
భారత క్రికెట్ చరిత్రలో కొన్ని విజయాలు కేవలం ట్రోఫీలకు మాత్రమే పరిమితం కావు. అవి కాలక్రమేణా విస్మరించిన, విమర్శించిన ఆటగాళ్లు, కోచ్‌ల కష్టానికి లభించిన ప్రతిఫలాలు. ఇటీవల టీ20 ప్రపంచకప్‌లో భారత్ సాధించిన అద్భుత విజయం క్రికెట్ ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది. అదే ప్రాసెస్ మీద నమ్మకం ఉంచడం. ఈ విజయానికి ముగ్గురు ప్రధాన నాయకులు సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్. వీరి ముగ్గురి దారులు వేరైనా, లక్ష్యం మాత్రం ఒక్కటే.. తమ విమర్శకుల నోళ్లు మూయించడం.. భారత క్రికెట్‌ను శిఖరాగ్రానికి తీసుకెళ్లడం. ఇప్పుడు అదే జరిగింది.. అంతర్జాతీయంగా సత్తా చాటుతూ ఛాంపియన్ గా టీమిండియా నిలిచింది.
ఈ ముగ్గురు దిగ్గజాల కథలో ఒక పోలిక ఉంది. అది కఠినమైన విమర్శల మధ్య సుదీర్ఘ కాలం వేచి చూడటం. కేరళకు చెందిన స్టైలిష్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను చూస్తే, అతను ఏళ్ల తరబడి జట్టులో లోపలికి, బయటికి వస్తూనే ఉన్నాడు. అతనికి అవకాశం వచ్చినప్పుడల్లా ఆకాశమంత అంచనాలు ఉండేవి. ఒక చెత్త షాట్ ఆడితే చాలు, సంజూ విలన్ అయిపోయేవాడు. సోషల్ మీడియాలో అతని ఎంపికపై యుద్ధాలే జరిగేవి. కానీ సంజు ఓడిపోలేదు. దేశవాళీ క్రికెట్‌లో పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా తనను తాను ఒక పరిణతి చెందిన నాయకుడిగా మార్చుకున్నాడు.
సూర్యకుమార్ యాదవ్ కథ ఏదో సినిమాను తలపిస్తుంది. సూర్య తన మొదటి నీలి రంగు జెర్సీని ధరించడానికి 30 ఏళ్ల వయస్సు వరకు వేచి చూడాల్సి వచ్చింది. అతని వయస్సు అయిపోయిందని విమర్శకులు అనేవారు. కానీ ప్రతిభకు వయస్సుతో సంబంధం లేదని సూర్య నిరూపించాడు. అతని 360 డిగ్రీల షాట్లు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. నేడు అతను ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్. ఈ స్థాయికి చేరుకోవడానికి అతను ముంబైలోని ఎండలో పిచ్‌లపై ఏళ్ల తరబడి చెమటోడ్చాడు.
గౌతమ్ గంభీర్ విషయం కొంత భిన్నమైనది. ఆటగాడిగా అతను భారత్‌కు రెండు ప్రపంచకప్‌లను అందించాడు. కానీ కోచ్‌గా అతని ఇన్నింగ్స్ ఆరంభం ముళ్ల బాటలా సాగింది. ఐపీఎల్‌లో మెంటార్‌గా విజయం సాధించిన తర్వాత టీమ్ ఇండియా బాధ్యతలు చేపట్టినప్పుడు అనేక ప్రశ్నలు తలెత్తాయి. అతను ఆధునిక క్రికెట్‌తో సర్దుబాటు చేసుకోగలడా? అతని దూకుడు స్వభావం జట్టు వాతావరణాన్ని దెబ్బతీస్తుందా? అని చర్చలు జరిగాయి. గంభీర్ ఈ ప్రశ్నలన్నింటికీ మైదానంలో సమాధానం ఇచ్చాడు.
గణాంకాలు గమనిస్తే, టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గంభీర్ ఆధ్వర్యంలో భారత జట్టు విన్నింగ్ శాతం 85 శాతంగా ఉంది. ఇది అద్భుతమైన రికార్డు. ఆటగాళ్ల రికార్డుల కంటే వారి ఇంపాక్ట్ పైనే గంభీర్ దృష్టి పెడతాడు. వరుణ్ చక్రవర్తిని ఎప్పుడు ఆడించాలి, కుల్దీప్‌ను ఎప్పుడు రంగంలోకి దించాలి అనే విషయంలో అతనికి స్పష్టత ఉంది. మీడియా ఒత్తిడిని అతను లెక్కచేయడు. వరుసగా విఫలమవుతున్న అభిషేక్ శర్మపై అతను ఉంచిన నమ్మకం చివరకు ఫలితాన్ని ఇచ్చింది.
