
క్రికెట్ ప్రపంచంలో గాడ్ ఆఫ్ క్రికెట్ గా గుర్తింపు పొందిన సచిన్ టెండూల్కర్ సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. అంతర్జాతీయ క్రికెట్లోనే కాకుండా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. సచిన్ టెండూల్కర్ 2013లో ఐపీఎల్‌కు వీడ్కోలు పలికినప్పటికీ, ఆయన నెలకొల్పిన ఒక రికార్డు మాత్రం గత 15 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉంది. ప్రస్తుతం ఆడుతున్న స్టార్ ప్లేయర్లు, దిగ్గజ ఆటగాళ్లు, దిగ్గజ కెప్టెన్లు కూడా ఈ రికార్డును తాకలేకపోతున్నారు.
సచిన్ టెండూల్కర్ ఐపీఎల్ ప్రారంభ సీజన్ 2008 నుండి 2011 వరకు ముంబై ఇండియన్స్ జట్టుకు సారథ్యం వహించారు. ఈ కాలంలో ఆయన జట్టును ఎంతో సమర్థంగా నడిపించారు. ఐపీఎల్ చరిత్రలో ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ తమ జట్లను ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలిపి విజయవంతమైన కెప్టెన్లుగా పేరు తెచ్చుకున్నారు. అయితే, కెప్టెన్‌గా ఒక నిర్దిష్ట జట్టుపై ఓటమి అనేది లేకుండా వరుస విజయాలు సాధించిన విషయంలో మాత్రం సచిన్ టెండూల్కర్ రికార్డు ఇప్పటికీ అజేయంగానే ఉంది.
ఐపీఎల్‌లో ఒక కెప్టెన్‌గా ఏ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఒక జట్టుపై అత్యధిక విజయాలు సాధించిన రికార్డు సచిన్ పేరిట ఉంది. 2008 నుంచి 2011 మధ్య కాలంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా సచిన్, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో ఆరు మ్యాచ్‌ల్లో తలపడ్డారు. ఈ ఆరు మ్యాచ్‌ల్లోనూ ముంబై ఇండియన్స్ ఘనవిజయం సాధించింది. అంటే కేకేఆర్‌పై సచిన్ కెప్టెన్సీలో ముంబై 6-0తో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. సచిన్ మొత్తం 50కి పైగా మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్‌కు నాయకత్వం వహించారు. 2010లో ఆయన నేతృత్వంలోని ముంబై ఫైనల్‌కు చేరుకుంది, కానీ చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమి పాలైంది.
ఒక జట్టుపై ఓటమి లేకుండా అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ల గణాంకాలను పరిశీలిస్తే, సచిన్ టెండూల్కర్ 6-0 రికార్డుతో మొదటి స్థానంలో ఉన్నారు. ఆయన తర్వాత ఉన్న ఆటగాళ్లందరూ కేవలం 3 విజయాల వద్దే ఆగిపోయారు..
• సచిన్ టెండూల్కర్: 6-0 (కేకేఆర్‌పై)
• రజత్ పాటిదార్: 3-0 (సీఎస్‌కేపై)
• అక్షర్ పటేల్: 3-0 (ఎల్ఎస్‌జీపై)
• శుభ్‌మన్ గిల్: 3-0 (ఎస్ఆర్‌హెచ్‌పై)
• ఇయాన్ మోర్గాన్: 3-0 (ఎస్ఆర్‌హెచ్‌పై)
సచిన్ టెండూల్కర్ కేవలం కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గా కూడా ఐపీఎల్‌లో అద్భుతాలు చేశారు. 2008 నుంచి 2013 వరకు ఆయన మొత్తం 78 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 34.84 సగటుతో 2,334 పరుగులు చేశారు. ఇందులో 13 అర్ధ సెంచరీలు, ఒక అద్భుతమైన సెంచరీ ఉన్నాయి. ముఖ్యంగా 2010 సీజన్‌లో సచిన్ విశ్వరూపం ప్రదర్శించారు. ఆ సీజన్‌లో 610 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ ను కైవసం చేసుకున్నారు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ ఆటగాడిగా ఆరెంజ్ క్యాప్ అందుకున్న ఘనత ఆయనకు దక్కుతుంది.
ఈ 15 ఏళ్ల కాలంలో ఐపీఎల్‌లో ఎందరో దిగ్గజ ఆటగాళ్లు కెప్టెన్లుగా బాధ్యతలు చేపట్టారు. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లు తమదైన శైలిలో రాణించినప్పటికీ, సచిన్ నెలకొల్పిన 6-0 రికార్డును మాత్రం ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు. సచిన్ తన ఆటతో, ఆలోచనలతో ముంబై ఇండియన్స్ జట్టును ఒక బలమైన శక్తిగా మార్చారు. రిటైర్మెంట్ ప్రకటించి ఇన్నేళ్లవుతున్నా, సచిన్ సృష్టించిన ఈ మైలురాయి నేటి తరం ఆటగాళ్లకు ఒక సవాల్‌గానే నిలుస్తోంది.