Bathukamma: బొడ్డెమ్మ పండుగకి, బ‌తుక‌మ్మ పండుగకి తేడా ఏంటో తెలుసా.?

Published : Sep 19, 2025, 01:56 PM IST

Bathukamma: తెలంగాణ‌కు మాత్ర‌మే ప్ర‌త్యేక‌మైన పండుగ‌ల్లో బ‌తుక‌మ్మ ముఖ్య‌మైంది. ఈ ఏడాది కూడా మ‌హిళ‌లు బ‌తుక‌మ్మ వేడుక‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో బ‌తుక‌మ్మ ఉత్స‌వాల్లో భాగంగా జ‌రిగే బొడ్డెమ్మ వేడుక గురించి తెలుసుకుందాం. 

PREV
15
బ‌తుక‌మ్మ ముందు బొడ్డెమ్మ

తెలంగాణ సంప్రదాయ పండుగల్లో బొడ్డెమ్మకు ప్రత్యేక స్థానం ఉంది. భాద్రపద మాసంలో అమావాస్యకు ముందు నుంచి తొమ్మిది రోజుల పాటు ఈ పండుగ జరుపుతారు. కొంతమంది ఐదు రోజుల పాటు, మరికొందరు మూడు రోజులపాటు కూడా నిర్వహిస్తారు. ఇక మ‌రికొంద‌రు అమావాస్య ముందు రోజు బొడ్డెమ్మ పండుగ జ‌రుపుతారు. బతుకమ్మకు ముందు జరిగే ఈ వేడుకను బొడ్డెమ్మల పున్నమి అని పిలుస్తారు. ముఖ్యంగా బాలికలు, పెళ్లి కాని అమ్మాయిలు భక్తి, శ్ర‌ద్ధ‌ల‌తో ఈ పండుగలో పాల్గొంటారు.

25
బొడ్డెమ్మ ప్రత్యేకత

‘బొడ్డ’ అంటే అత్తి చెట్టు లేదా ఔదుంబర వృక్షం అని అర్థం. ఈ చెట్టు ఆరోగ్యపరమైన అనేక గుణాలను కలిగి ఉంటుంది. మహిళలకు, సంతాన సాఫల్యానికి సంబంధించి ప్రత్యేకమైన ఔషధగుణాలు ఇందులో ఉన్నాయని విశ్వాసం. అందుకే ప్రకృతితో స్త్రీ జీవితానికి ఉన్న సంబంధాన్ని గుర్తుచేస్తూ బొడ్డెమ్మ పండుగ జరుపుకుంటారు.

35
బొడ్డెమ్మ రూపాలు

ప్రాంతాలవారీగా బొడ్డెమ్మ తయారీలో వేరువేరు విధానాల‌ను పాటిస్తారు. ప్రధానంగా ఇవి నాలుగు రకాలుగా విభజిస్తారు:

పీట బొడ్డెమ్మ – చెక్క పీటపై పుట్టమన్నుతో ఐదు అంతస్తుల్లా పేర్చి తయారు చేస్తారు.

గుంట బొడ్డెమ్మ – గుంటల రూపంలో త‌యారు చేస్తారు.

పందిరి బొడ్డెమ్మ – పందిరిలా అలంకరించి తయారు చేస్తారు.

బాయి బొడ్డెమ్మ – బావి ఆకారంలో తయారుచేస్తారు. ఏ రూపంలో ఉన్నా పూజా విధానం మాత్రం ఒకటే.

45
ఆటలు, పాటలతో సందడి

ప్రతి రోజు సాయంత్రం ఆడపడుచులు ఇంటి ఆవరణలో బొడ్డెమ్మను అలంకరించి చుట్టూ తిరుగుతూ కోలాటాలు ఆడతారు. సహజ పూలతో అలంకరించిన బొడ్డెమ్మ చుట్టూ పాటలు పాడుతూ ఆనందిస్తారు. చివర్లో “నిద్రపో బొడ్డెమ్మా...” వంటి జానపద గీతాలతో బొడ్డెమ్మను నిద్రపుచ్చుతారు. తొమ్మిది రోజుల ఉత్సవం చివరిరోజు ‘పోయిరా బొడ్డెమ్మా’ అంటూ పాడుకుంటూ చెరువులో లేదా బావిలో నిమజ్జనం చేస్తారు.

55
బతుకమ్మకు ఆరంభం

బొడ్డెమ్మ పండుగ ముగిసిన వెంటనే మహాలయ అమావాస్య రోజు బతుకమ్మ వేడుకలు మొదలవుతాయి. ఇలా సుమారు 20 రోజుల తెలంగాణ అంతా బొడ్డెమ్మ, బతుకమ్మ, దసరా సంబరాలతో కళకళలాడుతుంది. ఇది కేవలం ఆడపడుచుల పండుగ మాత్రమే కాక, ప్రకృతిని పూజించే, సంప్రదాయాన్ని కొనసాగించే అద్భుతమైన సాంస్కృతిక వారసత్వంగా నిలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories