
Andhra Pradesh-Telangana Water Dispute : ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి (టిడిపి, జనసేన, బిజెపి).. తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయి. ఈ పార్టీల మధ్య రాజకీయ విబేధాలు ఉన్నా ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి. తెలుగు దేశం పార్టీయే రేవంత్ కు రాజకీయంగా లిఫ్ట్ ఇచ్చింది... అందుకే ఆయన ఇప్పటికీ చంద్రబాబుపై అభిమానం ప్రదర్శిస్తుంటారు. చంద్రబాబు కూడా టిడిపి తయారుచేసిన నాయకుడు తెలంగాణకు సీఎం కావడంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటారు
చంద్రబాబు, రేవంత్ లను పొలిటికల్ సర్కిల్ లో గురుశిష్యులుగా పేర్కొంటారు. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య సత్సంబంధాలు ఉండటంతో ప్రభుత్వాల మధ్య కూడా గత ఏడాదికాలంగా మంచి సంబంధాలే కొనసాగాయి. ఇద్దరు సీఎంలు స్వయంగా కలుసుకుని విభజన సమస్యలపై కూడా చర్చించుకున్నారు. ఇలా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ మధ్య మళ్ళీ సంబంధాలు బలపడుతున్న సమయంలో బనకచర్ల ప్రాజెక్ట్ చిచ్చు పెట్టింది.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్ట్ పై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా తమ నీటిని తరలించుకుపోయేందుకు ఏపీ కుట్రలు చేస్తోందని తెలంగాణ అందోళన వ్యక్తం చేస్తోంది. కానీ ఏపీ మాత్రం ఎవరికీ ఉపయోగం లేకుండా సముద్రంలో కలుస్తున్న నదీ జలాలను వాడుకునేందుకే ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నట్లు.. దీని వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదని చెబుతోంది. ఇలా బనకచర్ల ప్రాజెక్ట్ ఇరురాష్ట్రాల మధ్య మరోసారి జలజగడానికి కారణమయ్యింది.
ఈ ప్రాజెక్ట్ వివాదం చివరకు ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య వార్నింగ్ లకు దారితీసింది. బుధవారం బనకచర్ల ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకు జరిగే అన్యాయాన్ని వివరించేందుకు అఖిలపక్ష ఎంపీల సమావేశం నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పొలిటికల్ గురువు చంద్రబాబుకే వార్నింగ్ ఇచ్చారు. కేంద్రంలో పలుకుబడి ఉందని ఏం చేసినా చెల్లుతుందని అనుకుటున్నావా చంద్రబాబు... తెలంగాణకు అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమంటూ గట్టిగానే హెచ్చరించారు.
ఇలా తెలుగు రాష్ట్రాలు, ముఖ్యమంత్రులు మధ్య చిచ్చు పెడుతున్న ఈ బనకచర్ల ప్రాజెక్ట్ ఏమిటి? దిగువ రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుపై ఎగువ రాష్ట్రానికి అభ్యంతరం ఏమిటి? ఈ ప్రాజెక్టు పూర్తి స్వరూపం ఏమిటి? అన్నది ఇక్కడ తెలుసుకుందాం.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరచూ నదులు అనుసంధానం గురించి మాట్లాడుతుంటారు. అంటే ఎక్కువ నీటిలభ్యత ఉన్న నదుల నుండి తక్కువ నీటిలభ్యత గల నదులకు నీటిని తరలించడమే ఈ నదుల అనుసంధానం కాన్సెప్ట్. ఇలా డిజైన్ చేసిందే ఈ బనకచర్ల ప్రాజెక్ట్.
తెలుగు రాష్ట్రాల్లో గోదావరి నది చాలాదూరం ప్రవహిస్తుంది... కానీ ఈ నదీజలాలను ఇరురాష్ట్రాలు పూర్తిగా వాడుకోవడం లేదు. దీంతో భారీ వర్షాలు, వరదల సమయంలో వేల టిఎంసిల నీరు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయి. అయితే ఈ వరద జలాల్లో 200 టీఎంసిలను ఒడిసిపట్టి రాయలసీమతో పాటు ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగు, త్రాగునీరు అందించేందుకు ఈ బనకచర్ల ప్రాజెక్ట్ చేపడుతున్నామని కూటమి ప్రభుత్వం చెబుతోంది.
ఈ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి-కృష్ణా నదులను అనుసంధానం చేస్తారన్నమాట. గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం నుండి కృష్ణా నదిపైని శ్రీశైలం ప్రాజెక్ట్ కుడి కాలువపై గల బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ వరకు వరదనీటిని తరలించాలన్నది చంద్రబాబు సర్కార్ ప్లాన్. ఇందుకోసం భారీ జలాశయాలు ఏర్పాటుచేసి ఎత్తిపోతలు, టన్నెల్స్, కాలువలను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమ భూములను సాగుకు అనుకూలంగా మారుస్తామని... రాళ్లసీమను రతనాల సీమ చేస్తామని కూటమి ప్రభుత్వం చెబుతోంది.
