
ప్రపంచవ్యాప్తంగా 2.5 బిలియన్ జీమెయిల్ యూజర్లకు గూగుల్ అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. యూజర్లు వెంటనే తమ పాస్‌వర్డ్ మార్చుకోవాలని పేర్కొంది. అలాగే 2-స్టెప్ వెరిఫికేషన్ (2SV) ప్రారంభించాలని సూచించింది. ఇటీవల పెరుగుతున్న హ్యాకింగ్ దాడుల నేపథ్యంలో ఈ హెచ్చరికలు చేసింది. సైబర్ హ్యాకింగ్ గ్రూప్ షైనీహంటర్స్ (ShinyHunters)కు చెందిన హ్యాకర్లు ఉన్నారని పేర్కొంది.
2020 నుంచి యాక్టివ్‌గా ఉన్న ఈ గ్రూప్, ఫిషింగ్ (Phishing) పద్ధతినే ప్రధానంగా ఉపయోగిస్తోంది. నకిలీ ఇమెయిల్స్ పంపి, యూజర్లు తప్పు లాగిన్ పేజీల్లో వివరాలు నమోదు చేసేలా మోసం చేస్తుంది. ఈ గ్రూప్ ఇప్పటివరకు AT&T, Microsoft, Santander, Ticketmaster వంటి కంపెనీల డేటా బ్రీచ్‌ల వెనుక ఉందని అనుమానాలున్నాయి.
గూగుల్ జూన్ నెలలోనే దీనిపై హెచ్చరికలు చేసింది. “షైనీహంటర్స్ భవిష్యత్తులో డేటా లీక్ సైట్ (DLS) ప్రారంభించి బలవంతపు డిమాండ్లు చేసే అవకాశముంది” అని పేర్కొంది. ఆ తర్వాత ఆగస్టు 8న, ప్రభావితమైన Gmail యూజర్లకు గూగుల్ ఇమెయిల్ ద్వారా నోటిఫికేషన్ పంపింది.
2-స్టెప్ వెరిఫికేషన్ వల్ల పాస్‌వర్డ్ బయటకు వచ్చినా అకౌంట్ సురక్షితంగా ఉంటుంది. ఎందుకంటే హ్యాకర్లు రెండో స్థాయి కోడ్ లేకపోతే అకౌంట్‌కి యాక్సెస్ కావడం అసాధ్యం. యుకే లోని Action Fraud కూడా ఇదే విషయాన్ని గుర్తు చేసింది. “2SV యాక్టివ్ చేస్తే హ్యాకర్లు మీ అకౌంట్‌ల్లోకి చొరబడలేరు, పాస్‌వర్డ్ తెలిసినా కూడా మీ డేటాను చోరీ చేయలేరు.” అని తెలిపింది.
“Stop Think Fraud” వెబ్‌సైట్ కూడా 2SV సులభంగా ప్రారంభించవచ్చని తెలిపింది. ఇది ఇమెయిల్, బ్యాంకింగ్, సోషల్ మీడియా సహా ఎక్కువ ఆన్‌లైన్ సేవల్లో అందుబాటులో ఉందని స్పష్టం చేసింది.
గూగుల్ జూలైలో ఒక సేల్ ఫోర్స్ సిస్టమ్‌లో డేటా బ్రీచ్ జరిగిందని అంగీకరించింది. అయితే కస్టమర్ Gmail లేదా Cloud అకౌంట్లు ప్రభావితం కాలేదని తెలిపింది. బయటపడిన సమాచారం ఎక్కువగా పబ్లిక్ బిజినెస్ డేటాగా పేర్కొంది. అయితే, హ్యాకర్లు దీన్ని మరింత తీవ్రమైన దాడులకు ఉపయోగిస్తున్నారని పేర్కొంది.
గూగుల్ థ్రెట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ ప్రకారం.. సోషల్ ఇంజనీరింగ్ దాడుల్లో IT సపోర్ట్ సిబ్బంది లాగా నటిస్తూ హ్యాకర్లు యూజర్లను మోసం చేస్తున్నారు. ఇది అనేక అకౌంట్లకు హాని కలుగజేస్తోంది.
వరుస డేటా బ్రీచ్ ల నేపథ్యంలో గూగుల్ యూజర్లకు పాస్‌వర్డ్‌ను తరచూ మార్చుకోవాలని సూచిస్తోంది. దీని కోసం ఈ కింద సూచించిన స్టెప్ లను ఫాలో అవ్వండి..
బ్రౌజర్ అయితే,
1. Google Account ఓపెన్ చేయండి
2. ఎడమవైపు “Security” క్లిక్ చేయండి
3. “Signing in to Google” లో “Password” ఎంచుకోండి
4. మళ్లీ సైన్ ఇన్ చేసి కొత్త పాస్‌వర్డ్ టైప్ చేయండి
5. “Change password” క్లిక్ చేయండి
6. మీకు టూ స్టెప్ వేరిఫికేషన్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది
Android లో:
• Settings > Google > Manage your Google Account > Security > Password
iPhone/iPad లో:
• Gmail యాప్ ఓపెన్ చేసి > ప్రొఫైల్ పిక్ > Manage your Google Account > Personal info > Password