Suryakumar Yadav : కాన్‌బెర్రాలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో 24 బంతుల్లో 39 పరుగులతో సూర్యకుమార్ యాదవ్ నాటౌట్ గా నిలిచాడు. ఈ క్రమంలోనే అతను అంతర్జాతీయ టీ20లో 150 సిక్సుల మైలురాయి అందుకున్నాడు.
టీ20 క్రికెట్ లో 150 సిక్సర్లు బాదిన సూర్యకుమార్ యాదవ్
భారత్, ఆస్ట్రేలియా మధ్య కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరో సూపర్ రికార్డు నెలకొల్పాడు. గత కొన్నేళ్లుగా టీ20 ఫార్మాట్‌లో అద్భుత ఫామ్ లో ఉన్న సూర్యకుమార్, ఈ మ్యాచ్‌లో మరోసారి తన బ్యాట్ సత్తా ఏంటో చూపించాడు. 24 బంతుల్లో 39 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన సూర్య.. తన ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, రెండు సిక్సులు బాదాడు. దీంతో అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో 150 సిక్సర్లను పూర్తి చేశాడు.
భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ తర్వాత అంతర్జాతీయ టీ20ల్లో 150 సిక్సులు కొట్టిన రెండో భారత బ్యాట్స్‌మన్‌గా సూర్యకుమార్ నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ మైలురాయిని చేరుకున్న మొత్తం ఐదుగురిలో ఇప్పుడు సూర్యకుమార్ కూడా ఒకరు.
25
టాప్‌లో రోహిత్ శర్మ
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సులు కొట్టిన జాబితాలో రోహిత్ శర్మ 205 సిక్సులతో మొదటి స్థానంలో ఉన్నారు. రోహిత్ తర్వాత యూఏఈకి చెందిన మొహమ్మద్ వసీమ్ 187 సిక్సులు, న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ గప్తిల్ 173 సిక్సులు, ఇంగ్లాండ్‌కు చెందిన జోస్ బట్లర్ 172 సిక్సులతో ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలో సూర్యకుమార్ కూడా చేరడంతో ప్రపంచవ్యాప్తంగా అతని స్థాయి మరింత పెరిగింది.
35
మ్యాచ్ ను ముంచేసిన వర్షం
కాగా, ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగింది భారత్. వర్షం కారణంగా మ్యాచ్‌ను పలు మార్లు ఆపాల్సి వచ్చింది. మొదటిసారి ఐదు ఓవర్ల తర్వాత ఆగిన మ్యాచ్‌ను 18 ఓవర్లకు తగ్గించి పునఃప్రారంభించారు. భారత్ 9.4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 97 పరుగులు చేసినప్పుడు వర్షం మళ్లీ అడ్డుపడింది. వర్షం తగ్గకుండా పడటంతో మ్యాచ్ ను రద్దుచేశారు.
ఓపెనర్ అభిషేక్ శర్మ 14 బంతుల్లో 19 పరుగుల నాక్ లో నాలుగు బౌండరీలు బాదాడు. నాథన్ ఎలిస్ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అతను ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్, శుభ్‌మన్ గిల్‌తో కలసి వేగంగా పరుగులు రాబట్టారు. ఇద్దరూ కలిసి 35 బంతుల్లో 62 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. గిల్ 20 బంతుల్లో 37 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
55
అత్యంత వేగంగా 150 సిక్సులతో సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘతన
అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో అత్యంత వేగంగా 150 సిక్సులు సాధించిన రెండో బ్యాటర్ గా సూర్యకుమార్ రికార్డు సాధించారు. అతను కేవలం 86 ఇన్నింగ్స్ లు, 1649 బంతుల్లో 150 సిక్సుల మైలురాయిని దాటాడు. అతని కంటే ముందు 66 ఇన్నింగ్స్, 1543 బంతుల్లో మొహమ్మద్ వసీమ్ ఈ రికార్డును సాధించాడు.
అంతేకాక, సూర్యకుమార్ ఇప్పటివరకు 91 T20I మ్యాచ్‌ల్లో 2650కి పైగా పరుగులు చేశారు. ఆయన స్ట్రైక్‌రేట్ 165 దాటింది. నాలుగు సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు సాధించాడు. నాలుగు వివిధ దేశాల్లో సెంచరీ చేసిన ఏకైక T20I బ్యాట్స్‌మన్ కూడా ఆయనే.