చంద్రబాబు సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నదుల అనుసంధానంలో ఈ బనకచర్ల ప్రాజెక్ట్ చాలా కీలకమైనది. ఏకంగా 200 టిఎంసిల వరదనీటిని ఓ నది నుండి మరోనదికి... ఓ ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తరలించే ప్రయత్నమిది. ఈ మెగా ప్రాజెక్ట్ ను మూడు దశల్లో చేపట్టనున్నట్లు ఇప్పటికే కూటమి ప్రభుత్వం ప్రతిపాదించింది... దీనికి కేంద్ర అనుమతులే కాదు సహకారం కూడా కోరుతోంది.
మొదటిదశలో గోదావరి వరదనీటిని కృష్ణా నదికి తరలిస్తారు.. అంటే పోలవరం నుండి ప్రకాశం బ్యారేజీకి తరలిస్తారు. ఇది పోలవరం కాలువల ద్వారా చేపడతారు. ఇలా మొదటి దశలో కాలువలు, ఎత్తిపోతల ద్వారా నీటిని 175 కిలోమీటర్లు తరలిస్తారు.
రెండో దశలో ఈ ప్రకాశం బ్యారేజీ నుండి బొల్లపల్లి వద్ద నిర్మించే రిజర్వాయర్ కు నీటిని తరలిస్తారు. బనకచర్ల ప్రాజెక్టులో ఈ రిజర్వాయర్ చాలా కీలకమైనది... దీన్ని 152 టీఎంసిల నిల్వ సామర్థ్యంలో నిర్మించాలని భావిస్తున్నారు. ఇలా రెండో దశలో 152 కిలోమీటర్ల వరకు నీటిని తరలిస్తారు.
ఇక మూడో దశలో ఈ బొల్లపల్లి రిజర్వాయర్ నుండి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ కు నీటిని తరలిస్తారు. ఇక్కడినుండి రాయలసీమ, ప్రకాశం. నెల్లూరు జిల్లాలకు సాగునీటిని అందిస్తారు.
అయితే ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఈ మూడో దశ చాలా క్లిష్టమైనదిగా నీటిపారుదల నిపుణులు చెబుతున్నారు. నల్లమల అడవులు, కొండలను దాటుకుని నీటిని తరలించాల్సి ఉంటుంది. ఇలా మొత్తం 135 కిలోమీటర్లు నీటిని తరలించాల్సి ఉంటుంది.
తెలంగాణ ఎగువన ఉంది.. ఏపీ దిగువన ఉంది... ముందు తెలంగాణ వాడుకున్నాకే గోదావరి జలాలైనా, కృష్ణా జలాలైన దిగువకు వెళ్లేది. ఏపీని దాటితే ఆ నీరంతా సముద్రంలోనే కలుస్తుంది. బనకచర్లను వరదనీటి తరలింపు కోసమే నిర్మిస్తున్నట్లు ఏపీ చెబుతోంది. అలాంటప్పుడు తెలంగాణకు అభ్యంతరం ఏమిటి? ఇప్పుడు ఇదే చాలామందిలో మెదులుతున్న ప్రశ్న.
అయితే ఈ ప్రాజెక్ట్ ద్వారా నీటి తరలింపు విధానాన్నే తెలంగాణ వ్యతిరేకిస్తోంది. ఏపీ పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా, తెలంగాణకు అన్యాయం చేసేలా ఈ ప్రాజెక్టును ఏపీ నిర్మిస్తోందని రేవంత్ సర్కార్ ఆరోపిస్తోంది. ఇప్పటికే నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ పై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం సాగుతోంది... ఇప్పుడు ఈ బనకచర్ల ప్రాజెక్టులో నాగార్జునసాగర్ ను వినియోగించుకోవడాన్ని తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
వరద జలాల తరలింపు పేరుతో తెలంగాణ వాటా జలాలను కూడా తరలించే కుట్రలో భాగమే ఈ బనకచర్ల ప్రాజెక్ట్ అని తెలంగాణ ఆరోపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని అంగీకరించబోమని... పోరాటానికి సైతం సిద్దమని అంటున్నారు. కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు అనుమతులున్న తెచ్చుకుంటే న్యాయస్థానాల ద్వారా పోరాడి అడ్డుకుంటామని తెలంగాణ సీఎం చెబుతున్నారు. తెలంగాణ హక్కులను కాలరాసే ఇలాంటి ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి ఇవ్వకుండా రాష్ట్రానికి చెందిన అన్నిపార్టీల ఎంపీలు పోరాడాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.