IND vs SA : గిల్ రెడీనా? భారత జట్టులోకి ముగ్గురు స్టార్ల రీఎంట్రీ

Published : Dec 07, 2025, 04:38 PM IST

IND vs SA T20 : దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌తో శుభ్‌మన్ గిల్ భారత జట్టు ప్లేయింగ్ 11 ఉంటారా? లేదా? అనేది క్లారిటీ లేదు. అయితే, తాను పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని కోచ్ గంభీర్ చెప్పారు. సూర్యకుమార్ కెప్టెన్సీలో భారత్ టీ20 సిరీస్ కు సిద్ధంగా ఉంది.

PREV
15
శుభ్‌మన్ గిల్ తిరిగి ఫిట్: కోచ్ గంభీర్

దక్షిణాఫ్రికాతో భారత జట్టు మంగళవారం (డిసెంబర్ 9) నుంచి టీ20 సిరీస్ ఆడనుంది. భారత యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తిరిగి జట్టులోకి రానున్నాడు. గిల్ జట్టులోకి రావడంపై భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టత ఇచ్చారు. శుభ్‌మన్ గిల్ ఫిట్‌గా, బాగా ఉన్నాడని, ఆడేందుకు ఆసక్తిగా ఉన్నాడని గంభీర్ పేర్కొన్నాడు.

గత నెలలో కోల్‌కతా టెస్ట్ మ్యాచ్ సందర్భంగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గిల్‌కు మెడ నొప్పి రావడంతో వన్డే సిరీస్ కు దూరం అయ్యాడు. ఆ గాయం నుంచి కోలుకోవడానికి అతను బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు వెళ్లారు. శిక్షణను తిరిగి ప్రారంభించడానికి ముందు ఐదు వారాల విశ్రాంతి తీసుకోవాలని బీసీసీఐ మొదట నిర్ణయించింది.

దక్షిణాఫ్రికాపై వన్డేల్లో 2-1 తేడాతో విజయం సాధించిన అనంతరం గంభీర్ మీడియాతో మాట్లాడారు. "అవును, శుభ్‌మన్ ఆడటానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే అతన్ని ఎంపిక చేశారు. అతను ఫిట్‌గా, బాగా ఉన్నాడు, ఆడటానికి ఆత్రుతగా ఉన్నాడు" అని అన్నారు.

25
టీ20లలో గిల్ కొత్త ఆరంభం

గిల్ లేకపోవడంతో, గువహతిలో జరిగిన రెండవ టెస్ట్‌లో రిషభ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆ మ్యాచ్‌లో భారత్ పరుగుల పరంగా తమ అతిపెద్ద టెస్ట్ ఓటమిని చవిచూసింది. ఆ తర్వాత జరిగిన వన్డే సిరీస్‌లో గిల్ స్థానంలో యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేశారు. విశాఖలో జరిగిన నిర్ణయాత్మక వన్డేలో యశస్వి తన తొలి వన్డే సెంచరీతో భారత్‌ను గెలిపించాడు.

ఇప్పుడు, శుభ్‌మన్ గిల్ టీ20లలో తిరిగి టాప్ ఆర్డర్‌కు రానున్నారు. అభిషేక్ శర్మతో కలిసి మళ్ళీ ఓపెనింగ్ చేయనున్నాడు. ఈ ఐదు టీ20 మ్యాచ్‌ల్లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా, గిల్ అతని డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. గాయం కారణంగా రెండు నెలలకు పైగా ఆటకు దూరమైన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా భారత జట్టులోకి తిరిగి రావడం జట్టుకు మరింత బలాన్ని చేకూర్చింది.

35
ఇండియా సౌతాఫ్రికా టీ20 సిరీస్ షెడ్యూల్

దక్షిణాఫ్రికాతో ఐదు టీ20 మ్యాచ్‌లు డిసెంబర్ 9, 11, 14, 17, 19 తేదీల్లో వరుసగా కటక్, న్యూ చండీగఢ్, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్‌లలో జరుగుతాయి. టెస్ట్ సిరీస్‌లో ఓడి, వన్డే సిరీస్‌ను గెలిచిన తరువాత, టీమిండియా ఇప్పుడు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ప్రొటీస్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది.

