Huzurbad Bypoll: ఈటల జమునకు బ్రహ్మరథం... బతుకమ్మ, బోనాలతో ఘన స్వాగతం

First Published | Oct 11, 2021, 3:38 PM IST

హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఈటల జమునకు  జమ్మికుంట మండలంలోని మాచినపల్లి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. 

కరీంనగర్: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హుజురాబాద్ ఉపఎన్నిక హాట్ టాఫిక్. కేవలం ఒక్క ఎన్నిక కోసం టీఆర్ఎస్ సర్కార్ దళిత బంధు, కుల సంఘాల భవనాలు, నియోజవర్గ అభివృద్ది పేరిట వేలకోట్లు ఖర్చు చేస్తున్నాయి. మరోవైపు బిజెపి ప్రచారానికి కేంద్ర మంత్రులను రంగంలోకి దింపేందుకు సిద్దమయ్యింది. కాంగ్రెస్ పార్టీ తమ ఓటుబ్యాంకును కాపాడుకునే పనిలో పడింది. ఇలా అన్ని పార్టీలు ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలోనే తమవారిని గెలిపించుకునేందుకు ప్రధాన పార్టీ  అభ్యర్ధుల కుటుంబసభ్యులు కూడా ప్రచారపర్వంలోకి దిగారు. 

బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున కూడా హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా ఆమె జమ్మికుంట మండలంలోని మాచినపల్లి గ్రామంలో   ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బిజెపి కమలంపువ్వు గుర్తుకు ఓటేసి తన భర్తను గెలింపించాలంటూ గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ఓటర్లను కోరారు. 
 



ప్రచారం కోసం తమ గ్రామానికి విచ్చేసిన ఈటల జమునకు మాచిపల్లి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. మంగళహారతులతో ఎదురుకొని పూలమాలలు, శాలువాలు వేసి సన్మానించారు. డప్పు చప్పుళ్లతో బతుకమ్మ, బోనాలను నెత్తినెత్తి పూలు జల్లుతూ ఘన స్వాగతం పలికారు. 

Video  Huzurbad Bypoll:బిజెపి శ్రేణుల్లో ఫుల్ జోష్... ఈటల జమున ఇంటింటి ప్రచారం 

ఈ సందర్భంగా జమున మాట్లాడుతూ... తమ ఇంటి ఆడబిడ్డలాగ భావించి బొట్టు పెట్టి ఆశీర్వదించాలని కోరారు. బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తన భర్త ఈటల రాజేందర్ ని గెలిపించాలని కోరారు జమున. తమ సంపూర్ణ మద్దతు ఈటల రాజేందర్ కే అని గ్రామస్థులు మద్దతు పలికారు. 

 భారతీయ జనతా పార్టీ(BJP) తరపున మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలుచేసారు. నామినేషన్ చివరిరోజు స్వయంగా హుజురాబాద్ ఆర్డివో కార్యాలయానికి విచ్చేసిన eatala jamuna నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అంతకుముందే జమున తరుపున బిజెపి నాయకుడు కనుకుంట్ల అరవింద్ ఓ సెట్ నామినేషన్ పత్రాలను అధికారికి అందజేసారు.  

ఈటల రాజేందర్ కాకుండా ఈటల జమున హుజురాబాద్ బరిలో దిగుతారన్న ప్రచారం కూడా జరిగింది. ఇందుకు బలం చేకూర్చేలా ఆమె బిజెపి తరపున నామినేషన్ కూడా వేసారు. అయితే ముందుజాగ్రత్త కోసమే ఈటల జమునతో బిజెపి నామినేషన్ వేయించినట్లు తెలుస్తోంది. నామినేషన్లకు చివరిరోజయిన ఇవాళ ఈటల రాజేందర్ కూడా నామినేషన్ దాఖలు చేసారు. బిజెపి అభ్యర్థి eatala rajender అని... జమున నామినేషన్ ముందుజాగ్రత్త మాత్రమేనని ఇప్పటికే ఆ పార్టీ నాయకులు స్పష్టం చేశారు.  

దీంతో భర్తను గెలిపించుకునేందుకు జమున ముమ్మర ప్రచారం చేపట్టారు. బిజెపి నాయకులతో కలిసి గ్రామాల్లో పర్యటిస్తూ తన భర్తను గెలిపించాలని కోరుతున్నారు. ఈటల రాజేందర్ వల్లే నియోజకవర్గం అభివ‌ృద్ది చెందిందని... ఆయన గెలిస్తే ఇకపైనా అలాగే అభివృద్ది చెందుతూ వుంటుందని జమున అంటున్నారు. 
 

Latest Videos

click me!