Chicken Price in Telugu States : కిలో చికెన్ కాదు కోడికి కోడే 50 రూపాయలు...

Published : Feb 12, 2025, 12:26 PM ISTUpdated : Feb 12, 2025, 01:02 PM IST

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధర అమాంతం పడిపోయింది.  ప్రస్తుతం హైదరాబాద్ తో పాటు తెలుగు పల్లెల్లో కిలో చికెన్ ధర ఎంతో తెలుసా? 

PREV
13
Chicken Price in Telugu States : కిలో చికెన్ కాదు కోడికి కోడే 50 రూపాయలు...
Chicken Price

Bird Flu : కొందరికి ముక్క లేనిదే ముద్ద దిగదు... ప్రతిరోజూ కాదు ప్రతిపూటా చికెన్ తినేవారు వుంటారు. ఇక హైదరాబాద్ లో వుండేవారు కనీసం వారానికి ఒక్కసారైనా చికెన్ బిర్యానీ రుచిచూడకుండా వుండలేరు...రోజూ తినేవారు కూడా వుంటారు. చికెన్ లెగ్ పీస్ ఇష్టపడేవారు కొందరయితే, మెత్తని చెస్ట్ పీస్ ను ఇష్టంగా తినేవారు మరికొందరు... ఇంకొందరు వింగ్స్, లివర్ వంటివి ఇష్టపడతారు. ఇలా చికెన్ బిర్యానీనో లేక చికెన్ కర్రీనో లేదంటే కబాబ్ వంటి స్పెషల్ వంటలో... ఏదో ఒకరూపంలో ముక్క నోట్లో పడాల్సిందే అనేవారు చాలామంది వుంటారు.

 ఇలా నాన్ వెజ్ అంటే పడిచచ్చేవారు ఇప్పుడు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. చికెన్ కిలో రూ.300, రూ.400 ఉన్నపుడు కూడా వెనకడుగు వేయకుండా కొనుగోలు చేసినవారు ఇప్పుడు కిలో కాదు కోడికి కోడే కేవలం 50 రూపాయలకు ఇస్తామన్నా తీసుకోడానికి జంకుతున్నారు. నాలుక ముక్క కోసం తహతహలాడుతున్న చికెన్ తినలేని పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి పగవాడికి కూడా రాకూడదని అనుకుంటున్నారు నాన్ వెజ్ ప్రియులు. 

అసలు ఎందుకు చికెన్ ధరలు ఇంతలా తగ్గాయి? నాన్ వెజ్ ప్రియులు చికెన్ తినడానికి ఎందుకు జంకుతున్నారు? ఏకంగా ప్రభుత్వాలే చికెన్ తినొద్దని ఎందుకు హెచ్చరిస్తున్నాయి? లక్షలాదిగా కోళ్ళు ఎందుకు చనిపోతున్నాయి?... ఈ ప్రశ్నలన్నింటిని ఒకటే సమాధానం బర్డ్ ప్లూ. ఈ మహమ్మారి వైరస్ విజృంభణతో దేశంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఆంక్షలు తప్పడంలేదు.  

23
Bird Flu

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ప్లూ వ్యాప్తి? 

ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణలో బర్డ్ ప్లూ వేగంగా వ్యాపిస్తోంది. దీంతో లక్షలాది కోళ్లు ఉన్నట్టుండి మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బర్డ్ ప్లూ కారణంగా పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇలా ఈ వైరస్ మెళ్లిగా రాష్ట్రమొత్తం వ్యాపిస్తోంది. ఇది కోళ్ల నుండి మనుషులకు వ్యాపించే ప్రమాదం వుండటంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. జిల్లాల సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటుచేసి కోళ్ల రవాణాను అడ్డుకుంటున్నారు. 

ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇదే పరిస్థితి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఈ బర్డ్ ప్లూ వ్యాప్తి ఎక్కువగా కనిపిస్తోంది. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఇప్పటికే బర్డ్ ప్లూ సోకి లక్షల కోళ్లు మృత్యువాతపడ్డాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు బర్డ్ ప్లూ సోకిన ప్రాంతాలకు 10 కిలోమీటర్ల పరిధిని సర్వెలెన్స్‌ జోన్‌గా ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా కోళ్ళఫారాల్లో పనిచేసేవారు, వాటికి దగ్గర్లో నివాసముండేవారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. 

