Sanju Samson: 2026 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఇచ్చిన లైఫ్ లైన్‌ను అందిపుచ్చుకుని, కేవలం 26 బంతుల్లోనే మెరుపు హాఫ్ సెంచరీ బాది భారత్‌కు భారీ స్కోరు అందించే దిశగా నడిపించాడు.
వాంఖడేలో సంజూ సునామీ.. ఇంగ్లాండ్‌పై వీరవిహారం.. వరుసగా రెండో హాఫ్ సెంచరీ
ముంబైలోని వాంఖడే స్టేడియం గురువారం ఒక అద్భుతమైన ఇన్నింగ్స్‌కు సాక్ష్యంగా నిలిచింది. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 రెండో సెమీఫైనల్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా, భారత ఓపెనర్ సంజూ శాంసన్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వెస్టిండీస్‌పై గత మ్యాచ్‌లో 97 పరుగులు చేసిన సంజూ, అదే ఊపుతో ఈ కీలక మ్యాచ్‌లోనూ వరుసగా రెండో అర్ధశతకాన్ని నమోదు చేశాడు.
26
తొలగని తడబాటు.. నిలబడ్డ సంజూ
భారత ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ (9) విల్ జాక్స్ బౌలింగ్‌లో త్వరగానే పెవిలియన్ చేరాడు. అయితే, మరో ఎండ్‌లో ఉన్న సంజూ శాంసన్ ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన మొదటి ఓవర్‌లోనే ఒక ఫోర్, ఒక సిక్సర్‌తో తన ఉద్దేశాన్ని చాటాడు. అభిషేక్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్‌తో కలిసి సంజూ ఇంగ్లాండ్ బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు.
36
హ్యారీ బ్రూక్ చేసిన భారీ తప్పిదం
ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ ఇన్నింగ్స్‌కు ఒక కీలక మలుపు లభించింది. ఇన్నింగ్స్ మూడవ ఓవర్లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో సంజూ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను మిడ్-ఆఫ్ వద్ద ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ వదిలేశాడు. అప్పటికి సంజూ కేవలం 15 పరుగుల వద్దే ఉన్నాడు. ఈ లైఫ్ లైన్‌ను శాంసన్ అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడు. క్యాచ్ డ్రాప్ అయిన తర్వాతి బంతుల్లోనే ఆర్చర్‌ను ఒక సిక్స్, ఒక ఫోర్‌తో శిక్షించి ఇంగ్లాండ్‌కు తన విలువేంటో చూపించాడు.
వాంఖడే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుండటంతో సంజూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సామ్ కరన్, జమీ ఓవర్టన్ వంటి బౌలర్లను లక్ష్యంగా చేసుకుని మైదానం నలుమూలలా షాట్లు కొట్టాడు. కేవలం 26 బంతుల్లోనే తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇందులో 8 ఫోర్లు, 4 సిక్సర్లు ఉండటం విశేషం. సంజూ బ్యాటింగ్ ధాటికి భారత్ కేవలం 8.3 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును దాటింది. ఇది టీ20 వరల్డ్ కప్ నాకౌట్ చరిత్రలో రెండో వేగవంతమైన వంద పరుగులుగా నమోదైంది.
56
వరుస హాఫ్ సెంచరీలతో రికార్డు ఫామ్
గత మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 పరుగులు చేసిన సంజూ, ఇప్పుడు సెమీఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లోనూ అదే జోరును ప్రదర్శిస్తున్నాడు. ఇషాన్ కిషన్‌తో కలిసి రెండో వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్ తరఫున అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్ లో సంజూ 42 బంతుల్లో 89 పరుగులు నాక్ ఆడాడు. తన ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి.
66
భారీ స్కోరు దిశగా భారత్
భారత్ 13.1 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (39) అవుట్ అయిన తర్వాత శివమ్ దూబే క్రీజులోకి వచ్చి మెరుపులు మెరిపిస్తున్నాడు. అదిల్ రషీద్ వేసిన ఓవర్లో దూబే 90 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. సంజూ శాంసన్ నిలకడగా ఆడుతుండటం, మిగిలిన బ్యాటర్లు కూడా సహకరిస్తుండటంతో భారత్ 230 పరుగులకు పైగా భారీ స్కోరు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇంగ్లాండ్ బౌలర్లు సంజూను అడ్డుకోవడంలో విఫలమవుతుండటంతో టీమ్ ఇండియా సెమీస్‌లో పట్టు బిగిస్తోంది.