ఆ సీనియర్లే నేను సీఎం కావాలని కోరుకున్నారు...: ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు

First Published Oct 8, 2021, 2:55 PM IST

హుజురాబాద్ ఉపఎన్నికలో ధర్మం పక్షాన నిలిచిన బిజెపి పార్టీ గెలుపు ఖాయమని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేసారు. ఈ ఎన్నికల తర్వాత మీ కుటుంబం, మీ పార్టీ మాయమవడం ఖాయమని మంత్రి హరీష్ ను హెచ్చరించారు. 

కరీంనగర్: కురుక్షేత్రంలో యోధానయోధులు కౌరవుల వైపే ఉన్నా ధర్మం పాండవుల వైపు ఉంది... కాబట్టి వారే గెలిచారు. ఇప్పుడు హుజురాబాద్ ఉపఎన్నికలో కూడా ధర్మం తమవైపే ఉందని... టీఆర్ఎస్ పార్టీపై బిజెపి గెలుపు ఖాయమని మాజీ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. 

శుక్రవారం జమ్మికుంటలో జరిగిన ముదిరాజ్ సంఘం సమావేశంలో  eatala rajender పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... అందరి పొత్తులో సద్దిలా భావించి అన్ని కులాల వారు, మతాల వారు తనకు మద్దతు చెప్తున్నారు... మీటింగులు పెడుతున్నారని అన్నారు.  
 

''నేను మీకు కొత్త కాదు... కానీ 18 సంవత్సరాల కొట్లాట వేరు... ఇప్పుడు కొట్లాట వేరు. ఆనాడు తెలంగాణ తల్లి విముక్తి కోసం... ఇప్పుడు కేసిఆర్ అన్యాయాలు, అక్రమాల మీద కొట్లాట. అప్పటి కెసిఆర్ ఉద్యమాన్ని, ప్రజలను నమ్ముకుంటే... ఇప్పుడు డబ్బు, మద్యం, అధికారం నమ్ముకున్నాడు. 101 సార్లు చెప్తే అబద్దం నిజం అవుతుందంటారు... ఇలాగే కేసిఆర్ అబద్దాలను ప్రచారం చేస్తూ ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు.  ఇలాంటి అన్యాయాన్ని చీల్చి చెండాడాలి'' అని ఈటల సూచించారు. 

read more Huzurabad Bypoll: బిజెపి అభ్యర్థిగా ఈటల జమున... మరో సెట్ నామినేషన్ దాఖలు (వీడియో)

''కరొనా ఉదృతి సమయంలో చనిపోయిన వారి శవాలను కూడా కుటుంబసభ్యులు తీసుకుపోలేని పరిస్థితి. అలాంటి సమయంలో శవాల మధ్య ఉన్న బిడ్డను నేను... చాలా శవాలను ఖననం చేయించింది నేను. నా పనితీరు చూసి సమాజం అంతా హర్షించింది. కానీ సీఎం కేసీఆర్ మాత్రం బాధపడ్డారు. అందుకే కంట్లో పెట్టుకొని నన్ను మంత్రివర్గంలోంచి, పార్టీలోంచి తీసివేసిండు'' అన్నారు.  

''ఏళ్ల అనుబంధం కలిగిన టీఆర్ఎస్ పార్టీ నుండి బయటికి పోవాలంటే బాధ అనిపించింది. నా అంతట నేను రాజీనామా చేయలేదు. నేను బయటికి పోవాలని వాళ్ళే డిమాండ్ చేస్తే మొకాన కొట్టి వచ్చా.  ఇలాంటి దుర్మార్గులకు శిక్ష తప్పదు. ఉసురు తగలక తప్పదు'' అని హెచ్చరించారు. 
 

''మంత్రి హరీష్ అంటాడు... ఈటల రాజేందర్ సీఎం కుర్చీ మీద కన్ను వేసిండని. నేను కాదు జీవన్ రెడ్డి లాంటి సీనియర్ లీడర్లు ఈటల ఎందుకు సీఎం కాకూడదు అన్నారు.... తెలంగాణ ప్రజలు కూడా అన్నారు...'' అని పేర్కొన్నారు. 
 

''ఏం జరిగినా మన మంచికే జరిగింది. ప్రస్తుతం పూర్తి స్వేచ్చతో ఉన్న... ఇకపైనా 4 కోట్ల తెలంగాణ ప్రజల ప్రతీకగా ఉంటా. కేసిఆర్ అక్రమాలను ఎదిరించే బిడ్డగా ఉంట. ఇది నా ఛాలెంజ్. సాహసం కలిగిన బిడ్డలం. రోశంగల బిడ్డను. చావనైనా చస్తా కాని లొంగిపోను. నా గన్ మెన్లను తీసివేసిండు... అయితే నేను పోలీసులను నమ్ముకున్న వాన్ని కాదు... ప్రజలను నమ్ముకున్న వాన్ని. నయీం లాంటి వాళ్ళు చంపేస్తా అంటే కూడా భయపడలేదు... అప్పుడే భయం లేదు ఇప్పుడు భయపడతామా?'' అన్నారు. 

''శక్తి ఉన్నవరకు ధర్మం పక్షాన, ఆకలి ఉన్న ప్రజల పక్షాన ఉంటాను. కేసిఆర్ నిన్ను తెలంగాణ సమాజంలో దోషిగా నిలబెడతాం. ముదిరాజ్ లను కదిలిస్తే తేనె తెట్టెను కదిలించినట్టే. హరీష్ రాత్రికి రాత్రికి నాయకులను వేసుకుపోతున్నరట... ఎంతమందిని వేసుకుపోతాడు'' అని అన్నారు. 

''నేను గెలిస్తే ఆకలి కేకలు లేని ఆత్మగౌరవ తెలంగాణ వస్తుంది. మీకు మచ్చ తేను అని మాట ఇస్తున్న. కమలంకి ఓటు వేయండి నన్ను గెలిపించండి. మాయం అయ్యేది నేను కాదు.. మీ కుటుంబం, మీ పార్టీ అని తెలుసుకో హరీష్'' అని ఈటల హెచ్చరించారు. 
 

click me!