ఎవరైన బర్డ్ ప్లూ లక్షణాలతో బాధపడితే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నాయి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు. బర్డ్ ప్లూ మనుషులకు సోకితే 2 నుండి 6 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయని...  జలుబు, ముక్కుకారడం, శ్వాస తీసుకోడంలో ఇబ్బందిగా వుంటుందని వైద్యులు చెబుతున్నారు.ముక్కు మూసుకుపోవడం,గొంతునొప్పి, దగ్గు,తీవ్రమైన తలనొప్పి, హైఫీవర్, తీవ్ర అలసట, కాళ్లు చేతుల కండరాల నొప్పులు, వికారం, వాంతులు విరేచనాలు వంటివి కూడా బర్డ్ ప్లూ సోకినవారిలో కనిపిస్తాయి. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యసాయం పొందాలని తెలుగు ప్రజలకు సూచిస్తున్నాయి ప్రభుత్వాలు. 

బర్డ్ ప్లూ అంటువ్యాధి కాదు...కానీ ఈ వైరస్ సోకిన కోళ్ళను తినడం ద్వారా మనుషులకు వ్యాపించే అవకాశం వుంటుంది. ప్రస్తుతం ఈ వైరస్ కోళ్లలో ఎక్కువగా కనిపిస్తోంది కాబట్టి కొంతకాలం చికెన్ తినకుండా వుంటే మంచిదని ప్రభుత్వాలు సూచిస్తున్నారు. దీంతో ప్రజలు చికెన్ జోలికి వెళ్లకపోవడంతో ధరలు అమాంతం పడిపోయాయి. 

33
Chicken Price in Hyderabad

ఏపీ, తెలంగాణలో చికెన్ ధరలు : 

బర్డ్ ప్లూ ఎఫెక్ట్ కేవలం పౌల్ట్రీ రైతులపైనే కాదు చికెన్ షాపులపైనా పడింది. ఈ వైరస్ భయంతో చికెన్ తినడానికి ప్రజలు భయపడుతున్నారు... దీంతో ధర పడిపోయింది. చాలారోజులుగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధర రూ.200 పైనే వుండేది... కానీ ఇప్పుడు 200 దిగువకు వచ్చింది. హైదరాబాద్ లో ప్రస్తుతం కిలో చికెన్ ధర రూ.130 నుండి రూ.150 వరకు వుంది. ఇక ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం వంటి పట్టణాల్లో కూడా ఇలాగే చికెన్ ధరలు పడిపోయాయి.

నగరాల్లోనే ఈ పరిస్థితి వుంటే గ్రామాల్లో మరింత దారుణంగా వుంది. సహజంగా గ్రామాల్లో చికెన్ అమ్మకాలు ఎక్కువగా వుండవు... ఆదివారం లేదా ప్రత్యేక రోజుల్లోనే ఎక్కువగా తింటుంటారు. కానీ ఇప్పుడు బర్డ్ ప్లూ కారణంగా మొత్తానికే చికెన్ తినడం మానేసారు. దీంతో పల్లెల్లో చికెన్ ధర మరింత తక్కువగా వుంది.

ఇక బర్డ్ ప్లూ మరణాలు, చికెన్ ధర పడిపోవడంతో పౌల్ట్రీ రైతులు కోళ్లను అతి తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. కొందరు రైతులు ఒక్కో కోడిని రూ.30 నుండి రూ.50 ఇచ్చేస్తున్నారు...పౌల్ట్రీ ఫారంల వద్దే అమ్మకాలు చేపడుతున్నారు. అయినప్పటికీ బర్డ్ ప్లూ భయంతో వాటిని కొనడానికి ఎవరూ ముందుకురావడంలేదు. ఉచితంగా ఇస్తామన్నా చికెన్ తినడానికి ఇష్టపడటంలేదు. 

హైదరాబాద్ లో ఎప్పుడూ కలకలలాడే చికెన్ షాపులు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. నగరంలో చికెన్ అమ్మకాలు 50 శాతానికి పడిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. చికెన్ ధర పడిపోయినా అమ్ముడుపోకపోవడంతో వ్యాపారులు నష్టపోతున్నారు. బర్డ్ ప్లూ మహమ్మారి తమ పొట్టకొడుతోందని అటు పౌల్ట్రీ రైతులు, ఇటు చికెన్ అమ్ముకునేవారు ఆవేదన  వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

మీరు ఇకపై చికెన్ తిన్నారో అంతే సంగతి..: కోళ్లను అడ్డుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లో చెక్ పోస్టులు
 

click me!

Recommended Stories