Sanju Samson: టీ20 ప్రపంచకప్ 2026 హీరో సంజు శాంసన్ కేరళ వ్యాపారి నితిన్ బాబును కలిశారు. శాంసన్ ప్రదర్శనకు ఫిదా అయి తన 82 మంది ఉద్యోగులకు బోనస్ ప్రకటించిన నితిన్‌ను సంజూ స్వయంగా కలిసి అభినందించారు.
సంజూ శాంసన్ మెరుపులకు ఫిదా అయి ఉద్యోగులకు కాసుల వర్షం
టీ20 ప్రపంచకప్ 2026లో అద్భుత ప్రదర్శనతో భారత్‌కు టైటిల్ అందించిన స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తన క్రీడా స్ఫూర్తితోనే కాకుండా తన వ్యక్తిత్వంతోనూ అభిమానుల మనసు గెలుచుకుంటున్నారు. తన ఆటపై ఉన్న ప్రేమతో తన ఉద్యోగులకు ప్రత్యేక బోనస్‌లు ప్రకటించిన కేరళకు చెందిన వ్యాపారి నితిన్ బాబును సంజూ స్వయంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.
మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి టీమిండియా ప్రపంచకప్‌ను గెలవడంలో సంజూ శాంసన్ కీలక పాత్ర పోషించారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని నితిన్ బాబు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
24
సంజూ సూపర్ నాక్.. నితిన్ బాబు బోనస్
కొట్టాయం జిల్లా పాంపాడిలోని 'ఫియా గార్మెంట్స్' యజమాని నితిన్ బాబు, సంజూకు వీరాభిమాని. ప్రపంచకప్ నాకౌట్ దశలో సంజూ ఆడిన ఇన్నింగ్స్‌లు చూసి ఫిదా అయిన నితిన్, తన సంస్థలోని 82 మంది ఉద్యోగులకు భారీగా బోనస్ ప్రకటించారు. సూపర్ 8లో వెస్టిండీస్‌పై సంజూ 97* పరుగులు చేసినప్పుడు రూ. 500, సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై 89 పరుగులు చేసినప్పుడు రూ. 1000, ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 89 పరుగులు చేసినప్పుడు రూ. 2000 చొప్పున ప్రతి ఉద్యోగికి అందించారు. ఇలా మొత్తం రూ. 2.77 లక్షలను ఆయన పంపిణీ చేసి సంజు విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.
వ్యాపారి ఇంటికి సంజూ సర్ప్రైజ్ విజిట్
తన కోసం ఒక వ్యాపారి ఇంతటి గొప్ప నిర్ణయం తీసుకున్నారని తెలుసుకున్న సంజూ శాంసన్.. నితిన్ బాబును నేరుగా కలవాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలోనే పాంపాడిలోని నితిన్ నివాసానికి ఆకస్మికంగా వెళ్లారు. సంజూను చూసిన నితిన్ కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి, ఆనందానికి గురయ్యారు. అక్కడ వారితో కలిసి భోజనం చేసిన సంజూ, ఇంటి పెరట్లో నితిన్ కుటుంబంతో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. నితిన్ చేసిన ఈ వినూత్నమైన మర్యాదను, గౌరవాన్ని సంజూ మనస్ఫూర్తిగా అభినందించారు.
34
నా ప్రజల ప్రేమే నా బలం: సంజూ భావోద్వేగం
ఈ విజిట్ కు సంబంధించిన వీడియోను సంజూ శాంసన్ తన ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగపూరితమైన సందేశాన్ని రాశారు. "నా ప్రజలు, నా కమ్యూనిటీ ఇచ్చే ఈ ప్రేమ, దీవెనలకు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. ఆట కంటే కూడా ఈ ప్రేమే నాకు ఎంతో గొప్పది" అని సంజూ పేర్కొన్నారు. తన విజయాన్ని సామాన్య ప్రజలు కూడా తమ సొంత విజయంగా భావించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
టీ20 ప్రపంచకప్ 2026లో సంజూ టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచారు. మొత్తం 321 పరుగులు చేసిన ఆయన, 80.25 సగటుతో, 199.37 అద్భుత స్ట్రైక్ రేట్‌తో రాణించారు. మూడు కీలక హాఫ్ సెంచరీలు చేసిన సంజూ.. నాకౌట్ మ్యాచ్‌ల్లో అజేయమైన ఆటతీరుతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కూడా గెలుచుకున్నారు. సంజూ నిలకడైన ఆట భారత్ కప్ గెలవడంలో కీలకంగా నిలిచింది.
వరల్డ్ కప్ తర్వాత సంజూ ఇప్పుడు ఐపీఎల్ 2026 కోసం సిద్ధమవుతున్నారు. రాజస్థాన్ రాయల్స్ నుంచి ఏకంగా రూ. 18 కోట్ల భారీ డీల్‌తో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) సంజును ట్రేడ్ చేసుకుంది. మార్చి 19న చెన్నైలోని చేపాక్ స్టేడియంలో సంజూ తన మొదటి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. ఐదు సీజన్ల పాటు రాజస్థాన్‌ను నడిపించిన అనుభవం ఉన్న సంజూ, సిఎస్కేలో కీలక పాత్ర పోషించనున్నారు. ఐపీఎల్ చరిత్రలో 177 మ్యాచ్‌ల్లో 4704 పరుగులు చేసిన సంజూ, ఈసారి ఎంఎస్ ధోనీ జట్టులో ఎలా రాణిస్తారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.