ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 కు అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు. అతడు బ్యాటింగ్, బౌలింగ్ లో పెద్దగా రాణించకున్నా కళ్లుచెదిరే ఫీల్డింగ్ తో అదరగొట్టాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్లో అతడు పట్టిన క్యాచులు అద్బుతం. ఈ సమయంలోనే అక్షర్ ను 'బాపు, బాపు' అంటూ పిలుస్తూ అభిమానం చాటుకున్నారు... ఇలా అతడి నిక్ నేమ్ బాగా పాపులర్ అయ్యింది.
అయితే రోహిత్, కోహ్లీల మాదిరిగా అక్షర్ కు 'బాపు' అనే నిక్ నేమ్ ఆటతీరువల్ల వచ్చిందికాదు... పుట్టిపెరిగిన ప్రాంతం, సామాజిక వర్గం ఆధారంగా వచ్చింది. అక్షర్ అనేది మాత్రమే ఆయన పేరు... పటేల్ అనేది ఇంటిపేరు. గుజరాత్ లో పటిదార్ సామాజికవర్గ ప్రజలు ఎక్కువశాతం సంపన్నులు, రాజకీయంగా కూడా మంచి పలుకుబడి కలిగినవారు. అందువల్లే వీరిని అక్కడి సామాన్య ప్రజలు 'బాపు' (పెద్దమనిషి) అని సంభోదిస్తుంటారు. అక్షర్ పటేల్ కూడా ఈ సామాజిక వర్గానికి చెందినవారే.
అక్షర్ పటేల్ ను చిన్నప్పటి నుంచే స్నేహితులు, కుటుంబ సభ్యులు 'బాపు' అని పిలుస్తూ వచ్చారు. అతడు టీమిండియాలోకి వచ్చాక సహచర క్రికెటర్లు కూడా 'బాపు' అనే పిలవడం ప్రారంభించారు. ఇదికాస్త అభిమానులకు తెలిసింది... ఇంకేముందు అక్షర్ పటేల్ కాస్త పూర్తిస్థాయి 'బాపు' గా మారిపోయాడు. ఇటీవల టీ20 లో ఈ నిక్‌నేమ్ బాగా పాపులర్ అయింది... అభిమానులు సోషల్ మీడియాలో, స్టేడియాల్లో అక్షర్ ను బాపు అంటూనే సంబోధించారు.