Team India : ఫ్లాప్ అవుతున్నా అభిషేక్ శర్మకే ఎందుకు ఛాన్స్ ఇచ్చారు? అసలు నిజం చెప్పిన గంభీర్

Published : Mar 09, 2026, 06:56 PM IST

Team India : టీ20 ప్రపంచకప్‌లో అభిషేక్ శర్మ వరుసగా విఫలమైనా అతడికి అండగా నిలవడంపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. జట్టు ప్రయోజనాల కోసమే అతడి దూకుడును సమర్థించామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

PREV
16
గంభీర్ ప్లాన్ అదిరింది.. అభిషేక్ శర్మ ఫ్లాప్ అయినా ఛాన్స్ ఇచ్చింది అందుకే

టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు అద్భుత విజయం సాధించి మూడోసారి విశ్వవిజేతగా నిలిచింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన హోరాహోరీ ఫైనల్ పోరులో భారత్ జయకేతనం ఎగురవేసింది. అయితే, ఈ టోర్నీ ఆరంభం నుంచి యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ గురించి తీవ్ర చర్చ నడిచింది. టోర్నీ మొత్తంగా ఆశించిన స్థాయిలో పరుగులు చేయకపోయినా, కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో, అభిషేక్ శర్మ వరుస వైఫల్యాల ఎదుర్కొంటున్నా అతడికి ఎందుకు ఇన్ని అవకాశాలు ఇచ్చారనే అంశంపై టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తాజాగా స్పందించారు.

26
అభిషేక్ శర్మపై గంభీర్ నమ్మకం

గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ, అభిషేక్ శర్మ ఎంపిక వెనుక ఉన్న కారణాలను వివరించారు. టోర్నీ అంతటా అభిషేక్ కేవలం రెండు అర్ధ సెంచరీలు మాత్రమే సాధించినప్పటికీ, అతడిని జట్టు ఎందుకు వదులుకోలేదో గంభీర్ వెల్లడించారు. "మేము అభిషేక్ శర్మపై మొదటి నుంచీ నమ్మకం ఉంచాం. అందుకే అతను చివరకు ఫైనల్‌లో సత్తా చాటగలిగాడు. ఒక ఆటగాడిని మనం నమ్మి ఎంచుకున్నప్పుడు, కేవలం నాలుగు లేదా ఐదు మ్యాచ్‌ల ఆధారంగా అతడిని పక్కన పెట్టలేం" అని గంభీర్ స్పష్టం చేశారు. ఆటగాడి సామర్థ్యాన్ని నమ్మి ఎంపిక చేస్తే అది జట్టుకు మేలు చేస్తుందని ఆయన అన్నారు.

36
దూకుడుగా ఆడాలనేదే మా సూచన

అభిషేక్ శర్మ ఆటతీరుపై గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. "బయట ఉన్న వారికి అభిషేక్ చేసిన పరుగులు కనిపించకపోవచ్చు. కానీ ఒక కోచ్‌గా నేను చూసేది వేరు. అభిషేక్ ఏ మ్యాచ్‌లోనూ 20 బంతుల్లో 20 పరుగులు చేసి జట్టును ఇబ్బందుల్లో నెట్టలేదు. అలాంటి ఇన్నింగ్స్ జట్టుకు అవసరం లేదు. మేం అతడికి ఇచ్చిన సందేశం చాలా స్పష్టంగా ఉంది.. ఒకవేళ నువ్వు పరుగులు చేయకపోయినా పర్వాలేదు, తదుపరి మ్యాచ్‌లో మరింత దూకుడుగా ఆడు. మేం ఎప్పుడూ అతడిని ఒత్తిడిలో ఉండి ఆడమని చెప్పలేదు. ఒక బంతికి ఒక పరుగు తీసే ఆట మాకు వద్దు" అని గంభీర్ వివరించారు.

46
జట్టు ప్రయోజనాలే ముఖ్యం

జట్టులోని 15 మంది ఆటగాళ్లపై తమకు పూర్తి విశ్వాసం ఉందని గంభీర్ పేర్కొన్నారు. ఎవరికైనా అవకాశం వచ్చినప్పుడు వారు జట్టు కోసం అత్యుత్తమ ప్రదర్శన ఇస్తారని ఆయన నమ్ముతున్నారు. "అభిషేక్ అయినా లేదా మరెవరైనా.. జట్టులో ఉన్న ప్రతి ఒక్కరిపై మాకు నమ్మకం ఉంది. మా జట్టులో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రతి ఆటగాడు తన వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యం ఇస్తారు. స్వార్థం లేకుండా ఆడటమే మా విజయ రహస్యం" అని గంభీర్ వ్యాఖ్యానించారు.

56
ఫామ్ అనేది తాత్కాలికం

ఏ జట్టులోనూ ఆటగాళ్లందరూ ఒకేసారి ఫామ్‌లో ఉండటం సాధ్యం కాదని గంభీర్ గుర్తు చేశారు. "ప్రపంచంలో ఏ జట్టులోనైనా ఒకరు ఫామ్‌లో ఉంటే, మరొకరు ఇబ్బంది పడుతుంటారు. ఇది సహజం. న్యూజిలాండ్ సిరీస్ చూస్తే సంజూ శాంసన్ పరుగులు చేయలేదు. కానీ అదే సంజూ ఈ ప్రపంచకప్‌లో బ్యాటింగ్ చేసిన తీరు ప్రతి ఒక్కరికీ ఒక కలలా ఉంటుంది. అభిషేక్ విషయంలోనూ అదే జరిగింది. టోర్నీ అంతా ఇబ్బంది పడినా, సరైన సమయంలో జట్టుకు అవసరమైన ఇన్నింగ్స్ ఆడాడు" అని ఆయన ప్రశంసించారు.

66
భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటటి?

భారత జట్టు మూడోసారి టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలవడం పట్ల గంభీర్ హర్షం వ్యక్తం చేశారు. అభిషేక్ శర్మ లాంటి యువ ఆటగాళ్లకు సపోర్టు ఇవ్వడం వల్ల భవిష్యత్తులో టీమ్ ఇండియా మరింత బలోపేతం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆటగాళ్ల సహజ సిద్ధమైన శైలిని మార్చుకోమని కోరడం కంటే, వారిని ప్రోత్సహించడం ద్వారానే గొప్ప ఫలితాలు వస్తాయని గంభీర్ తన కోచింగ్ ఫిలాసఫీని చాటిచెప్పారు. ఈ విజయంతో టీమ్ ఇండియా తన ఆధిపత్యాన్ని ప్రపంచ క్రికెట్‌లో మరోసారి నిరూపించుకుంది.

Read more Photos on
click me!

Recommended Stories