
రీల్స్ అంటే మొబైల్‌లో నిలువుగా (Vertical) చూసే చిన్న వీడియోలు. ఈ కాన్సెప్ట్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత ప్రధానంగా టిక్‌టాక్‌కు దక్కుతుంది. 2017లో అంతర్జాతీయంగా ప్రారంభమైన ఈ యాప్.. 2018లో భారత్‌లో విపరీతమైన ఆదరణ పొందింది. తర్వాత 2020లో ఇన్‌స్టాగ్రామ్ కూడా రీల్స్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. అనంతరం ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్‌లూ షార్ట్ వీడియోల ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రతిరోజూ రీల్స్ చూస్తున్నారు.
రీల్స్‌కు ఆకర్షితులవడం వెనుక మన మెదడు పనితీరు కీలక పాత్ర పోషిస్తుంది. మనకు నచ్చిన లేదా ఆశ్చర్యపరిచే వీడియో కనిపించినప్పుడు మెదడులో డోపామిన్ అనే రసాయనం విడుదల అవుతుంది. దీంతో మనకు ఆనందంగా అనిపిస్తుంది. అదే అనుభూతిని మళ్లీ పొందాలనే ఉద్దేశంతో మరో రీల్, ఇంకో రీల్ చూస్తూ పోతాం. అలాగే తదుపరి వీడియో ఎలా ఉంటుందో తెలియకపోవడం కూడా ఆసక్తిని పెంచుతుంది. ఒక వీడియో పూర్తయ్యేలోపే మరో వీడియో ఆటోమేటిక్‌గా రావడం వల్ల ఆపాలనే ఆలోచన కూడా రాదు. దీంతో గంటల తరబడి రీల్స్ చూస్తూ సమయాన్ని వృథా చేస్తుంటారు.
ఎక్కువసేపు రీల్స్ చూడటం వల్ల ఏ పనిపైనా ఎక్కువసేపు ఏకాగ్రతతో ఉండటం కష్టమవుతుంది. ఆఫీసులో పనిచేసే సమయంలో కూడా చాలామంది మధ్యలో రీల్స్ చూస్తుంటారు. దీంతో పని నాణ్యత తగ్గడంతో పాటు ఉత్పాదకత కూడా తగ్గుతుంది. ఒక అధ్యయనం ప్రకారం భారతీయులు తమ స్మార్ట్‌ఫోన్ వినియోగ సమయంలో దాదాపు ఐదో వంతు షార్ట్ వీడియోలకే కేటాయిస్తున్నారు. అలాగే 64 శాతం మంది గతంతో పోలిస్తే ఇప్పుడు మరింత ఎక్కువగా రీల్స్ చూస్తున్నామని అంగీకరించారు.
సోషల్ మీడియా అల్గోరిథమ్ మనకు నచ్చే వస్తువుల ప్రకటనలు, వీడియోలను ఎక్కువగా చూపిస్తుంది. దీంతో అవసరం లేకపోయినా వెంటనే కొనాలనే కోరిక కలుగుతుంది. దీనినే ఇంపల్స్ బాయింగ్ అంటారు. ఫలితంగా పొదుపు తగ్గిపోవడం, క్రెడిట్ కార్డులు లేదా వ్యక్తిగత రుణాలపై ఆధారపడటం పెరిగే అవకాశం ఉంది. ఇది భవిష్యత్తులో ఆర్థిక ఒత్తిడికి దారితీస్తుంది.
చదువు, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, కెరీర్ అభివృద్ధికి ఉపయోగపడే సమయాన్ని చాలామంది రీల్స్ చూస్తూ గడుపుతున్నారు. ఒక అధ్యయనం ప్రకారం Gen Z యువతలో 89 శాతం మంది ప్రతిరోజూ రీల్స్ చూస్తున్నారు. వీరిలో చాలామంది రోజుకు రెండు గంటలకు పైగా షార్ట్ వీడియోలు చూస్తున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఇదే సమయాన్ని కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి వినియోగిస్తే వ్యక్తిగతంగానే కాకుండా దేశ ఆర్థికాభివృద్ధికీ ఉపయోగపడుతుంది.
గంటల తరబడి నిరంతరం రీల్స్ లేదా సోషల్ మీడియా స్క్రోల్ చేయడాన్ని డూమ్ స్క్రోలింగ్ అంటారు. దీని వల్ల నిద్రలేమి, ఆందోళన, డిప్రెషన్, మానసిక అలసట వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది. మానసిక ఆరోగ్యం దెబ్బతింటే ఉద్యోగాల్లో గైర్హాజరు పెరుగుతుంది. పనితీరు తగ్గుతుంది. దీని ప్రభావం వ్యక్తిగత ఆదాయంపైనే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థపైనా పడుతుంది.
రీల్స్‌లో చాలామంది స్టాక్ మార్కెట్, క్రిప్టో, మ్యూచువల్ ఫండ్లు, వ్యాపార అవకాశాలపై తక్కువ సమయంలో పెద్ద లాభాలు వస్తాయని చెబుతుంటారు. అయితే అలాంటి వీడియోలు చేసే వారిలో చాలామందికి సరైన అర్హతలు లేదా అధికారిక అనుమతులు ఉండవు. కేవలం వ్యూస్, లైక్స్, స్పాన్సర్‌షిప్‌ల కోసం రీసెర్చ్ లేకుండా పెట్టుబడి సలహాలు ఇస్తుంటారు. వాటిని నమ్మి పెట్టుబడులు పెడితే డబ్బు నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
రీల్స్‌ను పూర్తిగా మానేయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ కొన్ని అలవాట్లు మార్చుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
రోజుకు సమయం నిర్ణయించుకోండి: రీల్స్ చూడటానికి రోజుకు 15 నుంచి 20 నిమిషాల సమయం మాత్రమే కేటాయించండి.
నోటిఫికేషన్లు ఆఫ్ చేయండి: సోషల్ మీడియా నోటిఫికేషన్లు ఆఫ్ చేస్తే అవసరం లేకుండా యాప్ ఓపెన్ చేసే అలవాటు తగ్గుతుంది.
మంచి అలవాట్లు పెంచుకోండి: ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవడం, నడక, వ్యాయామం, సంగీతం వినడం, కుటుంబంతో గడపడం వంటి పనులు చేయండి.
డిజిటల్ డీటాక్స్ పాటించండి: వారానికి కనీసం ఒక రోజు సోషల్ మీడియాకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి.
మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి: "ఇప్పుడు రీల్స్ చూడటం నిజంగా అవసరమా? ఈ సమయాన్ని చదువుకు లేదా పనికి ఉపయోగిస్తే బాగుండదా?" అని ఆలోచించే అలవాటు పెంచుకోండి.