ప్యాష‌న్‌ను ప్రేమిస్తే ప‌ట్టాభిరామ్ అవుతారు.. ఒత్తిడికి చిత్త‌వుతోన్న యువ‌త‌రం ఈయ‌న క‌థ క‌చ్చితంగా తెలుసుకోవాలి

Published : Jul 01, 2025, 06:36 PM ISTUpdated : Jul 01, 2025, 06:40 PM IST

BV Pattabhiram: బీవీ ప‌ట్టాభిరామ్‌.. ఈ త‌రం యువ‌త‌కు ఈ పేరు పెద్ద‌గా ప‌రిచ‌యం లేక‌పోయినా 1990లో వారికి మాత్రం ఠ‌క్కున గుర్తొస్తుంది. ఇంద్ర‌జాల‌కుడిగా, ర‌చయితగా, మాన‌సిక నిపుణుడిగా ఇలా ఎన్నో పాత్ర‌లు వేసిన ప‌ట్టాభిరామ్ సోమ‌వారం తుది శ్వాస విడిచారు. 

PREV
15
గుండెపోటుతో

బీవీ ప‌ట్టాభిరామ్ (75) గుండెపోటుతో సోమ‌వారం తుదిశ్వాస విడిచారు. రచయితగా, ఇంద్రజాలికుడు, మానసిక వైద్యుడిగానూ ఆయన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఖైరతాబాద్‌ నివాసంలో పట్టాభిరామ్‌ పార్థివదేహాన్ని సంద‌ర్శ‌నార్థం ఉంచారు. 

బుధ‌వారం మధ్యాహ్నం మూడు గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. జీవితంలో అంచెలంచెలుగా ఎదిగిన ప‌ట్టాభిరామ్ ఎంతో మందికి ఆద‌ర్శంగా నిలిచారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న జీవితంలోని కొన్ని ముఖ్య ఘ‌ట్టాలు ఇప్పుడు తెలుసుకుందాం.

25
వ్యక్తిత్వ వికాసంలో అగ్రగామి

భావరాజు వేంకట పట్టాభిరాం ఒక రచయిత, హిప్నాటిస్టు, మేజీషియన్, మానసిక నిపుణుడు. తెలుగు, ఇంగ్లీష్, కన్నడ, తమిళ భాషల్లో రచనలు చేశారు. మానవ విలువలు, పిల్లల అభివృద్ధి, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై ప‌ని చేశారు. విద్యార్థులకు శిక్షణ తరగతులు, తల్లిదండ్రులకు అవగాహన సదస్సులు నిర్వహించారు.

ప్ర‌భుత్వ ఉద్యోగాన్ని వ‌దిలి

ప‌ట్టాభిరామ్‌కు చిన్న నాటి నుంచి సైకాల‌జీ మీద బాగా ఆస‌క్తి ఉండేది. ఆ ఆస‌క్తే అత‌న్ని ముందుకు తీసుకెళ్లింది. ఇందులో భాగంగానే ప‌ట్టాభిరామ్ 1971లో ఎమ్ఏ సైకాల‌జీ చేశారు. ఈ క్ర‌మంలోనే ఇంద్ర‌జాలాన్ని (మెజిషియ‌న్‌) కూడా నేర్చుకున్నారు. అనంత‌రం సొంతంగా సైక్రియాటిస్ట్‌గా ప్రాక్టీస్ మొద‌లు పెట్టారు. అయితే ఆ స‌మ‌యానికి కౌన్సెలింగ్‌పై ప్ర‌జ‌ల్లో అంత‌గా అవ‌గాహ‌న కానీ, అవ‌స‌రం కానీ లేక‌పోవ‌డంతో ఆ ప్ర‌య‌త్నాన్ని విర‌మించుకున్నారు.

దీంతో తాను నేర్చుకున్న ఇంద్ర‌జాలాన్ని వృత్తిగా మార్చుకున్నారు. దాదాపు ప‌దేళ్ల పాటు మెజిషియ‌న్‌గా ప‌ని చేశారు. అయితే ఇది న‌చ్చ‌ని ప‌ట్టాభిరామ్ తండ్రి కొడుకు ఉద్యోగం చేయాల‌నుకున్నారు. ఇందులో భాగంగానే ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం పెట్టించాడు. అయితే అక్క‌డ కూడా ప‌ట్టాభిరామ్ మ్యాజిక్ చేయ‌డం మొద‌లు పెట్టాడు. దీంతో మ్యాజిక్ నుంచి పూర్తిగా దూరం చేయాల‌నే ఉద్దేశంతో ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా ఉద్యోగానికి ప‌ట్టాభిరామ్‌కు తెలియ‌కుండానే ద‌ర‌ఖాస్తు చేశారు. క‌ళాకారుల కోటాలో ఉద్యోగం వ‌చ్చింది.

ప్ర‌భుత్వ ఉద్యోగం, మంచి జీతం, బిందాస్ లైఫ్‌.. అయితే ఆ కంఫ‌ర్ట్ జోన్ ప‌ట్టాభిరామ్‌కు న‌చ్చ‌లేదు. కొన్నిరోజులు ఎలాగోలా ప‌నిచేసి ఆ త‌ర్వాత ఉద్యోగానికి రాజీనామా చేశారు. కుటుంబ స‌భ్యుల నుంచి ఎంత వ్య‌తిరేక‌త వ‌చ్చినా అంద‌రినీ ఒప్పించి ఉద్యోగం నుంచి త‌ప్పుకుని ఉస్మానియాలో సైకాల‌జీలో పీహెచ్‌డీ చేశారు.

35
మీడియా, పత్రికల ద్వారా

దూరదర్శన్‌లో మేజిక్ షోలు నిర్వహించిన ఆయన, 1990లలో ఆంధ్రప్రభ సచిత్రవార పత్రికలో "బంగారు బాట" శీర్షికలో గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు రాశారు. అలాగే బాలజ్యోతి అనే బాలల పత్రికలో “మాయావిజ్ఞానం” పేరిట వ్యాసాలు రాశారు. పిల్లల్లో విజ్ఞానం, ఆసక్తిని పెంచేలా ఈ రచనలు ఎంతో ప్రాచుర్యం పొందాయి.

విద్యలో ప్రావీణ్యం, ప్రపంచవ్యాప్తంగా వర్క్‌షాపులు

ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్.డి పూర్తి చేసిన ఆయన, మానసిక శాస్త్రం, ఫిలాసఫీ, కౌన్సిలింగ్, జర్నలిజం వంటి అనేక రంగాల్లో డిప్లమాలు చేశారు. అమెరికా, మలేషియా, థాయ్‌లాండ్, సింగపూర్, ఆస్ట్రేలియా, అరబ్ దేశాల్లో హిప్నోథెరపీ, ఒత్తిడి నియంత్రణ, స్వీయ అభివృద్ధి వంటి అంశాలపై వర్క్‌షాపులు నిర్వహించారు.

1983లో ఫ్లోరిడా విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్‌ ఇచ్చింది. అమెరికాలోని కొన్ని నగరాల మేయర్లు ఆయనకు గౌరవ పౌరసత్వం కూడా అందించారు.

45
అనేక సంస్థలకు సలహాదారుగా సేవలు

ఆయన స్థాపించిన “ప్రశాంతి కౌన్సిలింగ్ అండ్ హెచ్.ఆర్.డి సెంటర్” ద్వారా అనేక ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలకు శిక్షణ ఇచ్చారు. వీటిలో TTD, షార్ శ్రీహరికోట, పోలీస్ అకాడమీ, డెల్, డెలాయిట్, BHEL, BEL, జేఎన్‌టీయూ, ఉస్మానియా యూనివర్సిటీ, రామకృష్ణ మఠం వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి. వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు, మానసిక ఆరోగ్యం వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణలు అందించారు.

110కి పైగా పుస్తకాలు

బి.వి. పట్టాభిరాం రాసిన పుస్తకాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ముఖ్యంగా ఎమెస్కో సంస్థ ద్వారా అనేక పుస్తకాలు ప్రచురించబడ్డాయి. కొన్ని ప్రసిద్ధ రచనలు: చాణక్య తంత్రం, ఒత్తిడి కూడా వరమే, మాయావిజ్ఞానం, గుడ్ స్టూడెంట్, గుడ్ పేరెంట్, కష్టపడి చదవొద్దు – ఇష్టపడి చదవండి, నాయకత్వ లక్షణం, సెల్ఫ్ హిప్నాటిజం, పాజిటివ్ థింకింగ్,

మైండ్ మేజిక్, మాయా వినోదం (వేర్వేరు పేర్లతో – మ్యాజిక్ సిరీస్), బంగారుబాట (ప్రపంచ ప్రముఖుల జీవిత కథలు), వెలుగుబాట (శాస్త్రవేత్తల స్ఫూర్తిదాయక గాథలు), ఎదగడానికి ఏడు మెట్లు (ఆత్మవిశ్వాసం, పట్టుదల, క్రమశిక్షణ వంటి విలువలపై) వంటి ఎన్నో పుస్తకాలు రాశారు.

55
ఆయన జీవితం ఆదర్శం

ప్రస్తుతం పోటీ ప్రపంచంలో తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోన్న తరుణంలో పట్టాభిరామ్ జీవితం ప్రతీ ఒక్కరికీ ఆదర్శం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోలేదు, ఇంద్రజాలం కూడా ఒక పనేనా అని అనుమానించినా బాధపడలేదు. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకున్నా భయపడలేదు. తాను నమ్ముకున్న, తాను ఇష్టపడ్డ రంగాన్ని ఎంచుకున్నాడు. అందులో ఎక్సలెన్స్ సాధించారు.

ప్రస్తుతం చాలా మంది ఒత్తిడితో చిత్తవుతున్నారు. ఎంసెట్ ర్యాంకు రాకపోయినా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయితే ఇలాంటి ఎంతో మందికి తన సైకాలజీ క్లాసుల తర్వాత ధైర్యాన్ని నింపారు పట్టాభిరామ్. అలాంటి వ్యక్తి మనల్ని వదిలి వెళ్లడం నిజంగానే లోటు అని చెప్పాలి.

Read more Photos on
click me!

Recommended Stories