
భారత జట్టు వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆస్ట్రేలియా పర్యటనలో తన చెత్త ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఆదివారం (నవంబర్ 2న) హోబార్ట్‌లో జరిగిన ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్‌లో మూడో మ్యాచ్‌లో కూడా అతను తక్కువ స్కోరు వద్ద అవుట్ అయ్యాడు.
ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి 186/6 స్కోరు సాధించింది. టిమ్ డేవిడ్ 74, మార్కస్ స్టోయినిస్ 64 పరుగులతో మెరిశారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు తీయగా, వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు తీశాడు. ఛేజింగ్ లో వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన నాక్ తో భారత్ 5 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది.
భారత ఇన్నింగ్స్‌లో గిల్ 15 పరుగులు చేసి ఔటయ్యాడు. నాథన్ ఎల్లిస్ వేసిన యార్కర్ గిల్ ఫ్రంట్ ప్యాడ్‌పై తాకడంతో అంపైర్ ఎల్బీడబ్ల్యూ ఇచ్చాడు. గిల్ రివ్యూ తీసుకున్నప్పటికీ, బాల్ ట్రాకింగ్ సమీక్ష తర్వాత అవుట్ ఇచ్చారు. గిల్ ఔటైన వెంటనే కెమెరా సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ వైపు జూమ్ అయింది. ఆమె రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమానులు ట్విట్టర్ (X)లో ఆ క్లిప్‌ను తెగ షేర్ చేస్తున్నారు. వీరి కామెంట్స్ కూడా మళ్లీ కొత్త చర్చను రేపుతున్నాయి. కాగా, కొంత కాలంగా వీరు లవ్ లో ఉన్నారనే రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే, దీనిపై అధికారికంగా ఏలాంటి ప్రకటన రాలేదు.
రెండో T20 తరువాత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ గిల్‌పై తీవ్ర విమర్శలు చేశారు. “శుభ్‌మన్ గిల్ సంజూ శాంసన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. సంజూ ఇప్పటికే మూడు టీ20 సెంచరీలు చేశాడు. కానీ గిల్ మాత్రం ఆ అవకాశాన్ని వినియోగించుకోవడం లేదు. చివరి పది ఇన్నింగ్స్‌ల్లో 200 పరుగులకూడా చేయలేకపోయాడు. అతని పై ఒత్తిడి పెరుగుతోంది” అని పఠాన్ అన్నాడు.
ఈ మ్యాచ్ లో శుభ్ మన్ గిల్ మళ్లీ ఫెయిల్ అయ్యాడు. అయినప్పటికీ గిల్ ను జట్టులోకి తీసుకోవడం పై అభిమానులు బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో గౌతమ్ గంభీర్, సూర్యకుమార్ యాదవ్‌లను టార్గెట్ చేస్తున్నారు. సంజూ శాంసన్ ను తప్పించి గిల్‌కు అవకాశం ఇవ్వడాన్ని “మెరిట్ కాదు, ఫేవరిటిజం” అని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అలాగే, యశస్వి జైస్వాల్‌ను కూడా ఎంపిక చేయలేదని, ఇది అన్యాయం అని అభిమానులు ట్వీట్ చేస్తున్నారు.
శుభ్‌మన్ గిల్ గత 10 T20 ఇన్నింగ్స్‌లో కేవలం 184 పరుగులు మాత్రమే సాధించాడు. ఆ స్కోర్లు గమనిస్తే.. 20(9), 10(7), 5(8), 47(28), 29(19), 4(3), 12(10), 37*(20), 5(10), 15(12).
భారత్ తరపున గిల్ వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్నప్పటికీ, అతడి ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు సారా టెండూల్కర్ రియాక్షన్, అభిమానుల ఆగ్రహం, ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యలు.. ఇవన్నీ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే, గిల్ ఫామ్‌పై ప్రశ్నలు మరింత తీవ్రంగా ఉన్నప్పటికీ ఇంకా జట్టులో కొనసాగించడంతో సెలక్షన్ తీరు కూడా చర్చనీయాంశంగా మారింది.
భారత జట్టు ఈ మ్యాచ్‌లో మూడు మార్పులు చేసింది. అర్ష్‌దీప్ సింగ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్‌లను తిరిగి జట్టులోకి తీసుకుంది. ఆస్ట్రేలియాను మొదట బ్యాటింగ్‌కు పంపిన భారత్ ప్రారంభంలో వికెట్లు సాధించింది. కానీ టిమ్ డేవిడ్, మార్కస్ స్టోయినిస్ కౌంటర్ అటాక్ చేశారు. డేవిడ్ 74 పరుగులు, స్టోయినిస్ 64 పరుగులతో భారత్ బౌలర్లను ఎదుర్కొన్నారు. చివర్లో వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్ బాగానే బౌలింగ్ చేసినప్పటికీ, ఆస్ట్రేలియా 186 పరుగులు చేసింది.
187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఔటైన తర్వాత సూర్యకుమార్ యాదవ్ 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ (49 పరుగులు, 23 బంతుల్లో) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. అతడి అద్భుత బ్యాటింగ్‌తో భారత్ 5 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. ఈ గెలుపుతో సిరీస్ 1-1తో సమమైంది.