AI Tool: పని చేయకపోతే ఎవరైనా అంతే.. సరిగా పనిచేయడం లేదని రోబోని పీకి పారేశారు..

Published : May 22, 2026, 07:17 PM IST

AI Tool: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. అయితే సరిగ్గా పనిచేయకపోతే మనుషులకే కాదు రోబోలకు కూడా కాలం చెల్లుతుందని తెలిపే ఓ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..? 

PREV
14
ఈ ఏఐ టూల్ ఎలా పనిచేసేది?

ప్రపంచ ప్రఖ్యాత కాఫీ చైన్ స్టార్బక్స్ (Starbucks) తమ స్టోర్లలో ఉత్పత్తుల కొరత సమస్యను తగ్గించేందుకు ప్రవేశపెట్టిన ఏఐ ఆధారిత ఇన్వెంటరీ టూల్‌ను నిలిపివేసింది. ఉత్తర అమెరికాలోని స్టోర్లలో అమలు చేసిన కేవలం తొమ్మిది నెలలకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. 2025 సెప్టెంబర్‌లో "Automated Counting" పేరుతో ప్రారంభించిన ఈ టూల్ ద్వారా స్టోర్లలో పాలు, సిరప్స్ వంటి వస్తువుల నిల్వలను వేగంగా లెక్కించాలనే లక్ష్యం పెట్టుకుంది. అయితే ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో కంపెనీ ఈ ప్రాజెక్ట్‌ను విరమించుకుంది.

స్టోర్ ఉద్యోగులు హ్యాండ్‌హెల్డ్ టాబ్లెట్లు లేదా మొబైల్ పరికరాల ద్వారా షెల్ఫ్‌లలో ఉన్న వస్తువులను స్కాన్ చేసేవారు. ఆ సమాచారాన్ని ఏఐ విశ్లేషించి స్టాక్ వివరాలను నమోదు చేసేది. ఈ విధానం వల్ల చేతితో లెక్కించే ప్రక్రియ తగ్గి, ఉత్పత్తుల లభ్యతపై స్పష్టమైన సమాచారం అందుతుందని కంపెనీ భావించింది. ముఖ్యంగా ఓట్ మిల్క్, కోల్డ్ ఫోమ్, కారమెల్ డ్రిజిల్ వంటి పదార్థాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా సరఫరా వ్యవస్థను మెరుగుపరచాలనుకుంది.

24
సాంకేతిక లోపాలే ప్రధాన కారణమా?

ఈ టూల్‌ను నోమడ్‌గో సంస్థ భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు. అయితే వాస్తవ వినియోగంలో అనేక సమస్యలు ఎదురైనట్లు తెలుస్తోంది. ఒకే తరహా పాలు లేదా ఇతర ఉత్పత్తులను తప్పుగా గుర్తించడం, కొన్ని వస్తువులను పూర్తిగా మిస్ చేయడం వంటి లోపాలు తరచూ కనిపించాయి. దీంతో స్టాక్ లెక్కల్లో ఖచ్చితత్వం తగ్గిపోయింది. సరఫరా గొలుసు నిర్వహణను మెరుగుపరచాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన టూల్ కొన్ని సందర్భాల్లో మరిన్ని గందరగోళాలకు దారితీసినట్లు సమాచారం. ఫలితంగా కంపెనీ మళ్లీ సంప్రదాయ ఇన్వెంటరీ లెక్కింపు విధానానికే తిరిగి వెళ్లాలని నిర్ణయించింది.

34
కంపెనీ ఏమి చెప్పింది?

స్టార్ బక్స్ అంతర్గత ప్రకటన ప్రకారం "Automated Counting" సేవలను నిలిపివేస్తున్నట్లు ఉద్యోగులకు తెలియజేశారు. ఇకపై పాలు, పానీయాల తయారీలో ఉపయోగించే ఇతర పదార్థాలను కూడా మిగతా ఇన్వెంటరీ మాదిరిగానే లెక్కించాలని సూచించారు. ఈ నిర్ణయంపై స్పందించిన స్టార్బక్స్ యాజమాన్యం, అన్ని కాఫీహౌస్‌లలో ఒకే విధమైన ఇన్వెంటరీ లెక్కింపు విధానాన్ని అమలు చేయడమే లక్ష్యమని తెలిపింది. అలాగే స్టోర్లకు మరింత తరచుగా సరుకులు పంపించడం, సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడం వంటి చర్యలపై దృష్టి పెట్టినట్లు వెల్లడించింది. కస్టమర్ కోరిన ఉత్పత్తి మెనూలో ఉంటే అది తప్పకుండా అందుబాటులో ఉండాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని కంపెనీ స్పష్టం చేసింది.

44
ఉద్యోగుల కోతలు.. లాభాలపై ఒత్తిడి

స్టార్ బక్స్ సీఈవో బ్రియాన్ నికోల్ "Back to Starbucks" పేరుతో సంస్థ పునరుద్ధరణ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా వినియోగిస్తూ వ్యాపార నిర్వహణను మెరుగుపరచేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఖర్చులు తగ్గించేందుకు కంపెనీ ఇటీవల అమెరికాలో 300 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అట్లాంటా, చికాగో, డల్లాస్, బర్బ్యాంక్ వంటి నగరాల్లోని కొన్ని ప్రాంతీయ కార్యాలయాలను కూడా మూసివేస్తోంది. అంతర్జాతీయ విభాగాల్లో కూడా ఉద్యోగాల కోతలు ఉండే అవకాశముందని సంకేతాలు ఇచ్చింది. ఇటీవల అమ్మకాలు మెరుగుపడినప్పటికీ, ఉత్తర అమెరికా మార్కెట్లో ఆపరేటింగ్ మార్జిన్లు రెండు సంవత్సరాల క్రితం 18 శాతం ఉండగా ప్రస్తుతం 9.9 శాతానికి పడిపోయినట్లు రిపోర్టులు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖర్చుల నియంత్రణ, సాంకేతిక పరిష్కారాల సమర్థ వినియోగంపై స్టార్బక్స్ మరింత దృష్టి సారిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories