
monsoon : సీజనల్ పండ్ల గురించి అందరికీ తెలుసు... సీజనల్ వ్యాధుల గురించి వినివుంటారు... మరి సీజనల్ పదాల గురించి ఎప్పుడైనా విన్నారా?... కొన్ని పదాలు కొన్ని సీజన్లలో బాగా వినిపిస్తుంటాయి. ఇలా వేసవి, శీతాకాలంలో అధిక, అత్యల్ప ఉష్ణోగ్రతలు అనే పదాలు బాగా వినిపిస్తారు. ఇక వర్షాకాలంలో రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్ అలర్ట్... తుఫాను, ప్రమాద హెచ్చరికలు, క్యూసెక్కులు అనే పదాలు బాగా వినిపిస్తారు.
అయితే వర్షాకాలంలో ఈ పదాలను వినడమే తప్ప చాలామందికి వీటిగురించి తెలియదు. కాబట్టి ఈ అలర్ట్స్ ఏమిటి? ఎప్పుడు ఏ అలర్ట్ జారీ చేస్తారు? ఎవరు చేస్తారు? ఈ సమయంలో తీసుకోవాల్సి జాగ్రత్తలేమిటి? తదితర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
వర్షాకాలంలో భారీ వర్షాలు, వరదల నుండి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం విపత్తు నిర్వహణ సంస్థలు వంటి వ్యవస్థలను ఏర్పాటుచేసింది. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితులను ముందుగానే ఊహించగలిగితే... ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయగలిగితే... ఈ ఆలోచన నుండి వచ్చినవే వాతావరణ హెచ్చరికలు. వాతావరణ విభాగాలు అత్యాధునిక టెక్నాలజీ సాయంతో వాతావరణం ఎలా ఉండనుందో ముందే అంచనావేస్తాయి... ఇందుకు తగినట్లుగా వివిధ రకాల హెచ్చరికలు జారీ చేస్తుంది.
వర్షాకాలంలో ప్రజలను అప్రమత్తం చేయడానికి పలు రకాల వాతావరణ హెచ్చరికలు జారీ చేస్తారు. ఇవి ప్రమాద తీవ్రతను సూచిస్తాయి... వీటిని బట్టి అధికారులు కూడా ముందుజాగ్రత్త చర్యలు చేపడతారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ హెచ్చరికల గురించి తెలియాల్సిన అవసరం ఉంది. వర్షాకాలంలో జారీచేసే రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్ అలర్ట్స్ గురించి తెలుసుకుందాం.
ఏదైనా ప్రదేశంలో 24 గంటల వ్యవధిలో స్వల్ప వర్షపాతం నమోదయ్యే అవకాశాలుంటే ఈ గ్రీన్ అలర్ట్ జారీ చేస్తారు. ఈ అలర్ట్ జారీ చేసారంటే చిరుజల్లులు, మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలుంటాయి. 24 గంటల్లో కేవలం 6.45 సెంటిమీటర్ల లోపే వర్షపాతం నమోదయ్యే అవకాశాలుంటాయి. ఈ అలర్ట్ జారీచేస్తే ప్రమాదమేమీ లేనట్లే.
ఈ హెచ్చరిక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటే జారీ చేస్తుంది వాతావరణ శాఖ. అంటే రాబోయే 24 గంటల్లో ఏదైనా ఓ ప్రాంతంలో 6.4 సెంటిమీటర్ల నుండి 11.55 సెం.మీ మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశాలుంటే ఈ అలర్ట్ జారీ చేస్తుంది. అంటే చిరుజల్లుల కంటే కాస్త ఎక్కువ వర్షమే కురుస్తుందన్నమాట.
భారీ వర్షాలు కురిసే అవకాశాలుంటే ఈ అలర్ట్ జారీ చేస్తారు. 24 గంటల్లో ఓ ప్రాంతంలో 11 సెంటిమీటర్ల నుండి 20 సెం.మీ మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశాలుంటే వాతావరణ శాఖ ఈ హెచ్చరిక చేస్తుంది. భారీ వర్షాలు కారణంగా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ అలర్ట్ వెలువడితే ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతుంది. లోతట్టు ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తుంది... అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది.
వాతావరణ శాఖ విడుదలచేసే చివరి హెచ్చరిక రెడ్ అలర్ట్. ఓ ప్రాంతంలో రాబోయే 24 గంటల్లో అసాధారణ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశాలుంటేనే ఈ అలర్ట్ జారీ చేస్తారు. ఎడతెరిపి లేకుండా కుండపోతగా 20 సెంటిమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉంటే ఈ రెడ్ అలర్ట్ సూచిస్తుంది.
ఈ రెడ్ అలర్ట్ ప్రాంతాల్లో వరదలు సంభవించే ప్రమాదం ఉంటుంది... కాబట్టి లోతట్టు ప్రాంతాలు మునకకు గురవుతాయి. ఈ సమయంలో అక్కడి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తారు. ఇక గాలివాన కారణంగా పెద్దపెద్ద చెట్లు, హోర్డింగ్స్ వంటివి కూలిపోయే ప్రమాదం ఉంటుంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు విపత్తు నిర్వహణ విభాగం రెడీగా ఉంటుంది.
రెడ్ అలర్ట్ చాలా అరుదు... ప్రతి వర్షాకాలంలో ఓ ప్రాంతంలో గరిష్టంగా నాలుగైదుసార్లు మాత్రమే ఇది జారీ అయ్యే అవకాశాలుంటాయి. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న కొన్ని రాష్ట్రాల్లో ఈ రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ సంస్థ (IMD). రెడ్ అలర్ట్ సమయంలో భారీ ఆస్తినష్టం, ఒక్కోసారి ప్రాణనష్టం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి.