్‌ప్లేలోనే ప్రత్యర్థులను తిప్పేశారు. బ్యాటింగ్‌లో వైష్ణవ్ రెడ్డి ఆడిన 6 ఇన్నింగ్స్‌ల్లో 195 పరుగులు చేసి, ఆరు సార్లూ నాటౌట్‌గా నిలిచి మిస్టర్ డిపెండబుల్ అనిపించుకున్నాడు. ఇండియా అండర్-19 ప్లేయర్ యశ్వీర్ గౌడ్ (5 వికెట్లు, 42 పరుగులు), అఖిల్ రాథోడ్ (8 వికెట్లు) కూడా తమ వంతు సపోర్ట్ ఇచ్చారు. మరో ఓపెనర్ సాయివికాస్ రెడ్డి (296 పరుగులు) క్వాలిఫయర్-1లో 27 బంతుల్లోనే 69 రన్స్ కొట్టి విధ్వంసం సృష్టించాడు. ఇలా అందరూ కలిసి కష్టపడ్డారు కాబట్టే.. హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ టీజీ20 బాద్‌షాలుగా నిలిచారు.