Paris Olympics : సాధార‌ణ రైతు కుటుంబం నుంచి పారిస్ ఒలింపిక్స్ ఫైనల్ వ‌ర‌కు.. ఎవ‌రీ అక్ష‌దీప్ సింగ్?

First Published | Aug 1, 2024, 11:00 AM IST

Akshdeep Singh: పంజాబ్‌కు చెందిన ఒక‌ రైతు బిడ్డ అక్షదీప్ సింగ్. అనేక‌ కష్టాలను అధిగమించి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారతీయ రేస్‌వాకర్‌గా నిలిచాడు.
 

Akshdeep Singh

Paris,Olympics 2024-Akshdeep Singh : ఒక సాధార‌ణ రైతు కుటుంబం నుంచి పారిస్ ఒలింపిక్స్ వ‌ర‌కు కొనసాగిన ప్ర‌యాణంతో అంద‌రికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు భార‌త స్టార్ రేస్ వాక‌ర్ అక్ష‌దీప్ సింగ్. పంజాబ్‌కు చెందిన ఒక‌ రైతు బిడ్డ.. అనేక‌ కష్టాలను అధిగమించి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారతీయ రేస్‌వాకర్‌గా నిలిచాడు. భార‌త దేశ‌పు అత్యుత్త‌మ అథ్లెట్ల‌లో ఒక‌రిగా అనేక రికార్డులు సాధించాడు. అక్షదీప్ గురువారం పారిస్ ఒలింపిక్స్ రేస్ వాకింగ్ పైన‌ల్లో పాల్గొననున్నాడు. భార‌త్ కు మ‌రో మెడ‌ల్ ను అందించ‌డానికి ముందుకు సాగుతున్నాడు.

ఎవ‌రీ అక్ష‌దీప్ సింగ్? 

పంజాబ్‌లోని బర్నాలా జిల్లాలోని కహ్నేకే గ్రామానికి చెందిన రేస్‌వాకర్ అక్షదీప్ సింగ్ 2024 పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా నిలిచాడు. రైతు కుటుంబం నుంచి వ‌చ్చిన అక్ష‌దీప్ సింగ్ పట్టుదలకు నిద‌ర్శ‌నంగా నిలిచాడు. మొదట్లో ఇండియన్ ఆర్మీలో చేరాలని కలలు కన్న అతను తన గ్రామంలోని ఆర్మీ ఔత్సాహికుల స్ఫూర్తితో జాతీయ స్థాయి అథ్లెట్‌గా మారిపోయాడు. ఆర్థిక కష్టాలు, గాయాలతో సహా అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, అక్షదీప్ తన క్రీడ పట్ల అంకితభావంతో జాతీయ రికార్డులను నెలకొల్పడానికీ, అతని కథతో లెక్కలేనంత‌ మందిని ప్రేరేపించడానికి దారితీసింది.

మొద‌ట్లో అక్షదీప్ భారత సైన్యం ద్వారా తన దేశానికి సేవ చేయాలనే ఆలోచనకు ఆకర్షితుడయ్యాడు. "నాకు పదేళ్ల వయస్సు ఉన్నప్పుడు, రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా ఆర్మీలో చేరాలనేది నా కల" అని స్పోర్ట్‌స్టార్‌కి ఇచ్చిన ఒక‌ ఇంటర్వ్యూలో చెప్పాడు. తన గ్రామంలో శిక్షణ పొందిన యువ ఔత్సాహికులచే ప్రేరణ పొంది, అక్షదీప్ 15 సంవత్సరాల వయస్సులో సైనిక వృత్తి కోసం సిద్ధపడటం ప్రారంభించాడు. “ఆ సమయంలో, నేను వేగంగా పరిగెత్తేవాడిని. ఆర్మీలో శిక్షణ పొందుతున్న పెద్ద గ్రామ యువకులు కూడా దీనికి నన్ను ప్రశంసించారు. నేను అథ్లెట్‌గా మారాలని వారు సూచించారు”అని  చెప్పాడు. 

ఈ క్ర‌మంలోనే బర్నాలాలోని ఒక స్టేడియంలో కోచ్ జస్ప్రీత్ సింగ్‌ను కలుసుకోవడంతో అతని ప్రయాణం కీల‌క మలుపు తిరిగింది. రేస్‌వాకింగ్‌ని ఎంచుకోవాలని కోచ్ సూచించార‌నీ, అయితే, మొద‌ట్లో త‌న‌కు పరుగెత్తడానికి ఆసక్తిగా లేదు కానీ, ఆర్మీనే కాకుండా క్రీడ‌ల్లో రాణించి దేశానికి సేవ చేయాల‌నే త‌న సంక‌ల్పంతో ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిపారు. డిసెంబర్ 2016లో కోచ్ గురుదేవ్ సింగ్ వద్ద శిక్షణ పొందేందుకు అక్షదీప్ పాటియాలాకు మకాం మార్చాడు. అక్క‌డ క్రీడలో ప్రావీణ్యం సంపాదించడం ప్రారంభించాడు.

Latest Videos


Akshdeep Singh-Priyanka Goswami

అక్ష‌దీప్ కెరీర్ సాగిందిలా..

టార్న్ తరణ్‌లో జరిగిన అండర్-18 నార్త్ ఇండియా ఛాంపియన్‌షిప్‌లో అక్షదీప్ ప్రారంభ విజయం కాంస్య పతకంతో మొద‌లైంది. దీని తర్వాత అండర్-18 జూనియర్ నేషనల్స్, 2017లో ఆల్ ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో రజత పతకాలు సాధించాడు. ఒక సంవత్సరంలోనే అతను ఆల్ ఇండియా ఇంటర్-యూనివర్శిటీ గేమ్స్‌లో స్వర్ణం సాధించాడు. 2018లో U-20 10km నేషనల్స్‌లో కొత్త జాతీయ రికార్డును నెలకొల్పాడు. త‌న వయస్సు విభాగంలో ప్రపంచవ్యాప్తంగా ఆరవ ర్యాంక్ సాధించాడు.

అయితే, 2019లో మోకాలి గాయం ఇటలీలో జరిగే వరల్డ్ యూనివర్శిటీ గేమ్స్‌లో పాల్గొనకుండా అతని కలలు చెరిపేసింది. ఆ త‌ర్వాత గాయం నుంచి కోలుకుని  ఫిబ్రవరి 2020లో జరిగిన జాతీయ ఈవెంట్‌లో అతను 12వ స్థానాన్ని పొందాడు. కోవిడ్-19 మహమ్మారి అతని ప్రణాళికలను మరింతగా దెబ్బ‌కొంట్టింది. ఆర్థిక ప‌రిస్థితులు మ‌ళ్లీ త‌న కుటుంబ వ్య‌వ‌సాయ పొలంలో పని చేయడానికి బలవంతం చేశాయి. ఈ సమయంలో, అక్షదీప్ చాలా ఘోర‌మైన‌ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఎంత ప్రయత్నించినా భారత జట్టుకు ఎంపిక కాకపోవడంతో కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనాలనే అతని ఆకాంక్ష నీరుగారిపోయింది.

Akshdeep Singh

అయినా వెన‌క్కి త‌గ్గ‌కుండా తిరిగి పుంజుకోవాలని నిశ్చయించుకున్న అక్షదీప్ శిక్షణను తిరిగి ప్రారంభించడానికి 2021లో బెంగళూరుకు వెళ్లాడు. 1.19.55 సెకన్లతో 20 కి.మీ జాతీయ రికార్డును బద్దలు కొట్టి స్వర్ణ పతకంతో పాటు పారిస్ ఒలింపిక్స్‌లో స్థానం సంపాదించడంతో అతని పట్టుదల ఫలించింది. దీంతో పారిస్ ఒలింపిక్స్ 2024కి అర్హత సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా నిలిచాడు. 2023లో చండీగఢ్‌లో జరిగిన నేషనల్ ఓపెన్ రేస్ వాకింగ్ పోటీలో తన సమయాన్ని 1.19.38 సెకన్లకు మెరుగుపరుచుకున్నాడు. తన జాతీయ రికార్డును తానే బద్దలు కొట్టాడు. ఇప్పుడు సగర్వంగా భారత నౌకాదళంలో సేవలందిస్తున్న అక్షదీప్ తన భవిష్యత్తు లక్ష్యాలపై దృష్టి సారించాడు. పారిస్ ఒలింపిక్స్ లో భార‌త్ కు మెడ‌ల్ అందించాల‌నే టార్గెట్ తో ముందుకు సాగుతున్నాడు. 

click me!