Virat Kohli : రాంచీలో దక్షిణాఫ్రికాపై చారిత్రక సెంచరీ సాధించిన తర్వాత విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నాల్గవ స్థానానికి ఎగబాకారు. ఆయన కేవలం 32 రేటింగ్ పాయింట్ల దూరంలోనే అగ్రస్థానంలో ఉన్న రోహిత్ శర్మకు గట్టి పోటీ ఇస్తున్నారు.
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ లో విరాట్ కోహ్లీ జోరు కొనసాగుతోంది. అద్భుతమైన ఆటతో అదరగొడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌ను దుమ్మేరేపాడు. తాజా ర్యాంకింగ్స్‌లో భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ప్రదర్శనతో భారీగా ఎగబాకారు. రాంచీలో దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో సాధించిన చారిత్రక సెంచరీ కారణంగా ఈ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ దూసుకెళ్లాడు.
మొదటి వన్డేలో విరాట్ కోహ్లీ 120 బంతుల్లో 135 పరుగుల ఇన్నింగ్స్ ఆడి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ మ్యాచ్ అనంతరం విడుదలైన ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం, కోహ్లీ ప్రస్తుతం నాలుగవ స్థానానికి చేరుకున్నారు. దీంతో ఆయన మళ్లీ వన్డే ఫార్మాట్‌లో బ్యాటింగ్‌లో తన గత టాప్ స్థానాన్ని దక్కించుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు.
25
టాప్ ప్లేస్ కు 32 పాయింట్ల దూరంలో కోహ్లీ
తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం, విరాట్ కోహ్లీ రేటింగ్ పాయింట్లు 751కి పెరిగాయి. ఆయన ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ (783 పాయింట్లు) కంటే కేవలం 32 రేటింగ్ పాయింట్ల దూరంలో ఉన్నారు. దీంతో కోహ్లీ మరోసారి ప్రపంచ నంబర్ వన్ వన్డే బ్యాట్స్‌మెన్‌గా అవతరించే అవకాశాలు బలంగా ఉన్నాయి.
గతంలో, కోహ్లీ మూడు సంవత్సరాలకు పైగా వన్డే బ్యాటింగ్‌లో అగ్రస్థానంలో కొనసాగాడు. అయితే ఏప్రిల్ 2021లో పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజం ఆయనను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత చాలా కాలం పాటు టాప్-5లో స్థానం కోల్పోయిన కోహ్లీ, ఇప్పుడు మళ్లీ అగ్రస్థానం కోసం పోటీలోకి రావడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ తాజా ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ, కోహ్లీ మధ్య కేవలం ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే ఉన్నారు. న్యూజిలాండ్‌కు చెందిన డారిల్ మిచెల్ రెండో స్థానంలో ఉండగా, అఫ్ఘానిస్తాన్ యువ బ్యాట్స్‌మెన్ ఇబ్రహీం జద్రాన్ మూడవ స్థానంలో ఉన్నాడు.
35
శుభ్‌మన్ గిల్‌కు షాక్..
ఒకరికి లాభం వస్తే, మరొకరికి నష్టం తప్పదు అన్నట్టుగా, కోహ్లీ ర్యాంకింగ్ మెరుగుపడటంతో భారత ఆటగాడు శుభ్‌మన్ గిల్ కు దెబ్బతగిలింది. గాయం కారణంగా దక్షిణాఫ్రికా సిరీస్‌కు దూరంగా ఉన్న గిల్, తాజా ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం కోల్పోయి ఐదవ స్థానానికి పడిపోయారు. అయినప్పటికీ, టాప్-10 వన్డే బ్యాటర్లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు గిల్ కూడా కొనసాగడం భారత క్రికెట్‌కు శుభపరిణామం.
పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజం ఒకప్పుడు నంబర్-1 స్థానంలో ఉన్నప్పటికీ, తాజా ర్యాంకింగ్స్‌లో ఆయన ఆరవ స్థానంలోకి పడిపోయాడు. టాప్-10 బ్యాటర్ల జాబితాలో ఆరవ స్థానం నుంచి పదవ స్థానం వరకు ఎటువంటి మార్పులు లేవు.
భారత జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ, కోహ్లీ దూకుడుతో ఆయన నంబర్-1 స్థానానికి ప్రమాదం పొంచి ఉంది. దక్షిణాఫ్రికాపై మొదటి వన్డేలో రోహిత్ 57 పరుగుల మంచి ఇన్నింగ్స్ ఆడారు. ఆయన, కోహ్లీతో కలిసి 136 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పారు. అయినప్పటికీ, కోహ్లీ తాజా ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి అతి తక్కువ దూరంలో ఉండటంతో, రాబోయే మ్యాచుల ఫలితాలను బట్టి ర్యాంకింగ్స్‌లో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
55
బౌలర్ల విభాగంలో కుల్దీప్ యాదవ్‌కు జంప్
బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మార్పులతో పాటు, వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. టీమిండియా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్, తన నిలకడైన ప్రదర్శనతో వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం ఎగబాకి ఆరవ స్థానానికి చేరుకున్నారు. ఆయన నిలకడైన బౌలింగ్ టీమిండియాకు బలాన్ని అందిస్తోంది.
న్యూజిలాండ్‌కు చెందిన స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ ఒక స్థానం దిగజారి ఏడవ స్థానానికి చేరుకున్నారు. అఫ్ఘానిస్తాన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్ నంబర్-1 వన్డే బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్‌కు చెందిన జోఫ్రా ఆర్చర్ రెండవ స్థానంలో, దక్షిణాఫ్రికా ఆటగాడు కేశవ్ మహారాజ్ మూడవ స్థానంలో ఉన్నారు.