Shubman Gill : టీ20 ప్రపంచకప్ విజయోత్సవ ఫోటోలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ సంజూ శాంసన్ కనిపించకపోవడంపై శుభ్‌మన్ గిల్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను నెటిజన్లు టార్గెట్ చేస్తున్నారు. ఫోటో ఎడిట్ చేశారంటూ వస్తున్న ఆరోపణల వెనుక అసలు నిజం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
మార్చి 8, 2026న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరులో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. న్యూజిలాండ్‌ను 96 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి భారత్ మూడోసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఈ అద్భుత విజయం తర్వాత ఆటగాళ్ల సంబరాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హోరెత్తుతున్నాయి. అయితే, ఇదే సమయంలో ఒక ఫోటో సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి కేంద్రబిందువుగా మారింది.
టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్, వన్డే, టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టీ20 ప్రపంచకప్ జట్టులో భాగం కానప్పటికీ, భారత జట్టు విజయాన్ని అభినందిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఫోటోను షేర్ చేశారు. ఛాంపియన్స్ అనే క్యాప్షన్‌తో గిల్ పోస్ట్ చేసిన ఈ ఫోటోలో కొంతమంది ఆటగాళ్లు ట్రోఫీతో కనిపిస్తున్నారు. అయితే, ఆ ఫోటోలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ కనిపించకపోవడం అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది. సంజూను గిల్ కావాలనే ఎడిట్ చేసి ఫోటో నుండి తొలగించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి.
35
గిల్ ఫస్ట్ క్లాస్ ఎడిటర్ అంటూ ట్రోల్స్
సంజూ శామ్సన్ ఈ టోర్నమెంట్‌లో 5 ఇన్నింగ్స్‌ల్లో 321 పరుగులు చేసి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచారు. అటువంటి కీలక ఆటగాడు ఫోటోలో లేకపోవడంతో అభిమానులు గిల్‌ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక యూజర్ "సంజూ శామ్సన్‌ను తొలగించడానికి మీరు ఏ యాప్ ఉపయోగించారు? చాలా నీట్‌గా చేశారు" అని ప్రశ్నించగా, మరొకరు "ఫస్ట్ క్లాస్ క్రికెటర్ ❌ ఫస్ట్ క్లాస్ ఎడిటర్ ✅" అంటూ ఎద్దేవా చేశారు. టోర్నమెంట్ అంతటా అద్భుతంగా ఆడిన ఆటగాడికి ఇచ్చే గౌరవం ఇదేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఈ వివాదం ఐపీఎల్ అభిమానుల వార్‌కు కూడా దారితీసింది. గుజరాత్ టైటాన్స్ అభిమానులు గిల్‌కు సపోర్టుగా నిలుస్తుండగా, రాజస్థాన్ రాయల్స్, సీఎస్‌కే అభిమానులు సంజూకు అండగా నిలుస్తున్నారు. యశస్వి జైస్వాల్, రవిచంద్రన్ అశ్విన్ కూడా ఇదే ఫోటోను షేర్ చేసిన విషయాన్ని గిల్ అభిమానులు గుర్తు చేస్తున్నారు. అశ్విన్ తన పోస్ట్‌లో సంజూ ప్రతిభను కొనియాడగా, జైస్వాల్ మాత్రం కేవలం సూర్యకుమార్ యాదవ్, గౌతమ్ గంభీర్‌లను మాత్రమే ట్యాగ్ చేశారు. సంజూను కావాలనే పక్కన పెట్టారనే వాదన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
55
నిజంగానే ఫోటో ఎడిట్ చేశారా? అసలు నిజం ఇదీ!
ఈ వివాదంపై ఫ్యాక్ట్ చెక్ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నట్టుగా గిల్ ఫోటోను ఎడిట్ చేయలేదు. వైరల్ అవుతున్న రెండు ఫోటోలను నిశితంగా గమనిస్తే అవి వేర్వేరు సమయాల్లో తీసినవని స్పష్టమవుతుంది. ఒక ఫోటోలో ట్రోఫీ సూర్యకుమార్ యాదవ్ చేతిలో ఉండగా, గిల్ షేర్ చేసిన ఫోటోలో ట్రోఫీ తిలక్ వర్మ చేతిలో ఉంది. అలాగే కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మల పొజిషన్లు కూడా రెండు ఫోటోల్లో వేరుగా ఉన్నాయి. అంటే అవి ఒకే సమయంలో తీసిన ఫోటోలు కావు. కాబట్టి, సంజూ శాంసన్ ను ఎవరో ఎడిట్ చేసి తొలగించారనే వార్తల్లో వాస్తవం లేదు. గ్రూప్ ఫోటోలు తీసుకునేటప్పుడు ఆటగాళ్లు కదులుతూ ఉండటం వల్ల ఒక ఫోటోలో ఉన్నవారు మరొక ఫోటోలో కనిపించకపోవడం సహజం.