కటక్‌లోని బారాబతి స్టేడియం మంగళవారం (డిసెంబర్ 9) తొలి టీ20కి ఆతిథ్యం ఇవ్వనుంది. తదుపరి నాలుగు మ్యాచ్‌లు ముల్లన్‌పూర్ (డిసెంబర్ 11), ధర్మశాల (డిసెంబర్ 14), లక్నో (డిసెంబర్ 17), అహ్మదాబాద్ (డిసెంబర్ 19)లలో షెడ్యూల్ చేశారు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా, శుభ్‌మన్ గిల్ వైస్-కెప్టెన్‌గా ఈ సిరీస్‌లో భారత్‌కు నాయకత్వం వహిస్తారు. 

ఐడెన్ మార్క్రామ్ నాయకత్వంలో దక్షిణాఫ్రికా జట్టు ఈ ఫార్మాట్ ను ఆడనుంది. సూర్యకుమార్ భారత కెప్టెన్‌గా ఒక్క టీ20I సిరీస్‌ను కూడా కోల్పోలేదు. దీంతో ఈ దక్షిణాఫ్రికా పై కూడా అదే జొరును కొనసాగించాలని చూస్తోంది.

45
భారత జట్టులోకి కీలక ఆటగాళ్ల రీఎంట్రీ

గాయం కారణంగా సెప్టెంబర్ 26 నుంచి ఆటకు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా తిరిగి వచ్చాడు. వన్డే సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న 32 ఏళ్ల అహ్మదాబాద్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా జట్టులోకి తిరిగి వచ్చాడు. పొట్టి ఫార్మాట్ సిరీస్‌లో బుమ్రా పేస్ అటాక్‌ను నడిపించనున్నారు.

బుమ్రా, పాండ్యాతో పాటు, శివమ్ దూబే, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, జితేష్ శర్మ, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి కూడా తిరిగి భారత జట్టులోకి వచ్చారు. ఈ జట్టులో చాలా మంది టీ20 స్పెషలిస్ట్‌లు ఉన్నారు. గత నెలలో టెస్ట్ సిరీస్‌లో ఆడిన వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్‌లతో సహా తిలక్ వర్మ, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్ కూడా టీ20 జట్టులో తమ స్థానాన్ని నిలబెట్టుకున్నారు.

55
భారత టీ20 స్క్వాడ్ లో కీలక మార్పులు

బీసీసీఐ డిసెంబర్ 3న టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యులతో భారత జట్టును ప్రకటించింది. వన్డే జట్టు నుండి కేవలం ఐదుగురు ఆటగాళ్లను మాత్రమే టీ20 సిరీస్‌కు ఎంపిక చేశారు. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌ను 2-1తో గెలిచిన కేఎల్ రాహుల్ టీ20 సిరీస్‌కు ఎంపిక కాలేదు. రాహుల్ చివరిసారిగా నవంబర్ 10, 2022న టీ20 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ తరపున టీ20 మ్యాచ్ ఆడాడు.

రాహుల్‌తో పాటు, డిసెంబర్ 6న మూడవ వన్డేలో అజేయ సెంచరీ (116) సాధించిన యశస్వి జైస్వాల్, ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి, నం. 4 బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్, పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ, వికెట్ కీపర్లు రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్‌లకు కూడా ఈ జట్టులో స్థానం దక్కలేదు. మరోవైపు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా త్రయం జూన్ 2024లో 20-ఓవర్ల ఫార్మాట్ నుండి రిటైర్ అయ్యారు.

దక్షిణాఫ్రికా సిరీస్‌కు భారత్ టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి,అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్ లు ఉన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories