అసలు ఎందుకీ కులగణన?
రాష్ట్రం లేదా దేశంలో ఎంత జనాభా ఉన్నారంటే సమాధానం వస్తుంది. కానీ ఏ సామాజిక వర్గానికి చెందిన వారు ఎంత మంది ఉన్నారని చెప్పడం మాత్రం అసాధ్యం. ఇదిగో దీన్ని దృష్టిలో పెట్టుకొనే తెలంగాణ ప్రభుత్వం ఈ కులగణన చేపట్టింది. సామాజికవర్గాలవారిగా జనాభా లెక్కలు తేలుస్తామని ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఈ సర్వే చేపట్టారు. ఈ సర్వే ప్రకారం తెలంగాణలో పురుషులు 1,79,21,183, మహిళలు 1,75,42,597 ఉన్నారు. ఇక థర్డ్ జెండర్ వారు 13,774 ఉన్నారు.
ఇక సామాజిక వర్గాల విషయానికొస్తే.. మొత్తం జనాభాలో బీసీలు 1,64,09,179 (46.25 శాతం) మంది ఉన్నారు. ముస్లింలలో మరో 35,76,588 (10.8 శాతం) మంది బిసిలు వున్నారు. మొత్తంగా చూసుకుంటే రాష్ట్రంలో బిసి జనాభా శాతం 56 శాతానికి పైగానే వుంది. అలాగే ఎస్సీలు 61,84,319 (17.43 శాతం), ఎస్టీలు 37,05,929 (10.45 శాతం), ఓసీలు 47,21,115 (13 శాతం) ఉన్నారు. ముస్లింలలో ఓసి సామాజికవర్గానికి చెందినవారు 8,80,424 (2.48 శాతం) ఉన్నారు. మొత్తంగా జనరల్ వర్గానికి చెందిన ముస్లింలను కూడా కలిపితే ఓసి జనాభా 15% పైగా ఉంది.