IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు

Published : Dec 06, 2025, 09:32 PM IST

IND vs SA : విశాఖపట్నంలో జరిగిన మూడో వన్డేలో యశస్వి జైస్వాల్ (116*) సెంచరీ, బౌలర్ల విజృంభణతో భారత్ 9 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను ఓడించింది. 2-1తో సిరీస్ గెలుచుకుంది.

PREV
14
విశాఖ వన్డేలో భారత్ గెలుపు

భారత్ సౌతాఫ్రికాను చిత్తు చేసింది. మూడో వన్డేలో బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించి విజయాన్ని అందుకుంది. విశాఖపట్నంలోని ACA-VDCA స్టేడియం శనివారం జరిగిన మూడో వన్డేలో భారత జట్టు సౌతాఫ్రికా జట్టుపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుతమైన తొలి వన్డే సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నిర్ణయాత్మక విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. టెస్టు సిరీస్ పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది.

24
సిరీస్ కైవసం చేసుకున్న భారత్

ఈ మ్యాచ్‌లో భారత్ మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ల రాణించడంతో సౌతాఫ్రికా జట్టు 47.5 ఓవర్లలో 270 పరుగులకే ఆలౌట్ అయింది. 271 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడి, కేవలం 39.5 ఓవర్లలోనే 271/1 స్కోరుతో విజయాన్ని అందుకున్నారు.

భారత్ జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ ఛేజింగ్‌ను మరో 61 బంతులు (10.1 ఓవర్లు) మిగిలి ఉండగానే పూర్తి చేయడం భారత ఆధిపత్యాన్ని స్పష్టం చేసింది.

34
యశస్వి జైస్వాల్ సెంచరీ

భారత ఇన్నింగ్స్‌కు యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ వెన్నెముకగా నిలిచాడు. జైస్వాల్ 121 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 116 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తన తొలి వన్డే సెంచరీని పూర్తి చేసుకున్న అతను, ఛేజింగ్‌ను అత్యంత ఓర్పుతో, నైపుణ్యంతో పూర్తి చేశాడు. ఈ సెంచరీతో టెస్ట్, వన్డే, టీ20ఐ... మూడు ఫార్మాట్‌లలో సెంచరీలు సాధించిన ఆరవ భారత బ్యాట్స్‌మెన్‌గా జైస్వాల్‌ రికార్డు సృష్టించాడు.

రోహిత్ శర్మ కూడా తనదైన శైలిలో మంచి నాక్ ఆడాడు. 73 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 75 పరుగులు సాధించాడు. జైస్వాల్‌తో కలిసి రోహిత్ తొలి వికెట్‌కు 155 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రోహిత్ శర్మను సౌత్ ఆఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ అవుట్ చేశాడు.

తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడు. కోహ్లీ కేవలం 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 65 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించాడు. ఈ సిరీస్‌లో కోహ్లీకి ఇది వరుసగా మూడవ వన్డే అర్ధ సెంచరీ కావడం విశేషం.

44
బౌలింగ్ లోనూ అదరగొట్టిన భారత్

భారత బౌలింగ్ లో కూడా రాణించింది. ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ అద్భుతమైన ప్రదర్శన చేశారు. ఈ పేస్, స్పిన్ జోడి చెరో నాలుగు వికెట్లు పడగొట్టింది. కుల్దీప్ యాదవ్ 10 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు (4/41). ప్రసిద్ధ్ కృష్ణ 9.5 ఓవర్లలో 66 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు (4/66). వీరిద్దరి విజృంభణతో సౌత్ ఆఫ్రికా జట్టు మిడిల్, లాస్ట్ ఓవర్లలో తడబడింది.

క్వింటన్ డి కాక్ సౌతాఫ్రికా తరఫున సెంచరీ సాధించాడు. డి కాక్ 89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 106 పరుగులు చేశాడు. కెప్టెన్ టెంబా బావుమా 48 పరుగులు చేశాడు. అయితే, ఇతర బ్యాట్స్‌మెన్ల నుంచి సహకారం లేకపోవడం, వరుస వికెట్లు పడటంతో సౌతాఫ్రికా జట్టు 270 పరుగులకే పరిమితమైంది.

Read more Photos on
click me!

Recommended Stories