Shivam Dube : టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్ చరిత్రాత్మక విజయం సాధించిన తర్వాత, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే అహ్మదాబాద్ నుండి ముంబైకి రైలులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
Shivam Dube travels in Train : కోట్ల రూపాయల కాంట్రాక్టులు.. బౌండరీల అవతల పడే సిక్సర్లు.. గెలిచింది సాదాసీదా కప్పు కాదు, ఏకంగా టి20 వరల్డ్ కప్. స్టేడియంలో లక్ష మంది 'దూబే.. దూబే' అని అరుస్తుంటే, ఆకాశమే హద్దుగా సంబరాలు చేసుకున్న ఈ టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, మరుసటి రోజే అందరినీ ఆశ్చర్యపరిచారు.
సెలబ్రిటీ హోదా, చార్టర్డ్ ఫ్లైట్స్, లగ్జరీ కార్లు.. ఇవేవీ ఆయన కళ్ళకు కనిపించలేదు. తన కళ్ళ ముందు కనిపించింది కేవలం తన ఇద్దరు చిన్న పిల్లలే. వాళ్లను త్వరగా చేరుకోవాలనే ఆత్రుతతో, విమానం టిక్కెట్లు దొరకకపోయినా వెనకడుగు వేయలేదు. ఒక సామాన్య మధ్యతరగతి ప్రయాణికుడిలా ఏసీ 3-టైర్ రైలు ఎక్కి, అప్పర్ బెర్త్‌పై దుప్పటి కప్పుకుని ప్రయాణించిన దూబే తీరు చూస్తుంటే.. ఆయనలోని అసలైన సింప్లిసిటీకి నిదర్శనం. ఆ అండర్ కవర్ జర్నీ విశేషాలు గమనిస్తే..
26
విమానాలు లేక.. రైలు ప్రయాణం
మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో లక్ష మందికి పైగా ప్రేక్షకుల మధ్య ‘దూబే.. దూబే’ అనే నినాదాలు మార్మోగాయి. టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై కేవలం 8 బంతుల్లో 26 పరుగులు చేసి, భారత్ స్కోరును 250 దాటించిన శివమ్ దూబే, ఆ మరుసటి రోజే ఒక సామాన్య ప్రయాణికుడిలా మారాల్సి వచ్చింది. ప్రపంచ విజేతగా నిలిచిన కొన్ని గంటలకే ఆయన ముంబై చేరుకోవడానికి రైలు మార్గాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు ఇది వైరల్ గా మారింది.
విశ్వవిజేతగా నిలిచిన తర్వాత సాధారణంగా క్రికెటర్లు చార్టర్డ్ ఫ్లైట్స్ లేదా బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తారు. కానీ, అహ్మదాబాద్ నుండి ముంబైకి వెళ్లే విమానాలన్నీ ఫుల్ అయిపోయాయి. తన భార్య అంజూమ్, ఒక స్నేహితుడితో కలిసి ఇంటికి వెళ్లాలనుకున్న దూబేకు వేరే దారి లేకపోయింది. రోడ్డు మార్గంలో వెళ్లడం కంటే రైలు వేగంగా ఉంటుందని భావించి, అహ్మదాబాద్-ముంబై సయాజీ ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ 3-టైర్ టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. తన ఇద్దరు చిన్న పిల్లలు అయాన్ (4), మెహవిష్ (2)లను చూడాలనే ఆత్రుతతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
36
అప్పర్ బెర్త్‌పై దూబే అండర్ కవర్ ఆపరేషన్
ప్రజలు గుర్తిస్తే రద్దీ పెరిగి ఇబ్బంది అవుతుందని భావించిన దూబే, ఒక పక్కా ప్లాన్ వేశారు. ముఖానికి మాస్క్, తలపై టోపీ, ఫుల్ స్లీవ్ టీ-షర్ట్ ధరించి గుర్తుపట్టకుండా జాగ్రత్త పడ్డారు. తెల్లవారుజామున 5:10 గంటలకు రైలు కావడంతో ప్లాట్‌ఫారమ్‌పై రద్దీ తక్కువగా ఉంటుందని ఆశించారు. రైలు కదిలే 5 నిమిషాల ముందు వరకు కారులోనే వేచి ఉండి, చివరి నిమిషంలో లోపలికి వెళ్లారు. రైలు ఎక్కిన వెంటనే తన అప్పర్ బెర్త్ పైకి ఎక్కి, రైల్వే వారు ఇచ్చే బ్రౌన్ కలర్ దుప్పటిని కప్పుకుని పడుకున్నారు.
ఈ ప్రయాణంలో ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది. టిక్కెట్ చెక్ చేయడానికి వచ్చిన టీటీఈ, చార్టులో పేరు చూసి "శివమ్ దూబే? ఇతను ఆ క్రికెటరేనా?" అని అడిగారు. వెంటనే దూబే భార్య అంజూమ్ స్పందిస్తూ.. "కాదు కాదు.. ఆయన ఇక్కడికి ఎందుకు వస్తారు?" అని చాకచక్యంగా సమాధానం చెప్పారు. దీంతో ఆ టీటీఈ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ప్రయాణం మధ్యలో ఒకసారి వాష్‌రూమ్‌కు వెళ్లినా, ఎవరూ గుర్తుపట్టకపోవడంతో దూబే ఊపిరి పీల్చుకున్నారు.
56
బోరివలిలో పోలీస్ ఎస్కార్ట్
మధ్యాహ్నం ముంబైలోని బోరివలి స్టేషన్ చేరుకునే సమయానికి వెలుతురు ఎక్కువగా ఉండటంతో, జనం గుర్తుపడతారని దూబే భయం పడ్డారు. దీంతో ఆయన పోలీసుల సహాయం కోరారు. వరల్డ్ కప్ హీరో రైలులో వస్తున్నాడని తెలిసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. విమానాశ్రయం నుంచి వస్తున్నారేమో అనుకున్న వారికి, రైలులో వస్తున్నట్లు చెప్పడంతో షాక్ తిన్నారు. చివరకు పోలీస్ రక్షణతో ఆయన సురక్షితంగా స్టేషన్ నుండి బయటకు వచ్చి తన ఇంటికి చేరుకున్నారు.
66
వరల్డ్ కప్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్
ఈ టోర్నీలో శివమ్ దూబే అద్భుతమైన ఆటతో అదరగొట్టారు. కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తూ 9 మ్యాచ్‌ల్లో 235 పరుగులు చేశారు. ఆయన స్ట్రైక్ రేట్ 169.06గా ఉండటం గమనార్హం. 17 సిక్సర్లు, 15 ఫోర్లతో చెలరేగిన దూబే, తన తండ్రి రాజేష్ దూబేకు మెడల్ వేసి ‘నా జీవితంలో నిజమైన హీరో’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తన తండ్రి పడ్డ కష్టమే తనను ఈ స్థాయికి చేర్చిందని ఆయన చెప్పుకొచ్చారు.