Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు బ్యాడ్ న్యూస్. తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (TSHA) సభ్య ఆస్పత్రులు ఇకపై కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కస్టమర్లకు క్యాష్‌లెస్ చికిత్సలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.
TSHA తెలిపిన వివరాల ప్రకారం, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌తో చాలా కాలంగా పలు సమస్యలు కొనసాగుతున్నాయి. క్లెయిమ్‌లలో సరైన కారణం లేకుండా కోతలు విధించడం, కొన్ని క్లెయిమ్‌లను తిరస్కరించడం, క్లెయిమ్ సెటిల్‌మెంట్‌లో ఆలస్యం చేయడం, ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆస్పత్రులను ఎంపానెల్ జాబితా నుంచి తొలగించడం వంటి అంశాలపై ఆస్పత్రులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో చివరకు క్యాష్‌లెస్ సేవలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు అసోసియేషన్ వెల్లడించింది. ఈ విషయంపై కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ నుంచి అధికారిక స్పందన ఇంకా వెలువడలేదు.
24
పాలసీదారులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
ఈ నిర్ణయం వల్ల ఎక్కువ ప్రభావం కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులపైనే పడనుంది. ఇప్పటివరకు క్యాష్‌లెస్ సౌకర్యంతో ఆస్పత్రిలో చేరిన వారు నేరుగా చికిత్స పొందేవారు. కానీ ఇప్పుడు TSHA సభ్య ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటే ముందుగా బిల్లును పూర్తిగా చెల్లించాల్సి రావచ్చు. అనంతరం పాలసీ నిబంధనల ప్రకారం రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేయాలి. అత్యవసర పరిస్థితుల్లో పెద్ద మొత్తంలో డబ్బు వెంటనే సమకూర్చుకోవాల్సి రావడం అనేక కుటుంబాలకు ఆర్థికంగా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.
34
ఆస్పత్రులు - ఇన్సూరెన్స్ కంపెనీల మధ్య పెరుగుతున్న విభేదాలు
ఈ వివాదం తెలంగాణకే పరిమితం కాదని నిపుణులు చెబుతున్నారు. గతంలో కూడా పలు రాష్ట్రాల్లో ఆస్పత్రులు, ఆరోగ్య భీమా సంస్థల మధ్య క్లెయిమ్‌ల చెల్లింపులు, ప్యాకేజీ రేట్లు, సెటిల్‌మెంట్ ఆలస్యాలు, ఎంపానెల్ విధానాలపై వివాదాలు చోటుచేసుకున్నాయి. ఆస్పత్రులకు సమయానికి చెల్లింపులు జరగాలని ఒకవైపు డిమాండ్ ఉంటే, మరోవైపు భీమా సంస్థలు పాలసీ నిబంధనల ప్రకారం క్లెయిమ్‌లను పరిశీలించాల్సిన బాధ్యతను ప్రస్తావిస్తున్నాయి. ఈ రెండు వర్గాల మధ్య సమన్వయం దెబ్బతింటే చివరకు ఇబ్బందులు ఎదుర్కొనేది మాత్రం రోగులేనని ఆరోగ్య రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
TSHA ఈ నిర్ణయం శాశ్వతం కాదని, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నతాధికారులు సమస్యల పరిష్కారానికి ముందుకు వస్తే చర్చలకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. క్లెయిమ్‌ల పరిష్కారంలో పారదర్శకత, వేగవంతమైన సెటిల్‌మెంట్, ఆస్పత్రులతో సమర్థవంతమైన సమన్వయం ఉంటే ఇలాంటి సమస్యలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆరోగ్య భీమా వ్యవస్థపై ప్రజల నమ్మకం కొనసాగాలంటే ఆస్పత్రులు, భీమా సంస్థలు పరస్పర సహకారంతో పనిచేయడం ఎంతో అవసరం. ఎందుకంటే క్యాష్‌లెస్ వైద్య సేవల అసలు ఉద్దేశం అత్యవసర సమయంలో రోగికి వెంటనే చికిత్స అందించడం. ఆ వ్యవస్థలో అంతరాయం ఏర్పడితే అత్యధిక ఇబ్బందులు ఎదుర్కొనేది సాధారణ ప్రజలే.