భయ్యా.. సంజూ కొడితే ఎలా ఉంటుందో చూశారా ! ఇంగ్లాండ్ బౌలర్లకు పట్టిన సంజూ గ్రహణం

Published : Mar 05, 2026, 09:34 PM IST

India vs England Semi Final : టీ20 ప్రపంచ కప్ 2026 సెమీఫైనల్‌లో సంజూ శాంసన్ విధ్వంసం సృష్టించాడు. 42 బంతుల్లో 89 పరుగులు చేసి, భారత్ 253 పరుగుల భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

PREV
16
వాంఖడేలో సంజూ అరాచకం.. 7 భారీ సిక్సర్లతో ఇంగ్లాండ్ కోటను బద్దలు కొట్టిన కేరళ స్టార్

ముంబై వాంఖడే స్టేడియంaలో సంజూ శాంసన్ శివతాండవం చేశాడు.. టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్ బౌలర్లను తన బ్యాట్‌తో చెడుగుడు ఆడుకున్నాడు. కేవలం 42 బంతుల్లోనే 89 పరుగులు రాబట్టి, ఇంగ్లీష్ జట్టును కోలుకోలేని దెబ్బ తీశాడు. ఇంగ్లాండ్ చేసిన చిన్న పొరపాటును పెట్టుబడిగా మార్చుకుని, 7 భారీ సిక్సర్లతో స్టేడియం టాప్ లేపేశాడు. భయ్యా.. సంజూ శాంసన్ కొడితే ఎలా ఉంటుందో ఈ రోజు ఇంగ్లాండ్‌కు బాగా అర్థమైంది.

టీ20 ప్రపంచ కప్ 2026 రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై సంజూ శాంసన్ ఆడిన ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోతుంది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంజూ, ఆరంభం నుంచే ఇంగ్లాండ్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. కేవలం 42 బంతుల్లో 89 పరుగులు సాధించి, భారత్ 253 పరుగుల రికార్డు స్కోరు సాధించడానికి గట్టి పునాది వేశాడు.

26
అవకాశాన్ని అందిపుచ్చుకున్న సంజూ

ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ ఇన్నింగ్స్ ఒక మలుపుతో మొదలైంది. ఇన్నింగ్స్ 2.2 ఓవర్ వద్ద జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో సంజూ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ జారవిడిచాడు. అప్పుడు సంజూ స్కోరు కేవలం 15 పరుగులు మాత్రమే. ఆ అవకాశాన్ని సంజూ వదులుకోలేదు. ఆ తర్వాత ప్రతి ఓవర్‌లోనూ బౌండరీల వర్షం కురిపిస్తూ ఇంగ్లాండ్‌ను దంచికొట్టాడు.

36
సిక్సర్ల వేట.. ఫాస్టెస్ట్ ఫిఫ్టీ

సంజూ తన ఇన్నింగ్స్‌లో మొత్తం 7 భారీ సిక్సర్లు, 8 ఫోర్లు బాదాడు. లియామ్ డాసన్ బౌలింగ్‌లో అద్భుతమైన ఇన్ సైడ్ అవుట్ షాట్‌తో సిక్సర్ కొట్టి తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ సాధించిన సంజూ, తన మార్క్ షాట్లతో వాంఖడే ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్ స్లో బాల్స్ ను ముందుగానే పసిగట్టి డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్లు బాదడం హైలైట్‌గా నిలిచింది.

46
ఆర్చర్ బౌలింగ్‌లో అరాచకం

ఇంగ్లాండ్ ప్రధాన బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ను సంజూ శాంసన్ టార్గెట్ చేశాడు. ఆర్చర్ వేసిన మొదటి ఓవర్‌లోనే ఒక సిక్సర్, ఒక ఫోర్ బాది సంజూ తన ఉద్దేశాన్ని చాటాడు. 12.5 ఓవర్ వద్ద ఆర్చర్ వేసిన లెగ్ కట్టర్‌ను థంపింగ్ షాట్‌తో లాంగ్ ఆఫ్ మీదుగా సిక్సర్ బాదిన తీరు అద్భుతం. ఆర్చర్ వేసిన మరో షార్ట్ వైడ్ బాల్‌ను అప్పర్ కట్ చేసి సిక్సర్‌గా మార్చిన సంజూ, ఆ ఓవర్‌లో ఏకంగా 15 పరుగులు రాబట్టాడు.

56
తృటిలో చేజారిన సంజూ శాంసన్ సెంచరీ

సెంచరీ దిశగా దూసుకుపోతున్న సంజూ శాంసన్, 14వ ఓవర్ మొదటి బంతికి అవుట్ అయ్యాడు. విల్ జాక్స్ వేసిన బంతిని కవర్స్ మీదుగా ఆడే క్రమంలో డీప్ కవర్లో ఉన్న ఫిల్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కేవలం 11 పరుగుల దూరంలో సెంచరీ మిస్ అయినప్పటికీ, సంజూ అవుట్ అయి వెళ్తున్నప్పుడు స్టేడియం అంతా లేచి నిలబడి చప్పట్లతో అతనికి వీడ్కోలు పలికింది.

66
రికార్డుల వీరుడు సంజూ

టీ20 ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యధిక స్కోరు చేసిన భారత బ్యాటర్లలో సంజూ ఒకరిగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో అతను 89 పరుగులు చేయగా, గతంలో విరాట్ కోహ్లీ 2016లో వెస్టిండీస్‌పై 89* పరుగులు చేశాడు. శాంసన్ విధ్వంసం వల్లే భారత్ 8.3 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును చేరుకుంది, ఇది టీ20 వరల్డ్ కప్ నాకౌట్ చరిత్రలో రెండో వేగవంతమైన స్కోరు. సంజూ అందించిన ఈ మెరుపు ఆరంభమే భారత్‌ను 253 పరుగుల భారీ స్కోరు వద్ద నిలబెట్టింది.

Read more Photos on
click me!

Recommended Stories