Anushka Sharma : అరంగేట్రంలోనే అదరగొట్టింది.. ఎవరీ అనుష్క శర్మ?

Published : Jan 10, 2026, 11:28 PM IST

Gujarat Giants vs UP Warriorz : డబ్ల్యూపీఎల్ 2026లో గుజరాత్ జెయింట్స్ బోణీ కొట్టింది. అరంగేట్రంలోనే అనుష్క శర్మ (44) పరుగులతో ఆకట్టుకుంది. కెప్టెన్ గార్డ్‌నర్ రాణించడంతో యూపీ వారియర్స్ పై గుజరాత్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.

PREV
16
బౌలర్లను ఉతికారేసిన అనుష్క.. గార్డ్‌నర్‌తో కలిసి విధ్వంసం !

నవీ ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ గ్రౌండ్ లో జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ సత్తా చాటింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో గుజరాత్ జట్టు 10 పరుగుల తేడాతో యూపీ వారియర్స్ పై విజయం సాధించి, ఈ సీజన్‌లో తమ మొదటి విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం మాత్రం 22 ఏళ్ల యువ సంచలనం అనుష్క శర్మ ప్రదర్శన. తన అరంగేట్ర మ్యాచ్‌లోనే ఈ మధ్యప్రదేశ్ ఆల్ రౌండర్ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంది.

26
అరంగేట్రంలోనే అద్భుత ప్రదర్శన ఇచ్చిన అనుష్క శర్మ

యూపీ వారియర్స్ తో జరిగిన మ్యాచ్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అనుష్క శర్మ.. ఎలాంటి బెరుకు లేకుండా ఆడింది. కేవలం 30 బంతుల్లోనే 44 పరుగులు చేసి గుజరాత్ భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించింది. కెప్టెన్ యాష్ గార్డ్‌నర్‌తో కలిసి ఆమె నెలకొల్పిన 103 పరుగుల భాగస్వామ్యం మ్యాచ్ ను మార్చేసింది. అంతటి ఒత్తిడిలోనూ క్రీజులో నిలదొక్కుకుని, బౌండరీలు బాదుతూ తన క్లాస్ చూపించింది. దేశవాళీ క్రికెట్‌లో మధ్యప్రదేశ్ తరఫున, ఇండియా-సి తరఫున అద్భుతాలు సృష్టించిన అనుష్క, డబ్ల్యూపీఎల్ లో తన ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పింది.

36
45 లక్షల ధరకు న్యాయం చేసిన అనుష్క శర్మ

వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కూడా అనుష్క కోసం పోటీ పడినప్పటికీ, చివరకు గుజరాత్ జెయింట్స్ ఆమెను రూ. 45 లక్షలకు సొంతం చేసుకుంది. ఈ ధరకు ఆమె పూర్తిగా న్యాయం చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ యువ ప్లేయర్ దేశవాళీ ఫస్ట్-క్లాస్ సర్క్యూట్‌లో 620 పరుగులు చేయడంతో పాటు 22 వికెట్లు తీసింది. డిసెంబర్‌లో ఇండియా-బి పై జరిగిన మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ, రెండు వికెట్లతో ఆకట్టుకుంది. ఈ ఫామ్‌ను దృష్టిలో ఉంచుకునే గుజరాత్ మేనేజ్‌మెంట్ ఆమెను కీలకమైన మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపింది.

46
అనుష్క శర్మ ఒత్తిడిని జయించిన తీరు అద్భుతం

మ్యాచ్ అనంతరం అనుష్క మాట్లాడుతూ.. మొదట్లో కాస్త ఒత్తిడికి లోనయ్యానని అంగీకరించింది. "నిజం చెప్పాలంటే, నేను కొంచెం నెర్వస్‌గా ఫీలయ్యాను. కానీ 2-3 బంతులు ఆడాక ఆ భయం పోయింది. అప్పుడు యాష్ (గార్డ్‌నర్) నాకు మంచి కంపెనీ ఇచ్చారు. మేమిద్దరం భాగస్వామ్యాన్ని నిర్మించుకోవడంపైనే దృష్టి పెట్టాం. మా డొమెస్టిక్ సీజన్ అనుభవం, కోచింగ్ స్టాఫ్ సపోర్టు నాకు బౌండరీలు, సిక్సర్లు కొట్టడంలో సహాయపడ్డాయి" అని అనుష్క పేర్కొంది. రాబోయే టీ20 ప్రపంచ కప్ 2026 కోసం భారత జట్టులో స్థానం సంపాదించడానికి ఈ ప్రదర్శన ఆమెకు ఎంతగానో ఉపయోగపడనుంది.

56
గుజరాత్ బ్యాటింగ్ విధ్వంసం

టాస్ గెలిచిన యూపీ వారియర్స్ కెప్టెన్ మెగ్ లానింగ్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఓపెనర్ సోఫీ డివైన్ ఆరంభంలోనే దూకుడుగా ఆడి 38 పరుగులు చేసింది. అనంతరం అనుష్క శర్మ (44), కెప్టెన్ యాష్ గార్డ్‌నర్ తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఇది డబ్ల్యూపీఎల్ చరిత్రలో గుజరాత్ జెయింట్స్ నమోదు చేసిన అత్యధిక స్కోరు కావడం విశేషం.

66
ఉత్కంఠ పోరులో గుజరాత్ విజయం

208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్స్.. ఆదిలోనే కిరణ్ నవ్‌గిరే వికెట్‌ను కోల్పోయింది. అయితే ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (40 బంతుల్లో 78), కెప్టెన్ మెగ్ లానింగ్ (రెండో వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యం) పోరాడారు. 9వ ఓవర్‌లో జార్జియా వేర్‌హామ్.. లానింగ్‌ను అవుట్ చేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. లిచ్‌ఫీల్డ్, శ్వేతా సెహ్రావత్ మధ్య ఓవర్‌లలో ఆశలు రేపినప్పటికీ, చివరకు వారిద్దరూ అవుట్ కావడంతో యూపీకి కష్టాలు తప్పలేదు. చివరి ఓవర్‌లో విజయానికి 27 పరుగులు అవసరం కాగా, గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి జట్టుకు 10 పరుగుల విజయాన్ని అందించారు.

Read more Photos on
click me!

Recommended Stories