Indian shooter Swapnil Kusale : పారిస్ ఒలింపిక్స్ 2024 లో భారత్ మరో మెడల్ గెలుచుకుంది. ఇది కూడా షూటింగ్ విభాగంలోనే రావడం విశేషం. భారత యంగ్ షూటర్ స్వప్నిల్ కుసాలే భారత్ కు షూటింగ్ లో మూడో మెడల్ ను అందించాడు. పుణేలో జన్మించిన భారత షూటర్ స్వప్నిల్ కుసాలే అంతకుముందు, పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల రైఫిల్ 50 మీటర్ల 3-పొజిషన్స్ ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరుకోవడంతో పారిస్ ఒలింపిక్స్‌లో తనదైన ముద్ర వేశాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో 38 ఇన్నర్ 10లతో సహా 60 షాట్‌ల నుండి 590 పాయింట్లతో టాప్ ఎనిమిది షూటర్‌లలో స్థానం సంపాదించడానికి కుసాలే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. బలమైన ఆరంభం, స్థిరమైన ప్రదర్శనతో కుసాలే ఫైనల్ ప్రయాణం సాగింది.
Swapnil Kusale
ఎవరీ స్వప్నిల్ కుసలే?
ఆగస్ట్ 6, 1995న పూణేలో జన్మించిన స్వప్నిల్ కుసలే వ్యవసాయ నేపథ్యం నుండి వచ్చారు. స్వప్నిల్ షూటింగ్ 2009లో అతని తండ్రి అతనిని మహారాష్ట్రలోని క్రీడా ప్రభోదిని అనే ప్రాథమిక క్రీడా కార్యక్రమంలో చేర్చడంతో అతని ప్రయాణం ప్రారంభమైంది. అయితే, ఒక సంవత్సరం తీవ్రమైన శిక్షణ తర్వాత, కుసాలే తన క్రీడగా షూటింగ్ ను ఎంచుకున్నాడు. అతని అంకితభావం, ప్రతిభ త్వరగానే గుర్తించిన అతని కోసం 2013లో లక్ష్య స్పోర్ట్స్ నుండి స్పాన్సర్‌షిప్ పొందాడు. షూటింగ్ ప్రపంచంలో కుసలే సాధించిన విజయాలు చెప్పుకోదగ్గవి.
2015లో కువైట్‌లో జరిగిన ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ 3 ఈవెంట్‌లో స్వర్ణం సాధించాడు. తుగ్లకాబాద్‌లో జరిగిన 59వ జాతీయ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు. గగన్ నారంగ్, చైన్ సింగ్ వంటి ప్రసిద్ధ షూటర్‌లను సైతం అధిగమించాడు. తిరువనంతపురంలో జరిగిన 61వ జాతీయ ఛాంపియన్‌షిప్‌లో మరోసారి ఈ విజయాన్ని అందుకున్నాడు. 50 మీటర్ల రైఫిల్ 3-పొజిషన్ ఈవెంట్‌లో మరో స్వర్ణం సాధించాడు.
కైరోలో జరిగిన 2022 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వప్నిల్ 4వ స్థానంలో నిలిచాడు. భారతదేశానికి ఒలింపిక్ కోటా స్థానాన్ని సంపాదించాడు. పూణేలో జన్మించిన షూటర్ 2022 ఆసియా గేమ్స్‌లో టీమ్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించాడు. 2023 బాకులో జరిగిన ప్రపంచ కప్‌లో మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణం, వ్యక్తిగత, టీమ్ ఈవెంట్‌లలో రెండు రజత పతకాలతో పాటు స్వర్ణం సాధించాడు. కుసాలే 2022 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని సాధించాడు. 2021 న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ కప్‌లో టీమ్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించాడు. ఇప్పుడు ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ సాధించాడు.