Tilak Varma : అయ్యో తిలక్.. ఎంత పని జరిగింది ! వరల్డ్ కప్ ముందు టీమిండియాకు బిగ్ షాక్

Published : Jan 09, 2026, 08:01 PM IST

Tilak Varma : టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మకు గాయం కారణంగా సర్జరీ జరిగింది. న్యూజిలాండ్ సిరీస్‌కు దూరమైన తిలక్.. టి20 వరల్డ్ కప్‌లో ఆడుతాడా లేదా అనే విషయంపై క్లారిటీ ఇచ్చాడు.

PREV
16
వరల్డ్ కప్ ముందు టీమిండియాకు భారీ షాక్.. ఆసుపత్రి పాలైన స్టార్ ప్లేయర్ !

టీ20 ప్రపంచ కప్ 2026 సీజన్ ఆరంభానికి ముందే టీమిండియా అభిమానులకు ఒక ఆందోళనకరమైన న్యూస్ వచ్చింది. భారత టీ20 జట్టులో మిస్టర్ కన్సిస్టెంట్ గా పేరు తెచ్చుకున్న యువ సంచలనం తిలక్ వర్మకు గాయం అయింది. గాయం కారణంగా అతడు న్యూజిలాండ్‌తో జరగబోయే కీలక సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రపంచ కప్‌కు సమయం దగ్గర పడుతుండటంతో, తిలక్ వర్మ మెగా టోర్నీకి అందుబాటులో ఉంటాడా లేదా అనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది.

26
అసలేం జరిగింది? తిలక్ వర్మకు అయిన గాయం ఏంటి?

హైదరాబాద్‌కు చెందిన ఎడమచేతి వాటం బ్యాటర్ తిలక్ వర్మ ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ జట్టు తరపున ఆడుతున్నప్పుడు అసౌకర్యానికి గురయ్యాడు. అతనికి పొత్తికడుపు కింది భాగంలో నొప్పి రావడంతో వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించారు.

స్కానింగ్ అనంతరం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వైద్యులు అతనికి శస్త్రచికిత్స చేయాలని సూచించారు. జనవరి 7వ తేదీన తిలక్ వర్మకు టెస్టిక్యులర్ టోర్షన్ ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం తిలక్ వర్మ వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నాడు.

ఈ గాయం కారణంగా జనవరి 21, 23, 25 తేదీల్లో న్యూజిలాండ్‌తో జరగాల్సిన మొదటి మూడు టీ20 మ్యాచ్‌లకు, అలాగే జనవరి 28, 31 తేదీల్లో జరిగే మిగిలిన మ్యాచ్‌లకు కూడా తిలక్ దూరంగా ఉండనున్నాడు.

36
వరల్డ్ కప్‌లో ఆడుతాడా? తిలక్ వర్మ క్లారిటీ

సర్జరీ తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తిలక్ వర్మ, తన ఆరోగ్య పరిస్థితిపై ఇన్‌స్టాగ్రామ్ లో స్పందించాడు. "మీ ప్రేమకు, సపోర్టుకు ధన్యవాదాలు. నేను కోలుకుంటున్నాను. మీరు అనుకున్నదాని కంటే త్వరగానే మైదానంలోకి అడుగుపెడతాను" అని పోస్ట్ చేసి అభిమానులకు ఊరటనిచ్చాడు.

మరోవైపు తిలక్ వర్మ చిన్ననాటి కోచ్ డీబీ రవితేజ్ కూడా ఒక మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు. "ఇది సాధారణ గాయమే, అంత సీరియస్ సమస్య కాదు. తిలక్ వర్మ టీ20 ప్రపంచ కప్ మిస్ అయ్యే ప్రసక్తే లేదు. మరో ఏడు నుంచి పది రోజుల్లోనే అతను తిరిగి ప్రాక్టీస్ మొదలుపెడతాడు" అని స్పష్టం చేశారు.

46
టీమిండియాకు తిలక్ ఎందుకు అంత కీలకం?

2024 ప్రపంచ కప్ తర్వాత భారత టీ20 జట్టులో తిలక్ వర్మ కీలక సభ్యుడిగా ఎదిగాడు. 3 లేదా 4వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ టీమ్ స్కోరును స్థిరీకరించడంలో అతను సిద్ధహస్తుడు. గత ఏడాది అభిషేక్ శర్మ తర్వాత భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు తిలకే. అతను 18 ఇన్నింగ్స్‌లలో 47.25 సగటుతో, 129.15 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 567 పరుగులు సాధించాడు.

కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కోల్పోయిన సమయాల్లో కూడా తిలక్ జట్టును ఆదుకున్నాడు. ఆసియా కప్, ఆస్ట్రేలియా పర్యటన, దక్షిణాఫ్రికా సిరీస్‌లలో అతను నిలకడగా రాణించాడు. ముఖ్యంగా ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై ఆడిన ఇన్నింగ్స్ అతని విలువను తెలియజేస్తుంది. మ్యాచ్‌ను తన వైపు తిప్పుకునే సత్తా ఉన్న ఇటువంటి ఆటగాడు దూరమవడం జట్టుకు లోటే.

56
తిలక్ వర్మ కు ప్రత్యామ్నాయం ఎవరు? ఇషాన్ కిషన్ రేసులోకి..

ప్రపంచ కప్‌లో భారత్ గ్రూప్-ఏలో ఉంది. ఫిబ్రవరి 7న అమెరికా, 12న నమీబియా, 15న పాకిస్థాన్, 18న నెదర్లాండ్స్‌తో తలపడాల్సి ఉంది. ఒకవేళ తిలక్ వర్మ ఫిట్‌నెస్ సాధించలేకపోతే, అతని స్థానంలో తుది జట్టులోకి రావడానికి ఇషాన్ కిషన్ సిద్ధంగా ఉన్నాడు. తిలక్ లాగే ఇషాన్ కూడా ఎడమచేతి వాటం బ్యాటర్ కావడం అతనికి కలిసొచ్చే అంశం.

ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ తరపున ఆడిన ఇషాన్ కిషన్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. 10 మ్యాచ్‌లలో 517 పరుగులు చేసి జట్టుకు టైటిల్ అందించాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటకపై కేవలం 39 బంతుల్లోనే 125 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ఈ ప్రదర్శనతో అతను తిరిగి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు.

66
శ్రేయస్ అయ్యర్ పేరు కూడా పరిశీలనలో..

తిలక్‌కు మరో ప్రత్యామ్నాయంగా శ్రేయస్ అయ్యర్ పేరు కూడా వినిపిస్తోంది. గాయం నుంచి కోలుకున్న శ్రేయస్, విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరపున హిమాచల్ ప్రదేశ్‌పై 82, పంజాబ్‌పై 45 పరుగులతో రాణించాడు. అయితే, 2023 డిసెంబర్ తర్వాత శ్రేయస్ టీ20 ఫార్మాట్‌లో భారత్ తరపున ఆడలేదు.

దీంతో తిలక్ లేకపోతే మొదటి ప్రాధాన్యం ఇషాన్ కిషన్‌కే దక్కే అవకాశం ఉంది. బీసీసీఐ జనవరి 31 వరకు ఐసీసీ అనుమతి లేకుండా జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది కాబట్టి, అప్పటి వరకు తిలక్ కోలుకుంటాడని మేనేజ్మెంట్ భావిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories