Shah Rukh Khan , Rahul Dravid
IPL 2025 - Rahul Dravid : భారత లెజెండరీ క్రికెటర్ ద్రవిడ్ మళ్లీ ఐపీఎల్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. భారత జట్టును ప్రపంచ విజేతగా నిలిబెట్టిన ఈ ఛాంపియన్ కోచ్ రాబోయే సీజన్ తో మరోసారి ఐపీఎల్ గ్రౌండ్ లోకి దిగబోతున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2024 గెలిచిన తర్వాత భారత ప్రధాన కోచ్ గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగిసింది. బీసీసీఐ మరోసారి భారత జట్టు కోచ్ గా ఉండాలని కోరినా.. ద్రవిడ్ దానికి సుముఖంగా లేకపోవడంతో అతని స్థానంలో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్ గా బాధ్యతలు చేపట్టాడు.
అయితే, ఐపీఎల్ లోకి రాబోతున్న రాహుల్ ద్రవిడ్ ఏ జట్టుతో జతకట్టబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. భారత జట్టును ఛాంపియన్ గా నిలబెట్టిన రాహుల్ ద్రవిడ్ కోసం ఇప్పటికే పలు ఐపీఎల్ ఫ్రాంఛైజీలు అతన్ని సంప్రదించినట్టు మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. ద్రవిడ్ ముందుగా ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)లో చేరబోతున్నట్లు వార్తలు వచ్చాయి. భారత మాజీ ఓపెనర్ ద్రవిడ్ స్థానంలో కొత్త భారత ప్రధాన కోచ్‌గా నియమితులైన గంభీర్ ఇదివరకు కేకేఆర్ మెంటార్‌గా ఉండేవాడు. ఇప్పుడు షారుఖ్ ఖాన్ టీమ్ ద్రవిడ్ ను ప్రధాన కోచ్ గా తీసుకోవడానికి ఆసక్తిచూపుతున్నట్టు సమాచారం.
ఇదిలావుండగా, భారత మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఐపీఎల్ లోకి మరోసారి ఎంట్రీ ఇవ్వబోతున్నారని క్రికెట్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. రాజస్థాన్ టీమ్-ద్రవిడ్ మధ్య ఇప్పటికే ఈ విషయం గురించి చర్చలు జరుగుతున్నాయని పలు నివేదికలు పేర్కొన్నాయి. గతంలోనూ ద్రవిడ్ రాయల్స్‌కు ప్లేయర్ గా, మెంటర్ గా ఉన్నాడు.
ద్రవిడ్ 2011లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ తో చేరి రెండు సంవత్సరాల పాటు మెంటర్ గా పనిచేశాడు. మూడు సీజన్లు రాయల్స్ టీమ్ తో కలిసి నడిచాడు. ఆ తర్వాత ద్రవిడ్ బీసీసీఐ కోరికమేరకు U-19, టీమిండియా ఏ జట్టుకు కోచ్ గా చేరాడు. అతని నాయకత్వంలోనే U-19 భారత జట్టు 2016, 2018 ప్రపంచ కప్ ఫైనల్స్‌కు చేరుకుంది. రెండోసారి ప్రపంచ కప్ ను కూడా గెలిచింది. ద్రవిడ్ 2021లో సీనియర్ జట్టుకు ప్రధాన కోచ్‌గా మారడానికి ముందు నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) ఛైర్మన్‌గా ఉన్నారు.
Rahul Dravid
ద్రవిడ్ ప్రధాన కోచ్‌గా ఉన్న సమయంలో భారత జట్టు 2022 టీ20 ప్రపంచ కప్‌లో సెమీఫైనల్‌కు చేరుకుంది. భారత్ 2021-23 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ కు చేరుకుంది. అలాగే, వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్ కూడా చేరుకుంది. టీ20 ప్రపంచ కప్ 2024 లో ద్రవిడ్ కోచ్ గా, భారత జట్టు రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఐసీసీ మెగా ట్రోఫీని గెలుచుకుంది.