డీలిమిటేషన్‌తో మార‌నున్న తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రం.. ఎన్ని స్థానాలు పెర‌గ‌నున్నాయంటే

Published : Nov 27, 2026, 06:55 PM ISTUpdated : Nov 27, 2026, 07:05 PM IST

Delimitation: లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మహిళా రిజర్వేషన్ల అమలుతో ముడిపడిన డీలిమిటేషన్ ప్రతిపాదనలు కార్యరూపం దాలిస్తే రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.

PREV
14
డీలిమిటేషన్‌కు కేంద్రం సన్నాహాలు.. 50 శాతం సీట్ల పెంపు ప్రతిపాదన

దేశంలో డీలిమిటేషన్‎కు రంగం సిద్ధమైంది. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్‌తో ముడిపడిన రాజ్యాంగ సవరణ బిల్లు మళ్లీ పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయ్యింది. గతంలో వీగిపోయిన ఈ బిల్లును ఈసారి ఎలాగైనా ఆమోదింపజేసుకునేందుకు మోదీ సర్కార్ పక్కా వ్యూహాం రచించింది. ఈ క్రమంలోనే నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఈ నేపథ్యంలో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన రాజ్యాంగ సవరణ ప్రతిపాదనలు మరోసారి తెరపైకి వచ్చాయి. అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న స్థానాల సంఖ్యను సుమారు 50 శాతం పెంచే ప్రతిపాదన చర్చలో ఉంది. ఈ విధానం అమల్లోకి వస్తే లోక్‌సభలో మొత్తం స్థానాలు 850 వరకు చేరవచ్చనే అంచనాలున్నాయి.

ఈ మార్పులు దక్షిణాది రాష్ట్రాలపై చూపే ప్రభావంపై గతంలో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పెంచితే జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలకు రాజకీయ ప్రాతినిధ్యం తగ్గుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే అన్ని రాష్ట్రాల్లో సమాన నిష్పత్తిలో స్థానాలను పెంచే ప్రతిపాదనతో ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిపాదిత మార్పులు అమలైతే ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ స్థానాలు 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కి పెరిగే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్‌లో 80 నుంచి 120కి, మహారాష్ట్రలో 48 నుంచి 72కి, పశ్చిమ బెంగాల్‌లో 42 నుంచి 63కి స్థానాలు చేరవచ్చని అంచనాలు ఉన్నాయి. అయితే ఇవి ప్రతిపాదిత లెక్కలు మాత్రమే. తుది సంఖ్యలు అధికారిక పునర్విభజన ప్రక్రియ తర్వాతే వెల్లడవుతాయి.

24
తెలంగాణలో 119 నుంచి 179కి అసెంబ్లీ స్థానాలు..

తెలంగాణలో ప్రస్తుతం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు, 17 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ప్రతిపాదిత 50 శాతం సీట్ల పెంపు అమలైతే అసెంబ్లీ స్థానాలు 179కి, లోక్‌సభ స్థానాలు 25 వరకు పెరిగే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర జనాభాను పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున 3.22 లక్షల మంది వస్తున్నారు. కొత్తగా 179 స్థానాలు ఏర్పాటు చేస్తే ఈ సంఖ్య సుమారు 2.14 లక్షలకు తగ్గుతుంది. అలాగే ఒక్కో లోక్‌సభ నియోజకవర్గానికి ప్రస్తుతం సగటున 22.58 లక్షల జనాభా ఉండగా, స్థానాల పెంపు తర్వాత ఇది 15.36 లక్షలకు చేరవచ్చు.

ప్రభుత్వ గణాంకాల ఆధారంగా 2024 నాటికి తెలంగాణ జనాభా సుమారు 3.84 కోట్లుగా అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ కుల గణన సర్వేలో సుమారు 3.71 కోట్ల జనాభా నమోదైనట్లు సమాచారం. రాబోయే జనగణనలో వెలువడే అధికారిక గణాంకాలే పునర్విభజనకు కీలకం కానున్నాయి. జనాభా నిష్పత్తి ఆధారంగా కొత్త స్థానాలను ఏర్పాటు చేస్తే ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల సరిహద్దులు మారిపోతాయి. కొన్ని నియోజకవర్గాలు రెండు లేదా మూడు కొత్త స్థానాలుగా విడిపోవచ్చు. మరికొన్ని ప్రాంతాల్లో జనాభా కోటాను సమన్వయం చేసేందుకు పక్కపక్కన ఉన్న గ్రామాలు, మండలాలను కలపాల్సి రావచ్చు. దీంతో ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల పేర్లు, పరిధులు, రాజకీయ సమీకరణాలు కూడా మారనున్నాయి.

