యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీ అధినేత వై.ఎస్. షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నారు. మంగళవారంనాడు వైఎస్ఆర్‌టీపీ ముఖ్య నేతలతో వై.ఎస్. షర్మిల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్‌టీపీ విలీనం గురించి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్‌టీపీ నేతలకు కీలక పదవులు దక్కే అవకాశం ఉందని షర్మిల పార్టీ నేతలకు తెలిపారు.
ఈ నెల 4వ తేదీన వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్‌టీపీని విలీనం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ పదవిని వై.ఎస్. షర్మిలకు కాంగ్రెస్ నాయకత్వం కట్టబెట్టే అవకాశం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తరపున వై.ఎస్. షర్మిల నిర్వహించనున్నారు.
కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్‌టీపీ విలీనం తర్వాత వైఎస్ఆర్‌టీపీలో ప్రస్తుతం పనిచేస్తున్న నేతలకు కాంగ్రెస్ పార్టీలో పదవులు దక్కనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది.
అయితే తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే నామినేటేడ్ పదవులను భర్తీ చేయనుంది. అయితే నామినేటేడ్ పదవుల్లో కూడ వై.ఎస్. షర్మిల అనుచరులకు దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ విషయాలపై కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కే.సీ. వేణుగోపాల్ వై.ఎస్. షర్మిలకు సమాచారం పంపారు. ఈ నెల 4వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరాలని వై.ఎస్. షర్మిలకు మల్లికార్జున ఖర్గే నుండి ఆహ్వానం అందింది.
కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కర్ణాటక నుండి రాజ్యసభ పదవిని వై.ఎస్. షర్మిలకు ఇచ్చే ప్రతిపాదనను ఆ పార్టీ నాయకత్వం చేసిందని ప్రచారం సాగుతుంది. మరో వైపు ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుండి కూడ షర్మిల పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం కూడ సాగుతుంది. అయితే ఈ విషయాలపై రెండు రోజుల్లో స్పష్టత రానుంది.
పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో నామినేటేడ్ పదవుల కోసం కాంగ్రెస్ శ్రేణులు ఆశగా ఎదురు చూస్తున్నాయి.ఈ తరుణలో వైఎస్ఆర్‌టీపీ నుండి చేరిన వారికి కూడ నామినేటేడ్ పదవుల కోసం పోటీ పడే అవకాశం ఉందనే అంశం తెరమీదికి రావడంతో కాంగ్రెస్ వర్గాలను షాక్ కు గురి చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్‌టీపీ అభ్యర్థులను మార్చాలని వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. 40 నుండి 60 స్థానాల్లో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థులను మార్చనున్నారు. వైఎస్ఆర్‌సీపీ అసంతృప్తులు వై.ఎస్. షర్మిల వెంట నడిచే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.
కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తరపున వై.ఎస్. షర్మిల ప్రచారం కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని సమాచారం. తొలుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై షర్మిల కేంద్రీకరించనున్నారు.