
క్రికెట్ ప్రపంచంలో ఎవరూ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ సిస్టర్ ఫ్రాంచైజీ అయిన 'సన్‌రైజర్స్ లీడ్స్', పాకిస్థాన్ లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను భారీ ధర వెచ్చించి సొంతం చేసుకుంది. గురువారం లండన్‌లోని పిక్కాడెల్లీ లైట్స్‌లో జరిగిన ది హండ్రెడ్ 2026 వేలంలో ఈ ఆసక్తికర ఒప్పందం కుదిరింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఒక భారతీయ ఐపీఎల్ యాజమాన్యానికి చెందిన జట్టు, పాకిస్థాన్ ఆటగాడిని కొనుగోలు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.
లండన్ లో జరిగిన ఈ వేలంలో సన్‌రైజర్స్ సీఈఓ కావ్యా మారన్ స్వయంగా పాల్గొన్నారు. ఆమెతో పాటు జట్టు ప్రధాన కోచ్ డేనియల్ వెట్టోరీ కూడా వేలం టేబుల్ వద్ద ఉన్నారు. టైర్-2 స్పిన్నర్ల విభాగంలో అబ్రార్ అహ్మద్ పేరు రాగానే సన్‌రైజర్స్ లీడ్స్ ఆసక్తి చూపించింది. ట్రెంట్ రాకెట్స్ జట్టుతో పోటాపోటీగా సాగిన బిడ్డింగ్ వార్ తర్వాత, కావ్యా మారన్ జట్టు £190,000 (సుమారు రూ. 2.34 కోట్లు) వెచ్చించి అబ్రార్‌ను దక్కించుకుంది. 25 ఏళ్ల ఈ యంగ్ స్పిన్నర్ ఇప్పుడు ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడు.
2008 ముంబై దాడుల తర్వాత, ఐపీఎల్ సహా భారతీయుల యాజమాన్యంలో ఉన్న సౌతాఫ్రికా (SA20), యూఏఈ (ILT20) లీగ్స్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లపై అప్రకటిత నిషేధం కొనసాగుతోంది. ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఇంగ్లాండ్‌లోని 'ది హండ్రెడ్' లీగ్‌లో వాటాలు కొనుగోలు చేసినప్పుడు కూడా పాక్ ఆటగాళ్లను దూరం పెడతారని అంతా భావించారు. అయితే, ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) వివక్షకు తావులేకుండా అందరికీ సమాన అవకాశం కల్పించాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అబ్రార్‌ను కొనుగోలు చేయడం ద్వారా కావ్యా మారన్ పాత ఆనవాయితీని బ్రేక్ చేసి సరికొత్త చర్చకు దారితీశారు.
అబ్రార్ అహ్మద్ తొలుత టెస్ట్ స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందినప్పటికీ, గత రెండేళ్లలో టీ20 ఫార్మాట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. 2022లో అరంగేట్రం చేసిన ఈ లెగ్ స్పిన్నర్, పాకిస్థాన్ తరపున 46 టెస్టులు, 28 వన్డేలు, 52 టీ20 వికెట్లు తీశారు. ముఖ్యంగా 2024 నుండి 38 మ్యాచ్‌ల్లో 17.36 సగటుతో 52 వికెట్లు పడగొట్టారు. అతని ఎకానమీ రేటు 6.67గా ఉండటం గమనార్హం. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2026లో కూడా పాక్ జట్టులో సభ్యుడిగా ఉండి 4 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు తీశారు. అబ్రార్ గతంలో పీఎస్ఎల్, బీపీఎల్, మేజర్ లీగ్ క్రికెట్ (MLC)లో ఆడారు. ఇప్పుడు తొలిసారి యూరప్ లీగ్‌లో మెరవనున్నారు.
సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు పూర్తిగా భారతీయ మీడియా దిగ్గజం సన్ గ్రూప్ యాజమాన్యంలో ఉంది. దీనిని కళానిధి మారన్, ఆయన కుమార్తె కావ్యా మారన్ లీడ్ చేస్తున్నారు. గతంలో 'నార్తర్న్ సూపర్ ఛార్జర్స్'గా ఉన్న ఈ జట్టును ఈ ఏడాదే సన్ గ్రూప్ కొనుగోలు చేసి పేరు మార్చింది. ఈ వేలంలో అబ్రార్‌తో పాటు ఉస్మాన్ తారిక్ అనే మరో పాక్ స్పిన్నర్‌ను బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ జట్టు రూ. 1.72 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే హారిస్ రవూఫ్, షాదాబ్ ఖాన్ వంటి టాప్ పాక్ ఆటగాళ్లను ఎవరూ కొనుగోలు చేయకపోవడం గమనార్హం.
కావ్యా మారన్ నిర్ణయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం అబ్రార్ అహ్మద్ పాత వీడియో ఒకటి వైరల్ కావడమే. గతంలో ఫకర్ జమాన్, సైమ్ అయూబ్‌లతో కలిసి చేసిన ఒక వీడియోలో అబ్రార్ టీ తాగడం గురించి వ్యాఖ్యానించారు. ఇది 2019 భారత్-పాక్ సరిహద్దు ఉద్రిక్తతల సమయంలో అభినందన్ వర్ధమాన్‌ను ఉద్దేశించి చేసిన ఎగతాళిగా భారతీయులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో "భారతదేశాన్ని అవమానించిన వ్యక్తికి కావ్యా మారన్ కోట్లు ఎలా ఇస్తారు?" అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ఒప్పందం అమలవ్వాలంటే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) నుండి ఎన్ఓసీ (NOC) రావడం తప్పనిసరి.