34
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే 90 సీట్లు

తెలంగాణలో డీలిమిటేషన్ ప్రభావం అత్యధికంగా కనిపించే ప్రాంతాలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలేనని అంచనాలు చెబుతున్నాయి. రాష్ట్ర జనాభాలో గణనీయమైన భాగం ఈ మూడు జిల్లాల్లోనే నివసిస్తోంది. అందుబాటులో ఉన్న అంచనాల ప్రకారం హైదరాబాద్ జనాభా 1.05 కోట్లు, రంగారెడ్డి జనాభా 53 లక్షలు, మేడ్చల్ మల్కాజిగిరి జనాభా 35 లక్షలుగా ఉంది. ఈ మూడు జిల్లాల మొత్తం జనాభా సుమారు 1.93 కోట్లు.

ప్రతిపాదిత నియోజకవర్గాల పెంపు ప్రకారం ఈ ప్రాంతాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య భారీగా పెరగవచ్చు.

* హైదరాబాద్: ప్రస్తుతం 15 స్థానాలు ఉండగా 49కి పెరిగే అవకాశం.

* రంగారెడ్డి: ప్రస్తుతం 8 స్థానాలు ఉండగా 25కి చేరవచ్చు.

* మేడ్చల్ మల్కాజిగిరి: ప్రస్తుతం 5 స్థానాలు ఉండగా 16కి పెరగవచ్చు.

ఈ లెక్కల ప్రకారం మూడు జిల్లాల పరిధిలోనే సుమారు 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న కొన్ని పెద్ద నియోజకవర్గాలను జనాభా ఆధారంగా విభజించాల్సి రావచ్చు. ముఖ్యంగా అధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో రెండు లేదా మూడు కొత్త నియోజకవర్గాలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది.

ఇక మల్కాజిగిరి వంటి అధిక జనాభా కలిగిన లోక్‌సభ నియోజకవర్గం కూడా పునర్విభజన తర్వాత పలు భాగాలుగా మారవచ్చు. మరోవైపు నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం వంటి జిల్లాల్లోనూ కొత్త స్థానాలు ఏర్పడే అవకాశం ఉంది. పట్టణ ప్రాంతాల్లో జనాభా వేగంగా పెరుగుతున్నందున అక్కడ సీట్ల సంఖ్య ఎక్కువగా పెరగవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం నిర్ణీత జనాభా ప్రమాణానికి అనుగుణంగా విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది.

44
గ్రామాల నుంచి నగరాల వరకు మారనున్న నియోజకవర్గాల సరిహద్దులు

డీలిమిటేషన్ ప్రక్రియలో కేవలం సీట్ల సంఖ్య మాత్రమే మారదు. ప్రతి నియోజకవర్గం భౌగోళిక పరిధిని కూడా కొత్తగా నిర్ణయించాల్సి ఉంటుంది. ఇందుకోసం జనగణన గణాంకాలను ప్రామాణికంగా తీసుకొని గ్రామాలు, పట్టణాలు, మండలాలు, నగర వార్డుల జనాభాను పరిశీలిస్తారు. ఉదాహరణకు నిజామాబాద్, కరీంనగర్ వంటి నగరాల్లో జనాభా పెరుగుదలను బట్టి ప్రస్తుతం ఉన్న పట్టణ నియోజకవర్గాలను ఉత్తర, దక్షిణ లేదా అర్బన్, రూరల్ విభాగాలుగా విభజించే అవకాశం ఉంటుంది. అదే విధంగా హైదరాబాద్ పరిధిలోని పెద్ద నియోజకవర్గాలను కొత్త సరిహద్దులతో పునర్వ్యవస్థీకరించవచ్చు.

గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం నిర్ణీత జనాభా కోటాను చేరుకునేందుకు సమీప గ్రామాలు, మండలాలను ఒకే నియోజకవర్గంలో చేర్చాల్సి రావచ్చు. దీంతో ప్రస్తుతం ఒక నియోజకవర్గంలో ఉన్న కొన్ని గ్రామాలు మరో నియోజకవర్గంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ములుగు వంటి తక్కువ జనాభా కలిగిన జిల్లాల్లోనూ కొత్త స్థానాల ఏర్పాటు జరగవచ్చని అంచనాలు ఉన్నాయి. ఈ ప్రక్రియలో సాధారణంగా గ్రామాలను ఒక యూనిట్‌గా పరిగణించడం, భౌగోళిక అనుసంధానం, రవాణా సౌకర్యాలు, పరిపాలనా సౌలభ్యం వంటి అంశాలను పరిశీలిస్తారు. పట్టణ ప్రాంతాల్లో వార్డులు, డివిజన్ల జనాభా వివరాలు కీలకంగా ఉంటాయి.

కొత్త నియోజకవర్గాల హద్దులు ఖరారైన తర్వాత ఓటర్ల జాబితాలను కూడా సవరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 3.35 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు అంచనా. అయితే సీట్ల విభజనకు ఓటర్ల సంఖ్య కంటే జనాభా గణాంకాలే ప్రధాన ప్రాతిపదికగా ఉంటాయి. కొత్త సరిహద్దుల ప్రకారం ఓటర్లను సంబంధిత నియోజకవర్గాల పరిధిలోకి మార్చుతారు. దీంతో ఓటర్లు నివసిస్తున్న ప్రాంతం మారకపోయినా, వారు ఓటు వేసే నియోజకవర్గం పేరు లేదా సంఖ్య మారవచ్చు.

33 శాతం మహిళా రిజర్వేషన్లు..

డీలిమిటేషన్‌తో పాటు మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తే తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మార్పు చోటుచేసుకోనుంది. చట్టపరమైన నిబంధనల ప్రకారం లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం స్థానాలు కేటాయించే అవకాశం ఉంది. ఈ రిజర్వేషన్ల అమలుతో మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య గణనీయంగా పెరగనుంది. అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాల సంఖ్య, వాటి పరిధుల్లోనూ మార్పులు రావచ్చు. కొత్త జనాభా లెక్కల ప్రకారం ఆయా వర్గాల జనాభా నిష్పత్తిని పరిగణనలోకి తీసుకొని రిజర్వేషన్లను నిర్ణయించే అవకాశం ఉంది. ప్రస్తుతం జనరల్ కేటగిరీలో ఉన్న కొన్ని నియోజకవర్గాలు రిజర్వుడ్ స్థానాలుగా మారవచ్చు. అలాగే ప్రస్తుతం రిజర్వేషన్‌లో ఉన్న కొన్ని స్థానాలు జనరల్ కేటగిరీలోకి వెళ్లే అవకాశముంది.

ఈ పరిణామాలు ప్రస్తుత రాజకీయ నేతలకు కొత్త సవాళ్లు విసరనున్నాయి. దశాబ్దాలుగా ఒకే నియోజకవర్గాన్ని తమ రాజకీయ కేంద్రంగా చేసుకున్న నాయకులు కొత్త సరిహద్దుల కారణంగా వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి రావచ్చు. మహిళా రిజర్వేషన్ అమలైతే కొన్ని స్థానాల్లో కొత్త మహిళా అభ్యర్థులకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది.

ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి వంటి పట్టణ ప్రాంతాల్లో స్థానాల సంఖ్య పెరగడం వల్ల కొత్త రాజకీయ నాయకత్వానికి అవకాశాలు ఏర్పడవచ్చు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో నియోజకవర్గాల పరిధి మారడంతో స్థానికంగా ఉన్న రాజకీయ, సామాజిక సమీకరణాలు కూడా తిరగబడే అవకాశం ఉంది. మొత్తంగా డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయితే 2029 ఎన్నికల నాటికి తెలంగాణ రాజకీయాల్లో కొత్త ముఖాలు, కొత్త నియోజకవర్గాలు, కొత్త పోటీలు కనిపించే అవకాశముంది.

Read more Photos on
click me!

Recommended Stories