సంజూ శాంసన్ టీ20 వరల్డ్ కప్ 2026 లోని తన గత మూడు ఇన్నింగ్స్‌ల్లో చూపిన ఆట తీరు, తాను మరింత ప్రత్యేకమైన రేసుగుర్రం అని నిరూపించింది. అతను కేవలం పరుగులు చేయడమే కాకుండా, ప్రత్యర్థి బౌలర్ల వెన్ను విరిచే స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. అతని సెంచరీలు, హాఫ్ సెంచరీలు రికార్డ్ బుక్ కోసం మాత్రమే కాదు, అతడిని స్థిరత్వం లేనివాడు అన్న సెలెక్టర్లకు సమాధానాలు. ఈ టోర్నీలో 9 మ్యాచ్‌ల్లో 4 మ్యాచ్‌లకు అతడిని తుది జట్టులోకి తీసుకోలేదు. కానీ అవకాశం వచ్చిన వెంటనే సంజూ తన సత్తా చాటాడు.
మరోవైపు ఐసీసీ టోర్నీల్లో సూర్యకుమార్ యాదవ్ ఆధిపత్యం పెరుగుతూనే ఉంది. ఆసియా కప్ నుండి ఛాంపియన్స్ ట్రోఫీ వరకు, ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ వరకు సూర్య టీమ్ ఇండియా బ్యాటింగ్ వెన్నెముకగా నిలిచాడు. ఒత్తిడి సమయాల్లో అతను రాణిస్తాడు. పెద్ద పేరున్న ఆటగాళ్లు ఫ్లాప్ అయినప్పుడు, సూర్య తన అసాధారణ షాట్లతో మ్యాచ్‌ను మలుపు తిప్పుతాడు. వరల్డ్ కప్ లో సూర్య సగటు ప్రదర్శన చేసినా, అతని ఉనికి ప్రత్యర్థి జట్లను భయపెట్టింది. దీనికి తోడు అతని దూకుడు నాయకత్వం జట్టుకు అదనపు బలాన్ని ఇచ్చింది.
వీరి ముగ్గురి విజయం వెనుక ఒకరిపై ఒకరికి ఉన్న అచంచలమైన నమ్మకం ఉంది. గౌతమ్ గంభీర్ ఎప్పుడూ ఎక్స్-ఫ్యాక్టర్ ఉన్న ఆటగాళ్లకే సపోర్టు ఇస్తాడు. అతను సంజూ శాంసన్ ప్రతిభను గుర్తించి, అతనికి కావాల్సిన భద్రతను ఇచ్చాడు. ఒకటి రెండు వైఫల్యాల వల్ల జట్టు నుండి తొలగించబోమని స్పష్టం చేయడంతో సంజు స్వేచ్ఛగా ఆడగలిగాడు. అలాగే సూర్య, గంభీర్ మధ్య అనుబంధం కేకేఆర్ రోజుల నుండే ఉంది. సూర్య సామర్థ్యం గంభీర్‌కు బాగా తెలుసు. వరల్డ్ కప్ సమయంలో గంభీర్ ఇచ్చే సూచనలను సూర్య మైదానంలో అద్భుతంగా అమలు చేశాడు.
క్రికెట్‌లో ఫలితమే ముఖ్యం అని అంటారు, కానీ ప్రాసెస్ సరైనదైతే ఫలితం దానంతట అదే వస్తుందని వీరు నిరూపించారు. సంజూ తన షాట్ సెలెక్షన్‌పై, సూర్య తన ఫిట్‌నెస్, నాయకత్వ బాధ్యతలపై దృష్టి పెట్టారు. గంభీర్ జట్టులో గెలవాలనే కసిని నింపాడు. సంజూ సాంకేతికతపై, సూర్య స్థిరత్వంపై, గంభీర్ కోచింగ్ శైలిపై గతంలో అనేక విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు మూడు ఐసీసీ ట్రోఫీలు భారత్ ఖాతాలో చేరడంతో విమర్శకుల నోళ్లు మూతపడ్డాయి. సంజూ, సూర్య, గంభీర్.. ఈ ముగ్గురు మొనగాళ్లు భారత క్రికెట్‌లో ఒక కొత్త నిర్భయ యుగానికి నాంది పలికారు.