Virat Kohli : రికార్డుల సునామీ.. సచిన్, గంగూలీ, సంగక్కరలను దాటేసిన కోహ్లీ !

Published : Jan 11, 2026, 07:53 PM IST

Virat Kohli Fastest 28000 runs : విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 28 వేల పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా అధిగమించి సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. సంగక్కరను వెనక్కి నెట్టి రెండో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు.

PREV
16
సచిన్ ఆల్ టైమ్ రికార్డు బద్దలు.. విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర !

భారత స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరోసారి తన బ్యాట్‌తో గర్జించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన మైలురాళ్లను అధిగమిస్తూ చరిత్ర సృష్టించాడు. ఆదివారం (జనవరి 11) వడోదరలోని కోటంబి స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఘనత సాధించాడు.

ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగగానే పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్న కోహ్లీ, బ్యాటింగ్‌లోనూ దుమ్మురేపాడు. సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర, సౌరవ్ గంగూలీ వంటి దిగ్గజాల రికార్డులను ఒకే మ్యాచ్‌లో అధిగమించి, క్రికెట్ ప్రపంచంలో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు.

26
అత్యంత వేగంగా 28,000 పరుగులు చేసిన ప్లేయర్ ఎవరు?

అంతర్జాతీయ క్రికెట్‌లో 28,000 పరుగుల భారీ మైలురాయిని దాటిన ప్రపంచంలోనే మూడో ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. కోహ్లీ కంటే ముందు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర మాత్రమే ఈ ఘనతను సాధించారు.

అయితే, ఇక్కడ విశేషమేమిటంటే, సచిన్, సంగక్కర కంటే అతి తక్కువ ఇన్నింగ్స్‌లలోనే కోహ్లీ ఈ శిఖరాన్ని చేరుకున్నాడు. ఈ క్రమంలో లెజెండరీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ 28K రన్స్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 25 పరుగులు పూర్తి చేయగానే కోహ్లీ ఈ రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు.

36
సంగక్కర రికార్డును దాటేసిన కింగ్ కోహ్లీ

కేవలం 28 వేల పరుగుల మైలురాయిని చేరడమే కాకుండా, అత్యధిక పరుగులు చేసిన జాబితాలోనూ కోహ్లీ ముందుకు దూసుకెళ్లాడు. ఈ మ్యాచ్‌కు ముందు కోహ్లీ 28 వేల పరుగులకు 25 పరుగుల దూరంలో ఉండగా, కుమార సంగక్కర రికార్డును దాటడానికి 42 పరుగుల దూరంలో ఉన్నాడు.

ఇన్నింగ్స్ 13వ ఓవర్లో 28 వేల మార్కును దాటిన కోహ్లీ, 19వ ఓవర్లో సంగక్కరను వెనక్కి నెట్టాడు. శ్రీలంక దిగ్గజం సంగక్కర అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 28,016 పరుగులు చేశారు. ప్రస్తుతం కోహ్లీ ఆ సంఖ్యను దాటి, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా అవతరించాడు. ఇప్పుడు కోహ్లీ కంటే ముందు సచిన్ టెండూల్కర్ మాత్రమే ఉన్నారు.

46
గంగూలీని వెనక్కి నెట్టిన విరాట్ కోహ్లీ

మైదానంలోకి అడుగుపెట్టగానే కోహ్లీ మరో రికార్డును కూడా నెలకొల్పాడు. టీమిండియా తరఫున అత్యధిక వన్డే మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని అధిగమించాడు. ఇది విరాట్ కోహ్లీ కెరీర్‌లో 309వ వన్డే మ్యాచ్ కాగా, సౌరవ్ గంగూలీ భారత్ తరఫున 308 మ్యాచ్‌లు ఆడారు. ఈ జాబితాలో 463 మ్యాచ్‌లతో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

భారత్ తరఫున అత్యధిక వన్డేలు ఆడిన ఆటగాళ్లు

1. సచిన్ టెండూల్కర్ 463 మ్యాచ్‌లు

2. ఎంఎస్ ధోని 347

3. రాహుల్ ద్రావిడ్ 340

4. మహ్మద్ అజారుద్దీన్ 334

5. విరాట్ కోహ్లీ 309*

56
న్యూజిలాండ్ ఇన్నింగ్స్.. భారత్ ముందు 301 పరుగుల లక్ష్యం

మ్యాచ్ వివరాల్లోకి వెళితే, టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 300 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఆరంభంలో ఓపెనర్లు డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్ అద్భుతంగా రాణించారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 117 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

అయితే వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత కివీస్ ఇన్నింగ్స్ కాస్త తడబడింది. కానీ, స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్ తన అనుభవన్నంతా ఉపయోగించి 84 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో న్యూజిలాండ్ గౌరవప్రదమైన స్కోరును సాధించగలిగింది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిధ్ కృష్ణ తలో రెండు వికెట్లు పడగొట్టారు. కుల్దీప్ యాదవ్‌కు ఒక వికెట్ దక్కింది.

66
కోహ్లీ మెరుపు హాఫ్ సెంచరీ

301 పరుగుల లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 2026లోనూ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ కేవలం 44 బంతుల్లోనే అర్ధశతకాన్ని పూర్తి చేశాడు. ఇది వన్డేల్లో కోహ్లీకి 77వ హాఫ్ సెంచరీ. గ్లెన్ ఫిలిప్స్ వేసిన బంతిని డీప్ మిడ్-వికెట్ వైపు తరలించి సింగిల్ తీయడం ద్వారా కోహ్లీ ఈ మైలురాయిని చేరుకున్నాడు.

శుభ్‌మన్ గిల్ కుదురుకోవడానికి సమయం ఇస్తూనే, కోహ్లీ మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడాడు. కోహ్లీ బ్యాటింగ్ చూస్తుంటే వడోదర మైదానం మొత్తం హర్షధ్వానాలతో మార్మోగిపోయింది.

Read more Photos on
click me!

Recommended Stories