Sarfaraz Khan : 16 సిక్సర్లు, 14 ఫోర్లు, 217 రన్స్.. సర్ఫరాజ్ ఖాన్ విధ్వంసంతో రోహిత్ రికార్డు బద్దలు !

Published : Dec 31, 2025, 06:18 PM IST

Sarfaraz Khan : విజయ్ హజారే ట్రోఫీ 2025లో సర్ఫరాజ్ ఖాన్ 75 బంతుల్లో 157 పరుగులతో విధ్వంసం రేపాడు. తుపాను నాక్ తో ముంబైకి భారీ విజయాన్ని అందించాడు. 56 బంతుల్లోనే సెంచరీ చేసి రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టాడు.

PREV
16
గోవాపై గర్జించిన ఖాన్ బ్రదర్స్: సర్ఫరాజ్, ముషీర్ విధ్వంసకర ఇన్నింగ్స్.

"ఓటమిని అంగీకరించను, పోరాటం ఆపను"... భారత క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ మైదానంలోకి దిగినప్పుడల్లా ఇదే మనస్తత్వంతో కనిపిస్తాడు. టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి, వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే 2025 ఏడాదికి సర్ఫరాజ్ ఖాన్ అద్భుతమైన రీతిలో వీడ్కోలు పలికాడు. బుధవారం జైపూర్ లో గోవాతో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ బ్యాట్ తో దుమ్మురేపాడు. కేవలం 75 బంతుల్లోనే 157 పరుగులు చేసి రికార్డుల మోత మోగించాడు.

26
రోహిత్ శర్మ రికార్డు బద్దలు

జైపూర్‌లోని జైపురియా విద్యాలయ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. కేవలం 56 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్న సర్ఫరాజ్, టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టాడు. కొన్ని రోజుల క్రితమే సిక్కింపై రోహిత్ శర్మ 62 బంతుల్లో సెంచరీ సాధించి, లిస్ట్-A క్రికెట్‌లో ముంబై తరఫున వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు.

అయితే, సర్ఫరాజ్ ఇప్పుడు 56 బంతుల్లోనే సెంచరీ బాది ఆ రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు. సెంచరీ తర్వాత సర్ఫరాజ్ మరింత ప్రమాదకరంగా మారాడు. తర్వాతి 19 బంతుల్లో ఏకంగా 57 పరుగులు పిండుకున్నాడు. మొత్తం 75 బంతుల్లో 14 భారీ సిక్సర్లు, 9 ఫోర్లతో 157 పరుగులు సాధించాడు. అతని స్ట్రైక్ రేట్ ఏకంగా 209.33గా నమోదైంది.

36
ఖాన్ బ్రదర్స్ జోరు: 217 పరుగులు, 16 సిక్సర్లు

ఈ మ్యాచ్‌లో కేవలం సర్ఫరాజ్ మాత్రమే కాదు, అతని సోదరుడు ముషీర్ ఖాన్ కూడా సత్తా చాటాడు. మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ముషీర్ 66 బంతుల్లో 60 పరుగులు చేశారు. వీరిద్దరూ కలిసి గోవా బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. అన్నదమ్ములిద్దరూ కలిపి ఈ మ్యాచ్‌లో 217 పరుగులు చేశారు. వీరి ఇన్నింగ్స్‌లో మొత్తం 16 సిక్సర్లు, 14 ఫోర్లు ఉండటం విశేషం.

ముంబై ఓపెనర్ యశస్వి జైస్వాల్ 46 పరుగులు చేయగా, హార్దిక్ తమన్ 53 పరుగులు చేశారు. వీరి సహకారంతో ముంబై నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 444 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. గోవా బౌలర్లు ఏ దశలోనూ ముంబై బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు.

46
పోరాడి ఓడిన గోవా

445 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గోవా జట్టు గట్టిగానే పోరాడింది. అభినవ్ తేజ్రానా, స్నేహల్ కౌతాంకర్, కెప్టెన్ గాంకర్ దూకుడుగా ఆడారు. ముఖ్యంగా అభినవ్ తేజ్రానా 69 బంతుల్లో సెంచరీ సాధించి ముంబై బౌలర్లను పరీక్షించాడు. కెప్టెన్ గాంకర్ కూడా కేవలం 28 బంతుల్లో 70 పరుగులు చేసి మ్యాచ్‌లో ఉత్కంఠ రేపారు.

అయితే, ముంబై బౌలర్ శార్దూల్ ఠాకూర్ కీలక సమయాల్లో వికెట్లు తీసి గోవాను దెబ్బకొట్టాడు. శార్దూల్ మూడు వికెట్లు పడగొట్టగా, ముషీర్ ఖాన్, తుషార్ దేశ్‌పాండే తలో చేయి వేశారు. చివరకు గోవా జట్టు 50 ఓవర్లలో 357 పరుగులకు పరిమితమైంది. దీంతో ముంబై 87 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

56
ఐపీఎల్ 2026లో చెన్నై తరఫున సర్ఫరాజ్ ఖాన్ మెరుపులు

వైట్ బాల్ క్రికెట్‌లో సర్ఫరాజ్ ఖాన్ పని అయిపోయిందన్న విమర్శలకు తన బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ 7 మ్యాచ్‌ల్లో 329 పరుగులు చేసి సత్తా చాటాడు. ఈ ప్రదర్శన కారణంగానే ఐపీఎల్ 2026 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అతన్ని రూ. 75 లక్షలకు కొనుగోలు చేసింది.

స్పిన్‌ను ధీటుగా ఎదుర్కోవడం, భారీ షాట్లు ఆడటంలో సర్ఫరాజ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. రూ. 75 లక్షలకు సర్ఫరాజ్ లాంటి హిట్టర్ దొరకడం చెన్నైకి కలిసొచ్చే అంశమని, ఇది నిజంగా స్టీల్ డీల్ అని రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్ క్రికెటర్లు సైతం అభిప్రాయపడ్డారు.

66
టీమిండియా తలుపు తడుతున్న సర్ఫరాజ్

గతంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అరంగేట్రం చేసి అర్ధసెంచరీలతో ఆకట్టుకున్న సర్ఫరాజ్, న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లోనూ ఒక సెంచరీ సాధించాడు. అయితే, నిలకడలేమి కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు. కానీ, దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తూ మళ్లీ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, విజయ్ హజారే ట్రోఫీలో తన విశ్వరూపాన్ని ప్రదర్శించడం ద్వారా టీమిండియాలో పునరాగమనానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories