50 మీటర్ల రైఫిల్ ఈవెంట్‌లో ఒలింపిక్ మెడ‌ల్ గెలిచిన తొలి భార‌తీయుడు.. ఎవ‌రీ స్వ‌ప్నిల్ కుసాలే?

First Published | Aug 1, 2024, 2:22 PM IST

Indian shooter Swapnil Kusale : పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల రైఫిల్ 50 మీటర్ల 3-పొజిషన్స్ ఈవెంట్‌లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే బ్రాంజ్ మెడ‌ల్ గెలిచాడు. ఈ విభాగంలో ఒలింపిక్ మెడ‌ల్ గెలిచిన తొలి భార‌త షూట‌ర్ గా రికార్డు సృష్టించాడు. 
 

Indian shooter Swapnil Kusale : యంగ్ ప్లేయ‌ర్.. పెద్ద‌గా అనుభ‌వం కూడా లేదు. పురుషుల రైఫిల్ 50 మీటర్ల 3-పొజిషన్స్ ఈవెంట్‌లో గ‌తంలో భార‌త్ ఒక్క‌సారి కూడా ఫైన‌ల్ కు చేర‌లేదు. కానీ భార‌త షూట‌ర్ స్విప్నిల్ కుసాలే ఒలింపిక్స్ లో ఫైన‌ల్ కు చేరుకుని చ‌రిత్ర సృష్టించారు. అయినా అతను మెడ‌ల్ గెలుస్తాడ‌నే అంచనాలు భార‌త్ కు లేవు. ఎందుకంటే అండ‌ర్ డాగ్ గానే పారిస్ ఒలింపిక్స్ లో అడుగుపెట్టాడు. కానీ ఆ అంచ‌నాల‌న్నింటినీ ప‌టాపంచ‌లు చేస్తూ పురుషుల రైఫిల్ 50 మీటర్ల 3-పొజిషన్స్ ఈవెంట్‌లో భార‌త్ కు మెడ‌ల్ అందించాడు. ఈ విభాగంలో బ్రాంజ్ మెడ‌ల్ సాధించిన భార‌త తొలి షూట‌ర్ గా రికార్డు సృష్టించాడు.

Paris Olympics 2024 - Swapnil Kushale

పారిస్ ఒలింపిక్స్ 2024 లో భార‌త్ గెలుచుకున్న మూడో మెడ‌ల్ ఇది. ఇది కూడా షూటింగ్ విభాగంలోనే రావ‌డం విశేషం. భార‌త యంగ్ షూట‌ర్ స్వ‌ప్నిల్ కుసాలే మొత్తం స్కోరు 451.4తో మూడో ప్లేస్ తో బ్రాంజ్ మెడ‌ల్ గెలుచుకున్నాడు. చైనాకు చెందిన యుకున్ లియు 463.6 పాయింట్లతో  గోల్డ్ మెడ‌ల్, ఉక్రెయిన్‌కు చెందిన ఎస్. కులిష్ 461.3 పాయింట్లతో రజతం సాధించాడు.  


పారిస్ ఒలింపిక్స్ లో షూటింగ్ లో మెడల్ గెలిచి భారత జెండాను రెపరెపలాడించిన స్వప్నిల్ కుసాలే వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు. ఆగస్ట్ 6, 1995న పూణేలో జన్మించిన స్వప్నిల్ కుసలే వ్యవసాయ నేపథ్యంతో  ఒలింపిక్ చాంపియన్ స్థాయికి ఎదిగాడు. స్వప్నిల్ షూటింగ్ 2009లో అతని తండ్రి అతనిని మహారాష్ట్రలోని క్రీడా ప్రభోదిని అనే ప్రాథమిక క్రీడా కార్యక్రమంలో చేర్చడంతో అతని ప్రయాణం ప్రారంభమైంది.

ఒక సంవత్సరం తీవ్రమైన శిక్షణ తర్వాత, కుసాలే తన క్రీడగా షూటింగ్ ను ఎంచుకున్నాడు. అతని అంకితభావం, ప్రతిభ త్వరగానే గుర్తించిన అత‌ని కోసం 2013లో లక్ష్య స్పోర్ట్స్ నుండి స్పాన్సర్‌షిప్ పొందాడు. షూటింగ్ ప్రపంచంలో కుసలే సాధించిన విజయాలు చెప్పుకోదగ్గవి. 2015లో కువైట్‌లో జరిగిన ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ 3 ఈవెంట్‌లో స్వర్ణం సాధించాడు.

తుగ్లకాబాద్‌లో జరిగిన 59వ జాతీయ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు. గగన్ నారంగ్, చైన్ సింగ్ వంటి ప్రసిద్ధ షూటర్‌లను సైతం అధిగమించాడు. తిరువనంతపురంలో జరిగిన 61వ జాతీయ ఛాంపియన్‌షిప్‌లో మ‌రోసారి ఈ విజయాన్ని అందుకున్నాడు. 50 మీటర్ల రైఫిల్ 3-పొజిషన్ ఈవెంట్‌లో మరో స్వర్ణం సాధించాడు.

Swapnil Kusale

కైరోలో జరిగిన 2022 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వప్నిల్ 4వ స్థానంలో నిలిచాడు. భారతదేశానికి ఒలింపిక్ కోటా స్థానాన్ని సంపాదించాడు. పూణేలో జన్మించిన షూటర్ 2022 ఆసియా గేమ్స్‌లో టీమ్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించాడు. 2023 బాకులో జరిగిన ప్రపంచ కప్‌లో మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణం, వ్యక్తిగత, టీమ్ ఈవెంట్‌లలో రెండు రజత పతకాలతో పాటు స్వర్ణం సాధించాడు. కుసాలే 2022 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని సాధించాడు. 2021 న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ కప్‌లో టీమ్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించాడు.  మను భాకర్, సరబ్ జోత్ సింగ్ తర్వాత భారత్ కు షూటింగ్ లో మెడల్ గెలిచిన షూటర్ స్వప్నిల్ కుసాలే. 

Latest Videos

click me!