Dhinidhi Desinghu : అప్పుడు నీళ్లంటే భయం.. ఇప్పుడు ఒలింపిక్స్ లో పోటీ.. ఎవరీ 14 ఏళ్ల భారత స్విమ్మర్?

First Published | Jul 24, 2024, 6:11 PM IST

Paris Olympics - Dhinidhi Desinghu : ఒప్పుడు స్విమ్మింగ్ పూల్‌లోకి వెళ్ల‌డానికి ఇష్టంలేని భారత టీనేజ్ స్విమ్మింగ్ సంచలనం ధీనిధి దేశింగు.. ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్‌లో ప్ర‌పంచ దేశాల ఛాంపియ‌న్ ప్లేయ‌ర్ల‌తో పోటీ ప‌డుతోంది. 
 

Paris Olympics - Dhinidhi Desinghu : కేవలం 14 ఏళ్ల వయసులోనే భార‌త్ త‌రఫున ఈ నెలాఖరులో జరిగే పారిస్ ఒలింపిక్స్‌లో బ‌రిలోకి దిగుతోంది స్విమ్మింగ్ సంచ‌ల‌నం ధీనిధి దేశింగు. తోటివారు టీనేజ్ వ‌య‌స్సును ఎంజ‌య్ చేస్తున్న స‌మ‌యంలో ధీనిధి త‌న‌ క్రమశిక్షణ, త్యాగంతో ఇప్పుడు ఒలింపిక్స్ లో అడుగుపెట్ట‌బోతోంది. ప్ర‌పంచ దేశాల ఛాంపియ‌న్ స్విమ్మ‌ర్ల‌తో పోరుకు సై అంటోంది. తొమ్మిదో తరగతి విద్యార్థి.. భారత స్విమ్మింగ్‌లో సంచ‌ల‌నం.. 14 ఏండ్ల ఈ అమ్మాయి ఇప్పుడు భార‌త్ కు ఒలింపిక్ మెడ‌ల్ అందించ‌డ‌మే ల‌క్ష్యంగా పారిస్ చేరుకుంది. 

Paris Olympics, Dhinidhi Desinghu

గత సంవత్సరం నేషనల్ గేమ్స్, సీనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లలో ధీనిధి దేశింగు స్విమ్మింగ్ లో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌లు చేసింది. ఈ సీజన్‌లో ఆమె టాప్ ర్యాంకింగ్స్‌తో పాటు, స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) ఆమెకు ఒలింపిక్స్‌లో పాల్గొనే స్థానాన్ని అందించింది. భార‌త్ త‌ర‌ఫున స్విమ్మింగ్ విభాగంలో పోటీ ప‌డుతున్న ఇద్ద‌రిలో ధీనిధి ఒక‌రు కావ‌డం విశేషం. త‌న స్విమ్మింగ్ ప్ర‌యాణం గురించి మాట్లాడిన ధీనిధి దేశింగ్.. "కొన్నిసార్లు నేను సాధారణంగా నా వయస్సు పిల్లలకు ఉండే వినోదాన్ని కోల్పోతాను. నేను స్నేహితులతో ఎక్కువగా బయటకు వెళ్లను..  చాలా స‌మ‌యంలో ఒంటరిగా ఉన్నాను. తొలినాళ్ల‌లో నీళ్లంటే భ‌యంగా ఉన్న నాకు కొన్ని రోజుల త‌ర్వాత ఈత కొట్టాలని కోరిక.. ఆ త‌ర్వాత ఒలింపిక్స్‌కు వెళ్లాలని అనుకున్నాను' అని ధినిధి చెప్పారు. 


Paris Olympics, Dhinidhi Desinghu

అలాగే, "నా కోసం ఈ మార్గాన్ని ఎంచుకున్నది నేనే. దానితో చాలా త్యాగాలు వస్తాయి, కానీ నేను భిన్నంగా, అసాధారణంగా.. గర్వంగా దీనిని భావిస్తున్నాను. 14 ఏళ్ళ వయసులో నేను ఒలింపిక్స్‌కు వెళ్తున్నాను, కాబట్టి నా అన్ని త్యాగాలు విలువైనవి" అని చెప్పారు. పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఇద్దరు భారత స్విమ్మర్‌లలో ధీనిధి దేశింగు ఒకరు. మరో స్విమ్మర్‌ శ్రీహరి నటరాజ్‌ (100మీ. బ్యాక్‌స్ట్రోక్‌). ధీనిధి 200 మీటర్ల ఫ్రీస్టైల్ ఈవెంట్‌లో పోటీపడనుంది. టీనేజ్ అమ్మాయి అయిన‌ప్ప‌టికీ స్విమ్మింగ్ లో తాను చూపిన అసాధార‌ణ ప్ర‌తిభ‌తో ఇప్పుడు ఒలింపిక్స్ లో పోటీ ప‌డుతోంది. పారిస్ 2024 ఒలింపిక్స్ మాత్ర‌మే కాదు రాబోయే 2028, 2032 ఒలింపిక్స్ ల‌లో కూడా పాల్గొనాల‌నే త‌న ధృఢ సంక‌ల్పాన్ని వ్యక్తం చేశారు. 

Dhinidhi Desinghu

"నేను చాలా కష్టపడ్డాను. అందుకే ఇప్పుడు ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం ల‌భించిందని నాకు తెలుసు. కానీ నా కెరీర్‌లో ఇంత తొందరగా ఈ అవకాశం రావడం ఆశ్చర్యంగా ఉంది. భారత బృందంలో అతి పిన్న వయస్కురాలిని కావడం గొప్ప గౌరవం. గొప్ప అథ్లెట్లను కలిసే అవకాశం లభించడం.. భారత ఒలింపిక్ బృందంలో భాగమైనందుకు నేను చాలా సంతోషంగా.. ఉత్సాహంగా ఉన్నాను” అని ధీనిధి అన్నారు.

Paris Olympics, Dhinidhi Desinghu

ఒలింపిక్స్‌కు ధీనిధి దేశింగు ప్రయాణం కేవలం వ్యక్తిగత మైలురాయి మాత్రమే కాదు, ఇటీవలి ఒలింపిక్స్ కు వెళ్లే సవాళ్లను ఎదుర్కొంటున్న భారత క్రీడాలకు ఆశాజ్యోతి అని చెప్పాలి. ధీనిధి ఎంపిక భారతదేశంలో స్విమ్మింగ్ తో పాటు ఇత‌ర క్రీడల‌కు ఉజ్వల భవిష్యత్తును సూచిస్తుంది. యువ క్రీడాకారులను పెద్ద కలలు కనేలా ప్రేరేపిస్తుందని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు. 

Latest Videos

click me!