Teenmar Mallanna: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై చేసిన అనుచిత వ్యాఖ్యలతో తీన్మార్ మల్లన్న కార్యాలయంపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. ఈ క్రమంలోనే గన్‌మెన్ గాల్లో కాల్పులు జరిపారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
Teenmar Mallanna: చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి జరిగింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల రాష్ట్రంలో రాజకీయంగా చర్చనీయాంశమైన తీన్మార్ మల్లన్న కార్యాలయం పీర్జాదిగూడలోని క్యూ న్యూస్ ఆఫీస్‌పై పలువురు ఆదివారం ఉదయం దాడి చేశారు.
ఎమ్మెల్సీ కవితపై వ్యాఖ్యలో దాడులు
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహంతో తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం.
ఇటీవల బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై మల్లన్న చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. ఆయన వ్యాఖ్యలు పెద్ద వివాదంగా మారాయి.
25
క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి.. గన్ మెన్ కాల్పులు
సుమారు 30 మంది క్యూ న్యూస్ కార్యాలయంలోకి దూసుకెళ్లారనీ, అక్కడి ఫర్నిచర్, కంప్యూటర్లు, అద్దాలను ధ్వంసం చేశారని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.
క్యూ న్యూస్ సిబ్బంది వారిని నిలువరించే ప్రయత్నం చేసినా పరిస్థితి మరింత దిగజారింది. ఆ సమయంలో తీన్మార్ మల్లన్న గన్‌మెన్‌లు గాల్లోకి ఐదు నుంచి ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్టు సమాచారం.
35
జాగృతి కార్యకర్త సాయికి గాయాలు.. రాచకొండ సీపీ స్పందన
గన్ మెన్లు కాల్పులు జరపడంతో జాగృతి కార్యకర్త సాయికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. గన్‌మెన్ కాల్పుల సమయంలో గాజు పెంచులు గుచ్చుకొని రక్తస్రావమయ్యింది. గాయపడిన సాయిని వెంటనే రామ్‌నగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఘటనపై రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు స్పందించారు. క్యూ న్యూస్ కార్యాలయాన్ని సందర్శించి మీడియాతో మాట్లాడుతూ.. "ఇరు వర్గాల మధ్య తోపులాటలో అద్దాలు పగిలాయి. కొందరికి గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన జాగృతి కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నాం, విచారణ కొనసాగుతోంది" అని తెలిపారు. క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని మల్కాజిగిరి డీసీపీ పద్మజ కూడా తెలిపారు.
మల్లన్న సభ్యత్వాన్ని సస్పెండ్ చేయాలి.. కవిత డిమాండ్
ఈ ఘటన అనంతరం ఎమ్మెల్సీ కవిత శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. మల్లన్న శాసనమండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. "ఒక మహిళా ఎమ్మెల్సీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని సమర్థించడమా? కాల్పులు జరిపిన ఘటనపై సీఎం, డీజీపీలకు కూడా ఫిర్యాదు చేశా" అని ఆమె చెప్పారు.
తీన్మార్ మల్లన్న ఏమన్నారు?
తన వ్యాఖ్యలను సమర్థించుకున్న తీన్మార్ మల్లన్న, "ఆ వ్యాఖ్యలు తెలంగాణలో సామెతగా వాడతారు" అని అన్నారు. క్యూ న్యూస్ కార్యాలయంపై దాడిని ఖండించారు.
"కవిత అభిమానులు మా కార్యాలయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. గన్‌మెన్‌ను కొట్టి ఆయుధాన్ని లాక్కొవాలని చూసారని" పేర్కొన్నారు.
55
హాట్ టాపిక్ గా మారిన మల్లన్న కామెంట్స్, ఆఫీస్ పై దాడి
ఈ ఘటన రాజకీయంగా రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కొంత కాలంగా రాష్ట్రంలో దాదాపు అన్ని పార్టీల నాయకులు బీసీ అంశాన్ని లేవనెత్తుతున్నారు. బీసీల కోసం తాము ముందున్నామనే ప్రచారం చేసుకుంటున్నారు.
తాజాగా బీసీ అంశం నేపథ్యంలోనే కవితపై తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ తర్వాత మల్లన్న ఆఫీసు పై దాడి, గన్‌మెన్ కాల్పులు, కవిత ఫిర్యాదులు రాజకీయ ఉత్కంఠను పెంచాయి.