తెలంగాణ ముఖ్మమంత్రి కె. చంద్రశేఖరరావు దాదాపుగా తన కార్యకలాపాలను తగ్గించుకున్నారు. ప్రజల్లోకి వచ్చి సామూహిక కార్యక్రమాల్లో పొల్గొనే విధానాన్ని తగ్గించుకున్నారు. ఎంతో అవసరమైతే తప్ప ఆయన రావడం లేదు. అత్యంత ముఖ్యమైనవారిని మాత్రమే ఆయన కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో అంతా తానై మంత్రి కేటీఆర్, ఆయన తనయుడు వ్యవహరిస్తున్నారు
శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు చాలా వరకు కేటీఆర్ చేతుల మీదుగానే జరుగుతున్నాయి. టీఆర్ఎస్ వ్యవహారాలు సరేసరి. పార్టీ వ్యవహారాలు మొత్తం ఆయనే చూస్తున్నారు. వరంగల్ లో ఆ మధ్య జరిగిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ కు ముఖ్యమంత్రికి జరిగిన హడావిడి జరిగింది. దాదాపుగా కేసీఆర్ నిర్వహించాల్సిన చాలా పనులు కేటీఆర్ చక్కబెడుతున్నారు
కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలనే డిమాండ్ కూడా పార్టీలో కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ చాలా కాలంగా తర్వాతి ముఖ్యమంత్రి కేటీఆర్ అంటూ వస్తున్నారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆ మధ్య కేసీఆర్ ను కోరారు. తాజాగా ఇటీవల ఖైరతాబాద్ పర్యటనలో దానం నాగేందర్ కూడా కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని అన్నారు
కేసీఆర్ తర్వాతి స్థానం కేటీఆర్ దేనని చాలా స్పష్టంగా తేలిపోయింది. మంత్రి హరీష్ రావు పాత్ర చాలా వరకు తగ్గింది. రాష్ట్ర స్థాయి వ్యవహారాలు చాలా వరకు ఆయన వద్దకు వెళ్లడం లేదు. హరీష్ రావుకు సన్నిహితుడని భావించిన ఈటెల రాజేందర్ కూడా కేటీఆర్ వైపు మొగ్గు చూపుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఆయన కేటీఆర్ తో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అందువల్ల కేటీఆర్ కు అడ్డంకులన్నీ తొలిగిపోయాయనే భావిస్తున్నారు
కేసీఆర్ తలుచుకోవడమే ఇక మిగిలింది. కేసీఆర్ తలుచుకుంటే కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమైనట్లే. తన తర్వాత కేటీఆర్ ను నిలబెట్టడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్షాల నేతలు కూడా అంటున్నారు. అందువల్ల కేసీఆర్ నిర్ణయించే ముహూర్తం కోసం అందరూ ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తున్నారు