Cricket Records : క్రికెట్ చరిత్రలో ఏకైక మొనగాడు.. ఒకే మ్యాచ్ లో సెంచరీ హ్యాట్రిక్ !

Published : Jan 09, 2026, 09:55 PM ISTUpdated : Jan 09, 2026, 09:57 PM IST

Cricket Records : ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఒకే టెస్టు మ్యాచ్‌లో సెంచరీ, బౌలింగ్‌లో హ్యాట్రిక్ సాధించిన ఏకైక ఆటగాడిగా బంగ్లాదేశ్ క్రికెటర్ సోహగ్ గాజీ నిలిచాడు. ఈ అద్భుత రికార్డుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
14
వావ్.. బ్యాటింగ్‌లో సెంచరీ, బౌలింగ్‌లో హ్యాట్రిక్.. ఒకే మ్యాచ్‌లో అద్భుతం!

క్రికెట్ లో ఎప్పుడు ఏ రికార్డు బద్దలవుతుందో, కొత్తగా ఏ రికార్డు కొత్తగా వచ్చి చేరుతుందో చెప్పడం కష్టం. కొన్ని అసాధారణమైన రికార్డులు కూడా నమోదయ్యాయి. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎంతో మంది దిగ్గజ ఆటగాళ్లు అనేక రికార్డులు నెలకొల్పారు. అయితే, ప్రపంచంలో కేవలం ఒక్క క్రికెటర్ మాత్రమే సాధించిన ఒక అరుదైన రికార్డు మిమ్మల్ని ఔరా అనిపించేలా చేస్తుంది. అదే ఒకే టెస్ట్ మ్యాచ్‌లో బ్యాటర్‌గా సెంచరీ సాధించడం, బౌలర్‌గా హ్యాట్రిక్ తీయడం. ఈ అద్భుతమైన ఫీట్ సాధించిన ఆ ఏకైక క్రికెటర్ మరెవరో కాదు, బంగ్లాదేశ్ మాజీ ఆల్ రౌండర్ సోహగ్ గాజీ.

24
బౌలింగ్‌లో హ్యాట్రిక్, బ్యాటింగ్‌లో సెంచరీ కొట్టిన బంగ్లా స్టార్

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు చెందిన స్టార్ ప్లేయర్ సోహగ్ గాజీ, ఒకే టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ బాదడమే కాకుండా, అదే మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన ప్రపంచంలోని ఏకైక క్రికెటర్‌గా చరిత్ర సృష్టించారు. 2013లో న్యూజిలాండ్‌తో జరిగిన చిట్టగాంగ్ టెస్టులో సోహగ్ గాజీ ఈ ప్రపంచ రికార్డును నెలకొల్పారు.

ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో అదరగొట్టిన గాజీ, అజేయంగా 101 పరుగులు (నాటౌట్) సాధించారు. ఆయన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లోనూ తన సత్తా చాటారు. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ బ్యాటర్లు కోరీ ఎండర్సన్, బిజే వాట్లింగ్, డగ్ బ్రేస్‌వెల్‌లను వరుస బంతుల్లో అవుట్ చేసి హ్యాట్రిక్ పూర్తి చేశారు. బ్యాట్‌తోనూ, బాల్‌తోనూ ఒకే మ్యాచ్‌లో ఇలాంటి ప్రదర్శన చేయడం అనేది క్రికెట్ చరిత్రలో అత్యంత అరుదైన విషయం.

34
బౌలింగ్ యాక్షన్ పై నిషేధంతో ముగిసిన కెరీర్

సోహగ్ గాజీ ఇంతటి అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ, ఆ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు విజయం సాధించలేకపోయింది. ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే, దురదృష్టవశాత్తు సోహగ్ గాజీ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ఎక్కువ కాలం కొనసాగలేదు. 2014లో అతని బౌలింగ్ యాక్షన్ సందేహాస్పదంగా ఉందని తేలడంతో ఐసీసీ (ICC) అతనిపై నిషేధం విధించింది.

దీంతో అతని కెరీర్ అర్ధాంతరంగా ముగిసే పరిస్థితి వచ్చింది. సోహగ్ గాజీ తన అంతర్జాతీయ కెరీర్‌లో బంగ్లాదేశ్ తరపున మొత్తం 10 టెస్టులు, 20 వన్డేలు, 10 టీ20 మ్యాచ్‌లు ఆడారు. జూలై 2015లో బంగ్లాదేశ్ తరపున ఆయన తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. బౌలింగ్ యాక్షన్ సమస్యల కారణంగా ఒక ప్రతిభావంతుడైన ఆటగాడి కెరీర్ త్వరగా ముగిసిపోయింది.

44
తొలి మ్యాచ్‌లోనే సంచలనం.. సోహగ్ గాజీ రికార్డులు

సోహగ్ గాజీ బంగ్లాదేశ్ క్రికెట్‌లో ఒక వెలుగు వెలిగిన ఆటగాడు. ఆయన 2012లో వెస్టిండీస్‌పై మీర్పూర్‌లో జరిగిన మ్యాచ్‌తో టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. ఆశ్చర్యకరంగా, తన తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే గాజీ 9 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించారు.

తన చిన్న కెరీర్‌లో సోహగ్ గాజీ గణాంకాలు గమనిస్తే..

• టెస్ట్ క్రికెట్: 10 మ్యాచ్‌ల్లో 38 వికెట్లు తీశారు. బ్యాటింగ్‌లో 325 పరుగులు సాధించారు.

• వన్డే క్రికెట్: 20 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు పడగొట్టారు. 184 పరుగులు చేశారు.

• టీ20 ఇంటర్నేషనల్: 10 మ్యాచ్‌ల్లో 4 వికెట్లు తీసి, 57 పరుగులు చేశారు.

కెరీర్ చిన్నదే అయినా, ఒకే టెస్టులో సెంచరీ, హ్యాట్రిక్ సాధించిన ఆటగాడిగా సోహగ్ గాజీ పేరు క్రికెట్ చరిత్ర పుటల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది.

Read more Photos on
click me!

Recommended Stories